మద్యం షాపులకు పోలీసు సేవలు!

ABN , First Publish Date - 2021-05-17T06:13:22+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు, కర్ఫ్యూ అమలును చూడాల్సిన పోలీసులు మద్యం దుకాణాల సేవలో తరించడం నున్నలో కన్పించింది. పోలీసులే దగ్గరుండి మరీ మద్యం అమ్మకాలు చేయిస్తున్నారు.

మద్యం షాపులకు పోలీసు సేవలు!
నున్నలో మద్యం అమ్మకాలు చేయిస్తున్న పోలీసులు

 దగ్గరుండి మరీ అమ్మకాలు చేయిస్తున్న వైనం

కరోనా కట్టడి,  కర్ఫ్యూ అమలు చర్యలపై దృష్టి లేదు 

విజయవాడ రూరల్‌  :  కొవిడ్‌ నిబంధనలు, కర్ఫ్యూ  అమలును చూడాల్సిన పోలీసులు మద్యం దుకాణాల సేవలో తరించడం నున్నలో కన్పించింది.  పోలీసులే దగ్గరుండి మరీ మద్యం అమ్మకాలు చేయిస్తున్నారు. గతంలో ఇదే విధానాన్ని అమలు చేసిన పోలీసుశాఖపై విమర్శలు రావడంతో, ఆ విధానాన్ని విరమించుకుంది.  తాజాగా పోలీసు సిబ్బంది గ్రామాల్లో మద్యం దుకాణాల వద్ద ఉంటూ మద్యం అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. విజయవాడ రూరల్‌ మండలం నున్నలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద పోలీసులు సేవలందిస్తున్నారు.   కర్ఫ్యూ సడలింపు సమయం పూర్తవుతున్న సమయంలో సదరు సిబ్బంది కౌంటర్‌ వద్దకు వెళ్లి మరీ మందుబాబులను లైన్‌లో నిలబెట్టారు. పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ, మద్యం దుకాణం వద్ద కొవిడ్‌ నిబంధలు పాటించిన దాఖాలాలు లేవు.  కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలలో దుకాణాలను మూయించడంతోపాటు రోడ్లపై జన సంచారం లేకుండా చేయాల్సిన పోలీసులు మద్యం దుకాణాల సేవలకే పరిమితమవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉండటంతో,  సహజంగానే అక్కడ రద్దీ నెలకొంటుంది. రద్దీని నివారించే పేరుతో పోలీసు సిబ్బంది మద్యం దుకాణాలకే పరిమితం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మద్యం షాపులు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ పరిధిలోకి వస్తాయి. మద్యం అక్రమ అమ్మకాలు జరగకుండా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఉన్నప్పటికీ, పోలీసుశాఖ పహారా అవసరం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఈబీ, పోలీసులు ఉన్నప్పటికీ దుకాణాల నుంచి మద్యం అక్రమంగా బార్‌లు, బెల్ట్‌ షాపులకు తరలిపోతోంది. బార్‌లు, బెల్ట్‌షాపులలో అదనపు ధరను చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని మందుబాబులు చెబుతున్నారు. అందుకే మధ్యాహ్నంలోగా మద్యం కొనుగోలు చేసేందుకు తాము దుకాణాల వద్ద క్యూలో నిలబడుతున్నట్లు కొందరు చెప్పారు. 

Updated Date - 2021-05-17T06:13:22+05:30 IST