ఆర్భాటాలకే పరిమితం

ABN , First Publish Date - 2022-05-11T05:30:00+05:30 IST

ఇది జరిగి ఏడాది అవుతున్నా అన్నమయ్య జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కేవలం రెండింటిలో మాత్రమే అగ్రీ ల్యాబ్‌లు ప్రారంభమయ్యాయి.

ఆర్భాటాలకే పరిమితం
మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ వద్ద మూసివేసిన అగ్రీ ల్యాబ్‌

అగ్రీ ల్యాబ్‌ల ద్వారా రైతులకు అందని సేవలు

ఏడాదైనా ప్రారంభం కాని నాలుగు అగ్రీ ల్యాబ్‌లు


మదనపల్లె టౌన్‌, మే 11: డాక్టర్‌ వైఎస్సార్‌ అగ్రీ ల్యాబ్‌ల ద్వారా రైతులకు మరిన్ని సేవలందిస్తాం. విత్తనాలు, ఎరువులు, మట్టి నమూనాల నాణ్యత పరిశీలనతో పాటు, పశువులకు సోకే వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రకటించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అగ్రీ ల్యాబ్‌ ఏర్పాటుకు నాంది పలికింది. ఇది జరిగి ఏడాది అవుతున్నా అన్నమయ్య జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కేవలం రెండింటిలో మాత్రమే అగ్రీ ల్యాబ్‌లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చూస్తే ప్రారంభించి ఎనిమిది నెలలవుతున్నా ఇంకా ఈ ల్యాబ్‌లు పురిటి కష్టాలతోనే నడుస్తున్నాయి. రైతులకైతే సేవలు అందించడంలో వెనుకబడిపోయాయి. అన్నమయ్య జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు గాను గత ఏడాది మొదట్లో ఆరు అగ్రీ ల్యాబ్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్కటి రూ.64 లక్షల చొప్పున రూ.3.84 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మదనపల్లె, ములకలచెరువు, పీలేరు వ్యవసాయ మార్కెట్‌యార్డుల వద్ద ఉన్న స్థలాల్లో, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటిలో కూడా అగ్రీ ల్యాబ్‌ల నిర్మాణాలు మొదలయ్యాయి. మదనపల్లె, ములకలచెరువులో మాత్రమే నిర్మాణాలు పూర్తి కాగా రైల్వేకోడూరు, పీలేరులో ఫైనల్‌ స్టేజిలోను, రాజంపేటలో ఎలివేషన్‌ స్టేజిలోను, రాయచోటిలో ఎలక్ట్రికల్‌ పనులు జరుగుతున్నాయి.


రైతులకు అందని సేవలు

మదనపల్లె, ములకలచెరువులో గత ఏడాది జూలైలో అగ్రీ ల్యాబ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ రెండు చోట్ల ఇద్దరు వ్యవసాయ శాఖాధికారులు (ఏవో), నలుగురు ఏఈవోలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ల్యాబ్‌లు లాంఛనంగా ప్రారంభమైనా నాలుగు నెలల వరకు వీటిలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రాలేదు. తీరా యంత్రాలు వచ్చి ఏఈవోలు శిక్షణ తీసుకుని రైతుల నుంచి వచ్చే విత్తనాలు, ఎరువులు, మట్టి నమూనాలు పరీక్ష చేద్దామంటే అసలు రైతులే ఈ అగ్రీ ల్యాబ్‌ల ముఖం చూడటం లేదు. కేవలం కోడింగ్‌ సెంటర్ల నుంచి ఆర్బీకేలకు వచ్చే విత్తనాలు, ఎరువుల నమూనాలను వ్యవసాయ శాఖాధికారులు తీసుకొచ్చి అగ్రీ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నారు. మదనపల్లె అగ్రీ ల్యాబ్‌కు ఎనిమిది నెలలుగా కేవలం ఎనిమిది మంది రైతులు మాత్రమే వచ్చి అగ్రీల్యాబ్‌ సేవలు వినియోగించుకున్నారు. ములకలచెరువులోను ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 


అవగాహన కల్పించకపోవడమే కారణమా..?

ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న అగ్రీ ల్యాబ్‌లలో విత్తన, ఎరువుల పరీక్షలకు వాడే కెమికల్స్‌ కొనుగోలుకు ఒక్కొక్క అగ్రీ ల్యాబ్‌కు ఏటా రూ.లక్షల్లో ఖర్చు వస్తుంది. దీంతో పాటు ఇక్కడ ముగ్గురేసి వ్యవసాయ అధికారులకు జీతభత్యాలు ఇవ్వాల్సి ఉది. ఇంత చేస్తున్నా రైతులు వీటిని ఉపయోగించుకోలేదంటే అగ్రీ ల్యాబ్‌ల ఉపయోగంపై రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ఇదిలా వుంటే మదనపల్లె, ములకలచెరువు అగ్రీల్యాబ్‌లు ఎప్పుడు చూసినా తాళాలు వేసి ఉండటమే కనిపిస్తోంది. అసలు ఇక్కడ అధికారులకు చేయడానికి పనే లేకపోవడంతో వాళ్లు కూడా తాళాలు వేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


ఆర్బీకేల నుంచి వచ్చే విత్తనాలు, ఎరువులు పరీక్షిస్తున్నాం

- శివశంకర్‌, ఏడీఏ, మదనపల్లె

మదనపల్లె, ములకలచెరువులలో అగ్రీ ల్యాబ్‌లలో ఆర్బీకేల నుంచి వస్తున్న విత్తనాలు, ఎరువులు నమూనాల నాణ్యతను పరీక్షిస్తున్నాం. వ్యవసాయశాఖ అధికారులు ఆర్బీకేల నుంచి తీసుకొచ్చిన 23 విత్తనాలు, 34 ఎరువుల నమూనాలను ఇక్కడ పరీక్షించాము. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అగ్రీల్యాబ్‌లో సిబ్బంది ఉండేలా ఆదేశిస్తాం. ఆర్బీకే ద్వారా అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల, వలంటీర్ల ద్వారా అగ్రీల్యాబ్‌ల ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తాం.

Read more