మద్యం బాటిళ్లు ధ్వంసం

ABN , First Publish Date - 2022-07-04T05:57:49+05:30 IST

జిల్లాలో గత రెండేళ్లలో అక్రమ రవాణా చేస్తూ, విక్రయిస్తూ పట్టుబడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్‌డ్యుటీ పెయిడ్‌ మద్యాన్ని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు పోలీసు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు ఆదివారం ధ్వంసం చేశారు.

మద్యం బాటిళ్లు ధ్వంసం
రోడ్డు రోలర్‌తో మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తున్న దృశ్యం

కడప(క్రైం),  జూలై 3: జిల్లాలో గత రెండేళ్లలో అక్రమ రవాణా చేస్తూ, విక్రయిస్తూ పట్టుబడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్‌డ్యుటీ పెయిడ్‌ మద్యాన్ని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు పోలీసు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు ఆదివారం ధ్వంసం చేశారు. నగర శివారుల్లోని ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లోని ఖాళీ స్థలంలో 2020-22 మధ్య కాలంలో పట్టుబడిన వివిధ రాష్ట్రాలకు చెందిన 17,635 బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. అదనపు ఎస్పీ (అడ్మిన్‌) నీలం పూజిత  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని 32 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 151 కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఎన్‌డీపీఎల్‌ మద్యాన్ని  ఎస్పీ ఆదేశాల మేరకు ధ్వంసం చేశామని తెలిపారు. వీటిలో 90 ఎంఎల్‌ టెట్రాప్యాకులు/బాటిళ్లు 834, 180 ఎంఎల్‌ బాటిళ్లు 12,728, 375 ఎంఎల్‌ బాటిళ్లు 246, 500 ఎంఎల్‌ 69, 750 ఎంఎల్‌ 2282, లీటర్‌ బాటిళ్లు 1360 ధ్వంసం చేశామని అదనపు ఎస్పీ తెలిపారు. త్వరలోనే పలు కేసుల్లో పట్టుబడిన డీపీఎల్‌ మద్యంను ధ్వంసం చేయనున్నామని వివరించారు. ఇకపై కూడా దాడులు ముమ్మరంగా చేస్తామని.. ప్రజలు అక్రమ మద్యానికి సంబంధించిన సమాచారాన్ని డయల్‌ 100కు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, ఫ్యాక్షన్‌జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, జిల్లాలోని పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:57:49+05:30 IST