నిన్న అలా... నేడు ఇలా..!

ABN , First Publish Date - 2021-12-09T05:24:56+05:30 IST

తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను తల్లిదండ్రులు నమ్మకంతో గురుకుల పాఠశాలలో చేర్పిస్తున్నారు.

నిన్న అలా... నేడు ఇలా..!
వంట పనిలో నిమగ్నమైన ఉపాధ్యాయులు

-వంట చేసి వండిపెట్టిన ఉపాధ్యాయులు 

- ఔట్‌సోర్సింగ్‌ సమ్మెబాటతో కష్టాలు

లేపాక్షి, డిసెంబరు 8: తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను తల్లిదండ్రులు నమ్మకంతో గురుకుల పాఠశాలలో చేర్పిస్తున్నారు. అయితే ఇక్కడ వంట చేయాల్సిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమ్మెబాట పట్టడంతో విద్యార్థుల ఆకలి కేకలు మొదలయ్యాయి. అర్ధాకలి తట్టుకోలేక పాఠశాల, కళాశాలలో చదువుతున్న 1140 మంది విద్యార్థులు వారే మంగళవారం వంటా వార్పు పనులు చేసుకున్నారు. విద్యార్థులే వంటమనుషులుగా మారారంటూ ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన కథనానికి ఉపాధ్యాయులు స్పందించారు. బుధవారం ఉపాధ్యాయులే వంట మనుషులుగా మారారు. ఉపాధ్యాయులే పాత్రలు శుభ్రం చేసి వంటలను చేశారు. దీంతో ఆకలి కేకలతోపాటు చదువు కష్టాలు కూడా మొదలయ్యాయి. తరగతి గదులకు స్వస్తి చెప్పి వంట పనుల్లో నిమగ్నమయ్యారు. ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు బాగా  చదువుకుని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా అవుతారని పాఠశాలలో చేర్పించామన్నారు. అయితే ఇక్కడి పరిస్థితుల్లో విరుద్దంగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పాఠశాలలో ఎంతో మంది చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు వారిపిల్లలను పాఠశాలలో చేర్పించారు. అయితే ఈ పాఠశాలలో నెలకొన్న పరిస్థితులు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలకలం రేపుతున్నాయి. తమ పిల్లలు సమయానికి ఏం తింటున్నారో ఎలా చదువుతున్నారోనని పరుగులుతీసి పాఠశాలకు చేరుకుంటున్నారు. వరుస ఘటనలపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా భోజన ఏజెన్సీలు జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది సమ్మెబాట పట్టారన్నారు. వీరిని సంప్రదించి త్వరలో పనుల్లోకి తీసుకుంటామన్నారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తమ బాధలను ఎమ్మెల్సీ ఇక్బాల్‌ దృష్టికి  తీసుకెళ్లారన్నారు. ఆయన స్పందించి సమస్య ను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్నారు.


Updated Date - 2021-12-09T05:24:56+05:30 IST