చదువులు ఎలా?

ABN , First Publish Date - 2022-07-12T05:13:05+05:30 IST

చదువులు ఎలా?

చదువులు ఎలా?
ఇచ్ఛాపురం ఎమ్మార్సీకి చేరిన పాఠ్యపుస్తకాలు

- అరకొరగా పాఠ్యపుస్తకాల సరఫరా

- విద్యార్థులకు తప్పని నిరీక్షణ 


- నరసన్నపేట మండలంలోని 82 పాఠశాలల్లో 6,240 మంది విద్యార్థులు చదువుచున్నారు. వీరికి 62వేలు పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, తొలివిడతలో 37వేలు పుస్తకాలు వచ్చాయి. ఇంకా దాదాపు 45శాతం పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. కాగా 1, 2, 8వ తరగతులకు సంబంధించిన పుస్తకాలు ఇంకా రాలేదు. ఈ తరగతుల పాఠ్యాంశాల్లో మార్పులు చేయనుండడంతో ఇంకా ముద్రణ జరుగుతున్నట్టు సమాచారం.


- ఎల్‌.ఎన్‌.పేట మండలం కోవిలాం ప్రాథమిక పాఠశాలకు సంబంధించి పాఠ్యపుస్తకాలు రాలేదు. దీంతో సుమారు 10 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు పాఠశాల మానేసి.. ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోయారు. 


(కలెక్టరేట్‌/ఇచ్ఛాపురం రూరల్‌/నరసన్నపేట)

విద్యావ్యవస్థలో ప్రభుత్వ నూతన విధానాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఓ పక్క కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనంపై నిరసనలు కొనసాగుతున్నాయి. మరోపక్క పాఠశాలలు తెరిచి వారం రోజులవుతున్నా.. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలలకు నిర్దిష్ట ధరకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఎన్ని పుస్తకాలు అవసరమో ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపాయి. కానీ, ఇప్పటిరకూ అరకొరగా పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని ఉపాధ్యాయులు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క పుస్తకం కూడా పంపిణీ కాలేదు. దీంతో విద్యార్థులు పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. 


ఇదీ పరిస్థితి

జిల్లాలో మునిసిపల్‌, జడ్పీ, మండల పరిషత్‌తో పాటు ప్రభుత్వ పాఠశాలలు 2,952 ఉన్నాయి. వీటిలో 3,33,417 మంది విద్యార్థులు చదువుతున్నారు. 539 ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ ప్రైవేటు పాఠశాలల్లో 92,487 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీటితో పాటు ఏపీ మోడల్‌, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ, గిరిజన సంక్షేమ, ఆశ్రమ, కేంద్రీయ విద్యాలయం, కస్తూర్బా, నవోదయ తదితర పాఠశాలలు 270 ఉన్నాయి. వీటిలో 39,408 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతికి సంబంధించి తెలుగు, గణితం పుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఆంగ్లం, నోట్‌బుక్స్‌ జాడ లేదు. రెండో తరగతికి.. తెలుగు, ఆంగ్లం, గణితం పుస్తకాలు రాగా, ఈవీఎస్‌, నోట్‌ పుస్తకాలు రావాల్సి ఉంది. మూడు, ఐదు తరగతులకు సంబంధించి తెలుగు, ఆంగ్లం పుస్తకాలు మాత్రమే వచ్చాయి. నాలుగో తరగతికి సంబంధించి నోట్‌బుక్‌లు తప్ప మిగిలిన పాఠ్యపుస్తకాలు ఇంతవరకు రాలేదు. 6,7, 9,10 తరగతులకు.. తెలుగు, ఆంగ్లం, సాంఘిక శాస్త్రం పుస్తకాలు మాత్రమే వచ్చాయి. 8వ తరగతి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.  ఈ ఏడాది సిలబస్‌ మారడంతో ఇప్పటివరకూ ఒక్క పుస్తకం కూడా పంపిణీ చేయలేదు. దీంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  


గత ఏడాదీ ఇంతే..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గత ఏడాది కూడా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందలేదు. చాలారోజులు పుస్తకాలేని చదువులకే విద్యార్థులు పరిమితమయ్యారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది. పాఠశాలల పునః ప్రారంభం రోజునే జగనన్న విద్యాకానుక కిట్లతోపాటు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నా.. ఆచరణలో విఫలమైంది. ఇప్పటివరకు చాలా పుస్తకాలు గోదాములకు చేరుకోకపోవడంతో.. వాటిని ఎప్పుడు పంపిణీ చేస్తారనేది ప్రశ్నార్థకమవుతోంది. పుస్తకాలు లేకుండా బోధన ఎలా సాగించాలో తెలియక ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. 


పంపిణీ చేస్తున్నాం

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 17,02,091 పాఠ్యపుస్తకాలు అవసరమని ప్రతిపాదనలు పంపాం. రెండు విడతల్లో 14 లక్షలకుపైగా పుస్తకాలు వచ్చాయి. వాటిని పంపిణీ చేశాం. 8వ తరగతికి సంబంధించి కొన్ని సబ్జెక్టుల పుస్తకాలను ఎమ్మార్సీలకు అందజేశాం. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. 

 ఎన్‌.సతీష్‌, జిల్లా మేనేజర్‌, ప్రభుత్వ పుస్తకాల విభాగం 

Updated Date - 2022-07-12T05:13:05+05:30 IST