లయన్స్‌క్లబ్‌ సేవలు మరవలేనివి

ABN , First Publish Date - 2022-05-23T06:22:15+05:30 IST

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్‌ ద్వారా ప్రాణాలు కాపాడుతున్న లయన్స్‌క్లబ్‌ సేవలు మరువలేనివని విద్యుత్‌, అటవీశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంసించారు.

లయన్స్‌క్లబ్‌ సేవలు మరవలేనివి
మంత్రి పెద్దిరెడ్డిని అభినందిస్తున్న లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు

మంత్రి పెద్దిరెడ్డి  


పుంగనూరు/పుంగనూరు రూరల్‌, మే 22: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్‌ ద్వారా ప్రాణాలు కాపాడుతున్న లయన్స్‌క్లబ్‌ సేవలు మరువలేనివని విద్యుత్‌, అటవీశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంసించారు. ఆదివారం పుంగనూరు సమీపంలోని రాంపల్లె వద్ద లయన్స్‌ సేవా సదన్‌ ఉచిత డయాలసిస్‌ సెంటర్‌ తొలి వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో సేవా కార్యక్రమాలు అందిస్తున్న లయన్స్‌క్లబ్‌కు ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తామన్నారు. జిల్లా నలుమూలల పేదలకు డయాలసిస్‌ సేవలు అందించాలని కోరారు. ప్రతి రోజు 30మంది చొప్పున ఈ ఏడాదిలో 7000 మందికి డయాలసిస్‌ చేయడం అభినందించ దగ్గ విషయమన్నారు. లయన్స్‌  ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ... లయన్స్‌క్లబ్‌ ద్వారా పేదలకు అనేక సేవాకార్యక్రమాలు అందించడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. లయన్స్‌క్లబ్‌ అందిస్తున్న సేవలను సెంటర్‌  ప్రాజెక్టు చైర్మన్‌ డాక్టర్‌ శివ వివరించారు. 

సంచార పశు ఆరోగ్య వాహనం ప్రారంభం

వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని పెద్దిరెడ్డి ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాల్లోని పాడి  పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అంబులెన్స్‌ ద్వారా వైద్యసేవలు అందిస్తునట్టు తెలిపారు. అనంతరం మంత్రి  ఆర్టీసీ బస్టాండ్‌లో పుంగనూరు-రాయచోటి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, జానపద కళల సంస్థ అకాడమీ చైర్మన్‌ నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీంబాషా, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డియాదవ్‌, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు జ్ఞానప్రసన్న, వైస్‌ ఎంపీపీ ఈశ్వరమ్మ, లయన్స్‌క్లబ్‌ మల్టిపుల్‌ డిస్ర్టిక్ట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ భానుమూర్తిరెడ్డి, డిస్ర్టిక్ట్‌ గవర్నర్‌ భక్తవత్సలరెడ్డి, వరదారెడ్డి, సరళమ్మ, ముత్యాలు,  మంజునాథ్‌, పలువురు అధికారులు, వైసీపీ నేతలు  పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-23T06:22:15+05:30 IST