లిక్విడ్‌ యూరియా, జింక్‌ కొంటేనే.. బ్యాంకుల్లో యూరియా

ABN , First Publish Date - 2022-01-14T03:18:26+05:30 IST

లిక్విడ్‌ యూరియా, జింక్‌ సల్ఫేట్‌ కొంటేనే ఓవైపు బ్యాంకులు రైతులకు యూరియా కట్టలు అమ్ముతుండగా.. మరోవైపు ప్రైవేటు దుకాణాదారులు దుక్కిపిండి కొన్నవారికే యూరియా కట్టలు అమ్ముతూ ఆంక్షల వ్యాపారాలకు దిగడంతో మండలంలో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

లిక్విడ్‌ యూరియా, జింక్‌ కొంటేనే..  బ్యాంకుల్లో యూరియా
సాగులో ఉన్న వరి పంట

ప్రైవేటు దుకాణాల్లో దుక్కిపిండి కొంటేనే యూరియా 

ఆంక్షల వ్యాపారాలతో అన్నదాతల ఆందోళన


బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 13: లిక్విడ్‌ యూరియా, జింక్‌ సల్ఫేట్‌ కొంటేనే ఓవైపు బ్యాంకులు రైతులకు యూరియా కట్టలు అమ్ముతుండగా.. మరోవైపు ప్రైవేటు దుకాణాదారులు దుక్కిపిండి కొన్నవారికే యూరియా కట్టలు అమ్ముతూ ఆంక్షల వ్యాపారాలకు దిగడంతో మండలంలో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాలిలా ఉన్నాయి. ఇఫ్‌కో కంపెనీ నానో పేరుతో ద్రవరూపంలో (లిక్విడ్‌) ఉన్న యూరియా ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. నానో యూరియా బాటిల్‌ కొంటేనే సాధారణ యూరియా బస్తాలు అనే ఆంక్షలతో ఆ బాటిల్‌కు రూ.240లు, జింక్‌ సల్ఫేట్‌కు రూ.680లు అదనపు వడ్డనతో  రైతులకు గుదిబండగా మారింది. ఇటీవల వచ్చిన వర్షాలు, వరదలతో గ్రామాలు, పొలాలు ముంపునకు గురై కట్టుబట్టలతో బయటపడిన రైతాంగం పంటలు, నారుమళ్లు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో అప్పులు చేసి మళ్లీ నార్లు పోసుకుని కొంతమంది నాట్లు వేసుకుంటున్నారు. ఇందులో దాదాపు 30శాతం మంది రైతాంగానికి చెందిన పొలాలు నేటికీ సాగుకు పనికిరాక బీడు భూములయ్యాయి.  మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే అదును తప్పి రైతులు యూరియా కొనేందుకే డబ్బులు లేక అల్లాడుతుండగా..  బ్యాంకుల్లో జింక్‌ సల్ఫేటు, నానో లిక్విడ్‌ యూరియా కొంటేనే యూరియా బస్తాలు ఇస్తామనడం.. అలాగే దుక్కిపిండి కొంటేనే యూరియా ఇస్తామని ప్రైవేటు దుకాణాలు రైతులకు ఆంక్షలు పెడుతున్నారు. దీంతో చేసేదిలేక రైతులు యూరియా బస్తాల కోసం లిక్విడ్‌ యూరియా, జింక్‌ సల్ఫేట్‌ కొనక తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై వవ్వేరు బ్యాంకు మేనేజరు శ్రీనివాసులును వివరణ కోరగా.. ఇఫ్‌కో కంపెనీ నానో లిక్విడ్‌ యూరియా తీసుకుంటేనే యూరియా లోడు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. జింక్‌ సల్పేట్‌ వద్దన్న వారిని బలవంతం చేయడం లేదని తెలిపారు.

Updated Date - 2022-01-14T03:18:26+05:30 IST