మందెయ్‌.. చిందెయ్‌!

ABN , First Publish Date - 2021-10-12T06:30:52+05:30 IST

‘దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తాం. బెల్ట్‌ షాపులను పూర్తిగా నిర్మూలిస్తాం’ అని చెప్పిన సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మద్యాన్ని పరవళ్లు తొక్కిస్తోంది. మందుబాబులను మత్తులోనే ముంచుతోంది.

మందెయ్‌.. చిందెయ్‌!
ఓ అనధికారిక రెస్టారెంట్‌లో మద్యం సీసాలు, గ్లాసులు

మళ్లీ తెరుచుకున్న బెల్ట్‌షాపులు

బార్లుగా దాబాలు, రెస్టారెంట్లు

అక్కడే సిట్టింగ్స్‌.. చీర్స్‌

అర్ధరాత్రుళ్లూ గ్లాసుల గలగలలు

మామూళ్ల మత్తులో ఎస్‌ఈబీ అధికారులు 


చీరాల, అక్టోబరు 11 : ‘దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తాం. బెల్ట్‌ షాపులను పూర్తిగా నిర్మూలిస్తాం’ అని చెప్పిన సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మద్యాన్ని పరవళ్లు తొక్కిస్తోంది. మందుబాబులను మత్తులోనే ముంచుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో పూర్తిగా మూతపడిన బెల్ట్‌ దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి. దీనికితోడు మొబైల్‌ మద్యం విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. చీరాల, పర్చూరు ఎస్‌ఈబీ సర్కిళ్ల పరిధిలో ఉన్న కొన్ని దాబా హోటళ్లు, రెస్టారెంట్లు అనధికార బార్లుగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా మందుబాబుల సిట్టింగ్‌లు, చీర్స్‌ కొనసాగుతున్నాయి. అర్ధరాత్రుళ్లూ గ్లాసులు గలగలలాడుతున్నాయి. దాబాలు, రెస్టారెంట్ల నిర్వాహకుల నుంచి ఎస్‌ఈబీ అధికారులు మామూళ్లుపుచ్చుకొని మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


దాబాలు, రెస్టారెంట్లలో సిట్టింగ్‌లు 

గతంలో వైన్‌షాప్‌ల వద్ద పర్మిట్‌రూంలు ఉండేవి. అక్కడే మందుబాబులు సిట్టింగ్‌ వేసే వారు. కానీ  మద్యం నూతన విధానంలో ప్రభుత్వమే వైన్‌షాప్‌లను నిర్వహిస్తోంది. అక్కడ  మద్యం సేవించేందుకు అవకాశం లేదు. దీంతో పలుచోట్ల దాబాలు, రెస్టారెంట్లు బార్లుగా మారిపోయాయి. ఇంకొల్లు, పూసపాడు, పర్చూరు, కారంచేడు ప్రాంతంలోని పలు రెస్టారెంట్లలో బాహాటంగానే మద్యం తాగుతున్నారు. చీరాల మండలం ఈపురుపాలెంలో, వేటపాలెం మండలం కొత్తపేట సంపత్‌నగర్‌కాలనీ మూడురోడ్లు కూడలిలోని ఓ బిర్యానీ పాయింట్‌, వాడరేవు జంక్షన్‌, మన్నం అపార్ట్‌మెంట్‌ సమీపంలోని ఓ హోటల్‌, జాతీయ రహదారి-216 నుంచి వేటపాలెంకు వెళ్లే క్రాస్‌రోడ్డు సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో, పందిళ్ళపల్లి తరువాత హైవేలోని ఓ రెస్టారెంట్‌లో అనధికారికంగా మద్యం సేవించేందుకు అనుమతి ఇస్తున్నారు. మంచింగ్‌, ఫుడ్‌, వాటర్‌ బాటిళ్లకు అదనపు ధరలు వసూలు చేస్తున్నారు. ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించకుండా నెలవారీ మామూళ్లు ఇస్తున్నామని ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వాహకులు బహిరంగంగానే చెప్పటం గమనార్హం. 


బెల్టులతోపాటు, మొబైల్‌ విక్రయాలు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలపాటు బెల్ట్‌దుకాణాలపై కఠినంగా వ్యవహరించింది. ఆతర్వాత షరా మామూలే అయ్యింది. అధికార పార్టీ నేతలే కొన్నిచోట్ల ప్రత్యక్షంగా దుకాణాలు నిర్వహిస్తుండగా, మరికొన్ని చోట్ల వారి మద్దతుదారులు ఈ వ్యాపారం సాగిస్తున్నారు. తమ పార్టీ వారు నిర్వహిస్తున్న బెల్ట్‌షాపుల్లోనే మద్యం కొనుగోలు చేయాలని ఇటీవల కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామంలో వైసీపీ నాయకులు దండోరా వేయించడం వారి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇదేసమయంలో మొబైల్‌ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు వ్యక్తులు సర్కారు మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వారితో బేరం కుదుర్చుకొని రాత్రి వేళల్లో ఎక్కువ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. వాటిని మరుసటి రోజు గ్రామాల్లో వాహనాలపై తిరుగుతూ విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాత తెరుస్తుండగా ఈ లోపు మందు కావాల్సిన వారి వద్ద క్వార్టర్‌ బాటిల్‌కు అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎస్‌ఈబీ అధికారులు పట్టించుకోకపోవడం ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది. 




Updated Date - 2021-10-12T06:30:52+05:30 IST