‘ఆర్థికం’ అతలాకుతలం!

ABN , First Publish Date - 2022-05-14T07:55:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు అశనిపాతంగా మారింది.

‘ఆర్థికం’ అతలాకుతలం!

  • బడ్జెట్‌ అప్పులకు, గ్యారంటీ అప్పులకు లింకు
  • గత రెండేళ్ల అప్పులను లెక్కగడతామన్న కేంద్రం
  • ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర సర్కారు
  • రాష్ట్ర ప్రభుత్వ అప్పులకు కేంద్రం అడ్డుకట్ట.. 
  • బడ్జెట్‌ అప్పులకు, గ్యారంటీ అప్పులకు లింకు


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు అశనిపాతంగా మారింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే బడ్జెట్‌ అప్పులు, గ్యారంటీ అప్పులు కలిపి రాష్ట్ర జీఎ్‌సడీపీలో 25 శాతానికి మించరాదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గత రెండేళ్ల (2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల)లో చేసిన అప్పులను లెక్కగడతామని తెలిపింది. ఆ రెండేళ్లలో 25 శాతానికి మించి అప్పులు చేసి ఉంటే.. ఆ మేరకు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) చేసే అప్పుల్లో కోత పెడతామని ప్రకటించింది. మిగిలిన మొత్తం అప్పులు చేసేందుకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అయితే కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన మొత్తం అప్పులు జీఎ్‌సడీపీలో 38.10 శాతాన్ని మించిపోయాయి.


దీంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ ద్వారా అప్పుగా తీసుకోవాలనుకున్న రూ.59 వేల కోట్లలో కోత పడే అవకాశముంది. దీనికితోడు గ్యారంటీ అప్పులు పూర్తిగా రాకుండా పోనున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, చేపడుతున్న ప్రాజెక్టుల పనులు కొనసాగించాలంటే.. సర్కారుకు వచ్చే ఆదాయం సరిపోదు. మరోవైపు అప్పులు చేయకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే సొంతంగా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఇందుకోసం కరెంటు, రవాణా, రిజిస్ట్రేషన్‌ వంటి చార్జీలు పెంచడమో, పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచడమో చేయాలి. కానీ, ఇప్పటికే ఆయా చార్జీలు పెంచినందున ఇప్పట్లో మళ్లీ పెంచే అవకాశం లేదు. పెట్రోలుపై పన్నులు పెంచితే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మద్యంపై ఇప్పటికే భారీగా పన్ను విధిస్తున్నందున ఎంత పెంచినా పెద్దగా ఆదాయం రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదాయం పెరగాలంటే సర్కారు ముందున్న ఏకైక మార్గం భూములను అమ్మడం మాత్రమే. అయితే భూములు ఏ మేరకు అమ్ముడుపోతాయో, ఎంత మేర ఆదాయం వస్తుందో తెలియని స్థితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధికారులు ఇప్పటికే కేంద్రానికి నివేదించారు. అప్పులకు అనుమతి ఇవ్వకపోతే.. తమ పరిస్థితి దారుణంగా మారుతుందని చెప్పారు. అప్పుల పరిశీలన నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకోవడం సరికాదని, ఈసారికి వెసులుబాటు కల్పించాలని కోరారు. 


ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఎప్పుడూ ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన సెక్యూరిటీ బాండ్లను ఆర్‌బీఐ వద్ద తనఖా పెట్టి భారీగా అప్పులు తెస్తూ బడ్జెట్‌ హామీలను నెరవేరుస్తూ వచ్చింది. కొత్త రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు, కోరికలు కొత్తగా ఉంటాయన్న ఉద్దేశంతో.. ప్రజలు అడిగినా, అడగకపోయినా కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతూ అమలు చేసింది. వాస్తవ రాబడుల ఆధారంగా కాకుండా, పథకాలే ప్రధాన ఉద్దేశంగా భారీ బడ్జెట్లను ప్రవేశపెడుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, అప్పులను నమ్ముకుని గొప్పలకు పోయింది. మొదట్లో గ్రాంట్లు లక్ష్యం మేర సమకూరినా.. గతేడాది నుంచి తేడా వస్తోంది. అప్పుల సంగతి సరేసరి. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిపుష్టి కలిగి ఉందని, వ్యవసాయ, పారిశ్రామిక, తయారీ రంగాల గణనీయ ప్రగతితో జీఎ్‌సడీపీ ఆశాజనకంగా ఉందని చెబుతూ అప్పుల బాట పట్టింది. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటోంది. కానీ, ఈసారి పరిస్థితి తారుమారైంది. కేంద్ర ప్రభుత్వం ఎదురు తిరిగింది.


అడ్డగోలుగా అప్పులు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. ఆర్‌బీఐ ద్వారా తీసుకునే మార్కెట్‌ రుణాలకు అనుమతులను నిలిపివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో తీసుకోదలచిన రూ.3 వేల కోట్ల రుణం, మే 2న తీసుకోదలచిన మరో రూ.3 వేల కోట్ల రుణం రాకుండాపోయింది. ప్రతి నెలా సమకూరే రాబడులను బట్టి అవసరమైన మేర అప్పు తీసుకుంటూ నెట్టుకురావాలన్నది ఆర్థిక శాఖ ప్రాథమిక సూత్రం. కానీ, రూ.6 వేల కోట్ల అప్పు పుట్టకపోవడంతో నెలవారీ చెల్లింపులు, వ్యయాలకు ఇబ్బంది వచ్చి పడింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సహా మిగతా నాలుగు రాష్ట్రాలు ఈ నెల 10న రూ.7500 కోట్ల అప్పు తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం మే 2న తీసుకోవాల్సిన రూ.3 వేల కోట్ల అప్పును రీషెడ్యూల్‌ చేసుకోలేకపోయింది.

  

పూచీకత్తు అప్పుల వల్లే సమస్య..

రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్‌ అప్పుల కంటే పూచీకత్తు అప్పులే పెద్ద గుదిబండగా మారుతున్నాయి. అప్పులు తెచ్చుకోవడానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అప్పులపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పూచీకత్తు(గ్యారంటీ) అప్పులను చూపించి బడ్జెట్‌ అప్పుల్లో కోత విధిస్తామని చెబుతోంది. బడ్జెట్‌లో పొందుపరిచే అప్పులే కాకుండా.. ప్రభుత్వం ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ కార్పొరేషన్లు, రోడ్డు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, డిస్కమ్‌లు, టీఎస్‌ జెన్‌కో పేరిట గ్యారంటీ అప్పులు తెస్తోంది. వీటిని కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల్లోనే పరిగణిస్తామని కేంద్రం చెబుతోంది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం అప్పులు తీసుకోకుండా నిలిపివేసింది. 2020-21 సంవత్సరం నుంచే బడ్జెట్‌ అప్పులతో పాటు గ్యారంటీ అప్పులను కలిపి లెక్కిస్తామని, అప్పుడు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు దాటాయా అన్నది పరిశీలించి, ప్రధాన అప్పుల్లో కోత విధిస్తామని తేల్చి చెప్పింది.


నిజానికి 2020-21లో ప్రధాన అప్పులు, గ్యారంటీ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించిపోయాయని ‘కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)’ ఇటీవల అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. 2021 మార్చి నాటికి రాష్ట్ర బడ్జెట్‌ అప్పులు రూ.2,78,018 కోట్లు ఉన్నాయని, గ్యారంటీ అప్పులు రూ.97,940 కోట్లు అని వెల్లడించింది. ఈ రెండూ కలిపి మొత్తం రాష్ట్ర అప్పులు రూ.3,75,958 కోట్లకు చేరుతాయని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ) రూ.9,80,407 కోట్లుగా తేలిందని ప్రకటించింది. ఈ జీఎ్‌సడీపీలో అప్పుల శాతం 38.10 శాతంగా నమోదైందని తెలిపింది. 


లోపించిన ఆర్థిక క్రమశిక్షణ..

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీఎ్‌సడీపీలో అప్పులు 25 శాతానికి మించరాదు. బడ్జెట్‌ అప్పులు ఈ 25 శాతం లోపే ఉన్నప్పటికీ.. గ్యారంటీ అప్పులు కలుపుకొంటే 38.10 శాతానికి చేరుతున్నందున ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని కాగ్‌ ఆక్షేపించింది. ఇలా 2020-21 ఆర్థిక సంవత్సరపు అప్పులు, గ్యారంటీ అప్పులు, 2021-22 సంవత్సరపు అప్పులు, గ్యారంటీ అప్పులను లెక్కగట్టి... 25 శాతానికి మించిన అప్పులను పరిగణలోకి తీసుకుని 2022-23 ఆర్థిక సంవత్సరపు అంచనా అప్పుల్లో కోతలు విధిస్తామని కేంద్రం చెబుతోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇదే ఫార్ములాను అనుసరించాలని నిర్ణయిస్తే... రాష్ట్రానికి గడ్డుకాలమే. కేంద్ర నిర్ణయం మేరకు అప్పుల్లో కనీసం 20-30 శాతం మేర కోత పడినా... ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతం వరకు రూ.4,102 కోట్ల మూలధన వ్యయ అప్పులను కలుపుకొని మొత్తం రూ.59,632 కోట్ల మార్కెట్‌ రుణాలను సేకరిస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ఇవి కాకుండా బడ్జెట్‌కు అవల వివిధ కార్పొరేషన్లకు ఇచ్చే పూచీకత్తుల అప్పుల కింద మరో రూ.34,873 కోట్లను తీసుకుంటామని బడ్జెట్‌లో చెప్పింది. పూచీకత్తుల అప్పులను తీసుకోకుండా వాటికి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసినా పెద్దగా ఇబ్బంది ఉండదు. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రూ. 59వేల కోట్ల అప్పును మాత్రం తీసుకోక తప్పదు. ఎందుకంటే ఈ అప్పును నమ్ముకునే ప్రజాకర్షక పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. 


భూములను తెగనమ్మడమే మార్గమా?

ఆదాయాన్ని పెంచుకునే మార్గాలన్నీ మూసుకుపోతుండడంతో భూముల అమ్మకాన్ని ప్రభుత్వం నమ్ముకునే అవకాశముంది. దీని ద్వారా ఈ బడ్జెట్‌లో రూ.15,500 కోట్లను అంచనా వేసింది. టీఎ్‌సఐఐసీ వద్ద ఉన్న భూములను పెద్ద మొత్తంలో అమ్మడం ద్వారా ఈ నిధులను సమకూర్చుకోవాలని యోచిస్తోంది. డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌(దిల్‌) సంస్థ భూములు కూడా అందుబాటులో ఉన్నా.. విభజన చట్టం ప్రకారం ఈ భూములపై ఆంధ్రప్రదేశ్‌ పేచీ పెడుతోంది. వీటిని ఇప్పట్లో అమ్మడానికి వీలు కాదు. రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకం ద్వారా  రూ.2000 కోట్లు వస్తాయని అంచనా వస్తోంది. ఏమైనా భూముల అమ్మకం ద్వారానే కొంత ఊరట లభించే అవకాశముంది.


సంక్షేమ పథకాలకు నిధులు ఎలా?

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం దళిత బంధుకు ఈసారి ఏకంగా రూ.17,700 కోట్లను కేటాయించింది. రైతుబంధుకు రూ.14,800 కోట్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రూ.12,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు, 24 గంటల విద్యుత్తు సబ్సిడీకి రూ.10,500 కోట్లు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌కు రూ.2,750 కోట్లు.. ఇలా భారీగా నిధులు కేటాయించింది. ఇలాంటి పథకాల కోసం నిధులను సర్దుబాటు చేయాలంటే అప్పులు తెచ్చుకోవాల్సిందే. పైగా... కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల కింద ఈసారి రూ.40,002 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇలా అప్పులు రూ.59 వేల కోట్లు, గ్రాంట్లు రూ.40 వేల కోట్లు కలిపి మొత్తం రూ.లక్ష కోట్లను నమ్ముకుని రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అంచనా వేసిన స్థాయిలో గ్రాంట్లను విడుదల చేయడం లేదు. గత ఏడాది రూ.38,669.46 కోట్ల గ్రాంట్లను అంచనా వేస్తే రూ.8,619.26 కోట్లే వచ్చాయి. ఈసారి కూడా అంచనా మేరకు వస్తాయన్న గ్యారంటీ లేదు.


దీంతో అప్పులే దిక్కవుతాయి. కానీ, అప్పులకూ కేంద్రం అడ్డుకట్ట వేస్తోంది. అప్పుల్లో కోతలు విధించాలని కేంద్రం నిర్ణయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన రూ.59 వేల కోట్ల అప్పుల్లో సగానికి సగం తగ్గిపోయినా ఆశ్చర్చపోనక్కరలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది.


ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలుఉన్నాయా?

అప్పులు లభించని పక్షంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల ద్వారా రూ.40 వేల కోట్లను సేకరించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కానీ, ప్రత్యామ్నాయ మార్గాల దారులు కూడా మూసుకుపోయాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జీఎ్‌సటీని పెంచాలన్నా తగ్గించాలన్నా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జీఎ్‌సటీ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. రాష్ట్ర పరిధిలో ఉన్న పెట్రోలు, మద్యంపై విధించే వ్యాట్‌ను పెంచుదామంటే పరిస్థితి అనుకూలంగా లేదు. ఇక మద్యంపై ఇప్పటికే విధిస్తున్న 70 శాతం వ్యాట్‌ను పెంచినా.. రాబడి రూ.2000-3000 కోట్లకు మించదు. మరోవైపు రిజిస్ట్రేషన్‌ చార్జీలను ఇటీవలే పెంచింది. ఏడాదికోసారి పెంచాలన్న నిర్ణయం మేరకు వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో మళ్లీ పెంచినా... మిగిలిన రెండు మూడు నెలల కాలానికి మహా అయితే రూ.500-1000 కోట్ల వరకు అదనపు రాబడి ఉంటుంది. మోటారు జీవిత కాల పన్ను పెంపు ద్వారా అదనంగా రూ.1000 కోట్ల దాకా వచ్చే అవకాశమున్నా ఇది పెద్దగా లెక్కలోకి రాదు. మైనింగ్‌ సీనరేజీ చార్జీలనూ పెంచేసింది. ఇలా ప్రత్యామ్నాయ మార్గాలు పెద్దగా కనిపించడం లేదు. దీంతో అప్పులను నమ్ముకోక తప్పదు. 


Read more