లింక్ క్లిక్ చేస్తే అంతే!

ABN , First Publish Date - 2020-03-14T06:25:47+05:30 IST

మియాపూర్‌కు చెందిన స్నేహ మొబైల్‌కి ఒక మెసేజ్‌ వచ్చింది. అందులో ఒక లింక్‌ ఉంటే క్లిక్‌ చేసింది. ఆ వెంటనే ఫోన్‌ స్విచాఫ్‌ అయింది. మళ్లీ ఫోన్‌ ఆన్‌ చేసిన స్నేహ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

లింక్ క్లిక్ చేస్తే అంతే!

మియాపూర్‌కు చెందిన స్నేహ మొబైల్‌కి ఒక మెసేజ్‌ వచ్చింది. అందులో ఒక లింక్‌ ఉంటే క్లిక్‌ చేసింది. ఆ వెంటనే ఫోన్‌ స్విచాఫ్‌ అయింది. మళ్లీ ఫోన్‌ ఆన్‌ చేసిన స్నేహ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తన పనిలో పడిపోయింది. ఆ తరువాత స్నేహ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది.


వైజాగ్‌లో ఉండే సౌరభ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఓరోజు ఫేస్‌బుక్‌ పేరుతో వచ్చిన ఓ లింక్‌ను క్లిక్‌ చేశాడు. వెంటనే ఫేస్‌బుక్‌ పేజ్‌ ఓపెన్‌ అయింది. నిజమైన ఫేస్‌బుక్‌ పేజే అనుకుని అందులో యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేశాడు. అంతే... అతడి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాకర్ల బారినపడింది.


ఇలాంటి వార్తలు రోజూ వింటూనే ఉన్నాం. అనవసరమైన లింకులు క్లిక్‌ చెయ్యొద్దని, మోసపోవద్దని చదువుతూనే ఉన్నాం. అయినా అందరూ పెడచెవిన పెడుతూనే ఉన్నారు. అందుకే  థియరిటికల్‌గా కాకుండా లింకులు క్లిక్‌ చేస్తే ఏమవుతుందో, ఇతర సైబర్‌ నేరాలు ఎలా జరుగుతాయో డెమోలతో వివరించే ప్రయత్నం చేసింది ‘ఆంధ్రజ్యోతి’... 


ఇక్కడ మీరు చూస్తున్నది ఒక మహిళకు సంబంధించిన ఫోటో. రాత్రి 11 గంటల సమయంలో బెడ్‌ మీద పడుకుని ఫోన్‌ బ్రౌజ్‌ చేస్తూ మేము పంపించిన లింక్‌ క్లిక్‌ చేసింది. వెంటనే ఆమెకు తెలియకుండా, కనీసం స్ర్కీన్‌ మీద ఎలాంటి ప్రివ్యూ కనిపించకుండా ఆమె ఫొటో ఇలా వచ్చింది. (ఆమె ప్రైవసీని కాపాడటం కోసం ఫొటోని బ్లర్‌ చేశాం). మీరు ఫోటో చూస్తే ఆమె లింకు క్లిక్‌ చేసిన విషయం, ఫొటో రిసీవ్‌ అయిన విషయం కూడా టెర్మినల్‌లో అప్‌డేట్‌ అవడం గమనించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కేవలం ఫోటోలు మాత్రమే కాదు, వీడియో కూడా లైవ్‌గా మీకు తెలియకుండానే చూడొచ్చు. కాబట్టి ప్రత్యేకంగా మహిళలు ఇలాంటి లింకుల విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.




పాస్‌వర్డ్‌ల ఎంపిక

చాలామంది తమ భార్య లేదా ప్రేయసిని ‘బంగారం’ అని పిలుస్తుంటారు. అంతటితో సరి పెట్టుకుంటే బానే ఉంటుంది. అలా కాకుండా జీమెయిల్‌ వంటి వాటికి పాస్‌వర్డ్‌ కూడా ఆ పేర్లనే పెట్టుకుంటారు. బంగారం, వజ్రం, పవన్‌ కల్యాణ్‌, తెలంగాణ, శ్రీనివాస్‌, రాము, కుమార్‌ వంటి పేర్లని పెట్టుకుంటే సులభంగా గుర్తిస్తారు. వివిధ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో సహా ఈ ఫోటోలో చూస్తున్న విధంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ‘బంగారం’ అనే పాస్‌వర్డ్‌ పెట్టుకున్న అనేక మంది మెయిల్‌ ఐడిలతో సహా నేను తెలుసుకున్న విషయం మీరు గమనించవచ్చు. (ప్రైవసీ కోసం వాటిని బ్లర్‌ చేశాం) కాబట్టి ఇకమీదట సులభమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం మానేయండి.


అకౌంట్లన్నీ హ్యాక్‌ 

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి అకౌంట్లను హ్యాక్‌ చేయడం చాలా సులభం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఎంపిక చేసుకుంటే చాలు. ఒక ఫిషింగ్‌ పేజ్‌ సిద్ధమవుతుంది. ఆ లింకుని బాధితులు  క్లిక్‌ చేసి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయగానే వెంటనే ఆ సమాచారం హ్యాకర్‌ స్ర్కీన్‌ మీద కనిపిస్తుంది. ఇక్కడ డెమో కోసం చేసిన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ మీరు చూడొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం సైబర్‌ నేరాలు ఫిషింగ్‌ ఎటాక్‌ల ద్వారానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి ఎటాక్‌ల ద్వారా మీ డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు,  యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తుంటారు.



ఫోటో డౌన్‌లోడ్‌ చేస్తే..!

చాలామంది ఇంటర్నెట్‌లో వివిధ వెబ్‌ సైట్లలో ఉండే ఫోటోలు ఇష్టానుసారం డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే హ్యాకర్లు ఫొటోల్లో కూడా స్పైవేర్లు పొందుపరుస్తారన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇక్కడ మీరు చూస్తే ఒక ఫోటోలో స్పైవేర్‌ నిక్షిప్తం చేయడంతోపాటు, అప్పటికప్పుడు ఒక వెబ్‌ సర్వర్‌ సృష్టించి, దానిని ఇతరులకు షేర్‌ చేయడం ద్వారా వారిని ప్రమాదంలో పడే విధంగా చేయవచ్చు.


ఫేస్‌బుక్‌ ఫోన్‌ నెంబర్లు

ఫేస్‌బుక్‌లో చాలామంది తమ ఫోన్‌ నెంబర్లు పెడుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తే గనుక భారీ మొత్తంలో ఫేస్‌బుక్‌ యూజర్ల ఫోన్‌ నెంబర్లని వారికి తెలియకుండా ఒకదాని తర్వాత మరొకటి సేకరించడం జరుగుతోంది. వారు ఫోన్‌ నెంబర్‌ని ప్రైవేట్‌గా పెట్టుకున్నప్పటికీ కూడా కొన్ని పద్ధతులను ఉపయోగించి హ్యాకర్లు తెలుసుకుంటూ ఉంటారు. ఫేస్‌బుక్‌లో ఫోన్‌ నెంబర్‌ పెట్టడం ఎంతవరకు సురక్షితమో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక యూజర్‌ ఐడీ ఎంటర్‌ చేస్తే చాలు, ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించవచ్చు. కాబట్టి సోషల్‌ మీడియా సురక్షితం అని భావించకండి.


రియల్‌ టైమ్‌ లొకేషన్‌ 

ఇంతకు ముందు చెప్పుకున్న విధంగానే, మీకు రకరకాల కబుర్లు చెప్పి ఒక లింకు పంపించి, మీ చేత క్లిక్‌ చేయిస్తే చాలు. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. అంతేకాదు మీరు ఎటువైపు ప్రయాణిస్తున్నారో రియల్‌ టైం లొకేషన్‌ కూడా అప్‌డేట్‌ అవుతూ ఉంటుంది. ఒక లింకు క్లిక్‌ చేస్తే ఏమవుతుందిలే అనే ధీమాలో ఉండేవారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.

ఇప్పటివరకు ఎక్కడా హ్యాకింగ్‌ గురించి ఇలా ప్రాక్టికల్‌గా ఎవరూ వివరించలేదు. పాఠకులకు సైబర్‌ మోసాల గురించి మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నాన్ని ‘ఆంధ్రజ్యోతి’ చేసింది. కాబట్టి ఇకమీదట మరింత జాగ్రత్తగా వ్యవహరించండి.


ఫోన్‌ మొత్తం హ్యాక్‌

ఇక్కడ మీరు చూస్తున్నది ఒక ఫోన్‌ మొత్తాన్ని హ్యాక్‌ చేసి దానికి వచ్చిన ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లను డంప్‌ చేసుకుని చూడడం! 2019లో ఇలా నా ఫోన్‌ను నేనే హ్యాక్‌ చేసుకుని డంప్‌ చేసుకున్న స్ర్కీన్‌ షాట్‌ మీరు చూస్తున్నారు. మీరు చేసే ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, వాట్సప్‌ మెసేజ్‌లు, ఫోన్లో కెమెరాలు, మైక్రోఫోన్లు, లొకేషన్‌, ఫోన్లో ఉండే ఫోటోలు, వీడియోలు, పాస్‌వర్డ్‌లు అన్నీ ఈ పద్ధతి ద్వారా హ్యాక్‌ చేస్తారు. 


ఒకటే యూజర్‌నేమ్‌ వాడితే...

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకునేటప్పుడు, అన్ని చోట్లా ఒకటే యూజర్‌నేమ్‌వాడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. మీ ఒక అకౌంట్‌ పేరు తెలిస్తే చాలు, దాన్ని ఆధారంగా చేసుకుని ఇంకా ఏయే సర్వీసులలో అదే పేరుతో మీకు అకౌంట్‌ ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకటే పాస్‌వర్డ్‌ అన్ని చోట్లా పెట్టినట్లయితే, మీ డిజిటల్‌ ప్రపంచాన్ని మొత్తంగా కొల్లగొట్టే అవకాశం హ్యాకర్‌కి కలుగుతుంది. ఇక్కడ నేను శ్రీనివాస్‌ అనే ఒక వ్యక్తి ఏ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో అకౌంట్‌ కలిగి ఉన్నాడో వెతికి క్షణాల్లో ఫలితాలు పొందిన విషయం మీరు చూడొచ్చు.




(గమనిక: డెమోల కోసం కొంతమంది వ్యక్తిగత సమాచారం, ఫొటోలను వారి డివైజ్‌లని హ్యాక్‌ చేసి సేకరించటం జరిగింది. ఇది పూర్తిగా వారి అనుమతితో సేకరించిన సమాచారం. ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఈ డెమోలను అందించాం.)


నల్లమోతు శ్రీధర్ ‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-03-14T06:25:47+05:30 IST