రోడ్డు ఇలా.. వెళ్లేదెలా ?

ABN , First Publish Date - 2021-01-11T04:44:59+05:30 IST

మండలంలోని కొత్తపేట వద్ద వెలసిన గంగమ్మ ఆలయానికి చాలా చరిత్ర ఉంది.

రోడ్డు ఇలా.. వెళ్లేదెలా ?
ఆలయానికి 200 మీటర్ల దూరంలో దెబ్బతిన్న రోడ్డు

వర్షానికి దెబ్బతిన్న రోడ్లు

నెల రోజులవుతున్నా పట్టించుకోరా అంటూ భక్తుల ఆగ్రహం 


అది కొత్తపేట గంగమ్మ ఆలయం.. దీనికి చింతకొమ్మదిన్నె గంగమ్మ అని కూడా పేరు.. ఈ ఆలయానికి రాయచోటి రోడ్డు నుంచి ఆర్చి గుండా ఒక దారి, కొత్తపేట నుంచి మరో దారి ఉంది. అయితే గత నెల రోజుల కిందట కురిసిన వర్షాలకు రెండు రోడ్లు దెబ్బతిన్నాయి. బాధ్యత గల పాలకులు, అధికారులు మాకెందుకులే అని వదిలేయడంతో ద్విచక్ర వాహనాలు, చిన్న ఆటోలు తప్ప ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. త్వరలో అమ్మవారి తిరునాళ్ల ఉన్నందున ఈ రోడ్డు గుండా ఎలా వెళ్లాలంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


సీకేదిన్నె, జనవరి 10: మండలంలోని కొత్తపేట వద్ద వెలసిన గంగమ్మ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారు. శివరాత్రి అయిపోయిన మూడవ రోజు నుంచి గంగమ్మ అమ్మవారి తిరునాళ్ల మొదలవుతుంది. ఆ తరువాత వారాల్లోనూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుని వెళ్తారు. అయితే గత నెల రోజుల కిందట కురిసిన వర్షాలకు ఆలయానికి వచ్చే రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనాలు, చిన్న ఆటోలు తప్ప ఇతర ఏ వాహనం వెళ్లలేని పరిస్థితి. ఆల యానికి 200 మీటర్ల దూరంలోనే ఇలా జరగ డంతో గ్రామస్తులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరునాళ్ల సమయంలో ట్రాక్టర్లు, జీపులు, ఎడ్లబండ్లు, లారీలు, తదితర వాహనా లతో ఇక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో 2 నుంచి 3 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. అయితే ప్రస్తుతం రోడ్డు దెబ్బతినడంతో వాహన దారులు ప్రమాదాలకు గురవడంతో పాటు నేరుగా ఆలయం వద్దకు చేరుకునే అవకాశం లేకుండా పోయిందని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు దెబ్బతిని నెల రోజులవుతున్నా పట్టించుకొనేవారు లేరా అని ఆగ్రహానికి గురవుతున్నారు. కనీసం తిరునాళ్ల సమయానికైనా రోడ్డును బాగు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్‌ డీఈ రాజగోపాల్‌రెడ్డిని వివరణ కోరగా రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాగానే రోడ్డు నిర్మించి భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. 


రోడ్డుకు మరమ్మతులు చేయాలి 

ఆలయానికి వచ్చే భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన కొలుములపల్లె, లింగారెడ్డిపల్లె, పడిగెలపల్లె, కృష్ణా పురం, కొత్తపేట, లక్కిరెడ్డిపల్లె, తదితర గ్రామస్తులు అనునిత్యం ఈ దారిలో వెళుతుంటారు. అయితే నెల రోజులు దాటినా ఇంతవరకు రోడ్డును బాగు చేయలేదు. ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులు, పాలకులు ఇప్పటికైనా మరమ్మతులు చేయాలి. 

- మహేంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌, కొలుములపల్లె

Updated Date - 2021-01-11T04:44:59+05:30 IST