Abn logo
May 24 2020 @ 01:01AM

లైన్‌ సేల్స్‌ అంటే ?‌ -ఇదీ జిఎస్‌టీ

Kaakateeya

మనం చాలాసార్లు గమనించే ఉంటాం. ఇళ్ల ముందు ఆటోల్లో లేదా ట్రాలీలో బట్టలు, దుప్పట్లు తీసుకువచ్చి అమ్ముతుంటారు. అలాగే కుర్చీలు, ఇతర ప్లాస్టిక్‌ సామా న్లు విక్రయించే వారు కూడా వస్తుంటారు. కొంతమంది  రహదారుల పక్కన సోఫాలు, మంచాలు వంటి ఫర్నీచర్‌ను కూడా అమ్ముతుంటారు. మరి ఇలాంటప్పుడు ఆ వ్యాపారులు ఇన్వాయిస్‌ ఎప్పుడు తయారు చేయాలి? ఎవరి పేరు మీద తయారు చేయాలి? అలాగే ఈ-వే బిల్‌ లో సరుకు అందుకునే వ్యక్తిగా ఎవరిని చూపాలి? మొదలైన సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఎందుకంటే సరుకు వారివారి దుకాణాల నుంచి కానీ లేదా గోదాము నుంచి కానీ బయలుదేరిన తర్వాత ఈ-వే బిల్‌  తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇన్వాయిస్‌ లేదా తత్సమానమైన డాక్యుమెంట్‌ ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఏమి చేయాలో చూద్దాం. 


దుకాణంలో కూర్చుని సరుకు పంపటం కాకుండా ఇంటింటికి తిరిగి అమ్మటాన్ని ‘లైన్‌ సేల్స్‌’ గా వ్యవహరిస్తారు. ఇక్కడ సరుకు పంపే సమయానికి కొనుగోలు చేసే వ్యక్తి గురించి లేదా అమ్ముడుబోయే సరుకు విలువ గురించి ఎలాంటి అవగాహన ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఇన్వాయిస్‌ ఇవ్వటం కుదరదు కాబట్టి ముందుగా సరుకుకు సంబంధించి ఒక డెలివరీ చలాన్‌ తయారు చేసుకోవాలి. ఈ-వే బిల్‌లో ‘లైన్‌ సేల్స్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వాహన వివరాలు, మిగతా వివరాలను మామూలుగా నింపాలి. సరుకు పొందే స్థానంలో ‘సెల్ఫ్‌’ అని నింపాలి. దీంతో పాటు ఒక ఇన్వాయిస్‌ బుక్‌ తీసుకుని పోవాలి. సరుకు అమ్ముడుపోగానే అక్కడిక్కడే సరుకు వివరాలు, విలువ, టాక్స్‌తో పాటు కొనుగోలుదారుని వివరాలతో ఇన్వాయిస్‌ తయారు చేయాలి.  


అలాగే బంగారు, వెండి నగలు విక్రయించే హోల్‌సేల్‌ వర్తకులు కొత్త మోడల్స్‌ వచ్చిన ప్రతిసారి చిన్నచిన్న వ్యాపారస్తుల దగ్గరకు ఆ నగలను పంపిస్తుంటారు. రిటైల్‌ వర్తకులు వాటిని పరిశీలించి నచ్చితే వాటిని కొనుగోలు చేస్తారు. అలాగే బడా బట్టలు, రెడీమేడ్‌ దుకాణదారులు సహా ఇతర వ్యాపారాల్లో ఉన్న చాలా మంది ఇదే పద్ధతి పాటిస్తారు. మొదటి సందర్భానికి... దీనికి తేడా ఏమిటంటే ఇక్కడ తాను ఏయే దుకాణాలకు వెళ్లేది వ్యాపారికి ముందుగానే తెలుసు కానీ ఎంత సరుకు అమ్ముడుపోయేది తెలియదు. కాబట్టి ఇక్కడ కూడా ఇదే విదంగా డెలివరీ చలాన్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ-వే బిల్‌ కూడా పైన తెలిపిన విధంగా తయారు చేయాలి. అయితే, ఈ-వే బిల్‌ అవసరం లేని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో డెలివరీ చలాన్‌ ఉంటే సరిపోతుంది. అలాగే, పైన తెలిపినట్లు ఇన్వాయిస్‌ బుక్‌ తీసుకెళ్లటం తప్పనిసరి. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు వస్తువులను తీసుకుని వెళుతున్నా ఇదే పద్ధతి పాటించాలి. కాబట్టి జీఎ్‌సటీ కింద రిజిస్ట్రేషన్‌ ఉండి పైన తెలిపిన విధంగా సరుకును బయటకు పంపే వాళ్లు ఈ నియమాలను జాగ్రత్తగా పాటించాలి. 

గమనిక: ఈ వ్యాసాల ద్వారా ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత చట్టాలు/నిబంధనలను కూలంకషంగా పరిశీలించాలి. 


Advertisement
Advertisement