సర్కారు ఇష్టం

ABN , First Publish Date - 2020-09-20T07:36:17+05:30 IST

ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందికి రెగ్యులర్‌ నియామకాల్లో వెయిటేజీపై అస్పష్టతకు తెర

సర్కారు ఇష్టం

యాజమాన్యానికి నచ్చితే వెయిటేజీ ఇవ్వొచ్చు

ఆ మేరకు సర్వీసు రూల్స్‌ను మార్చొచ్చు

ఇవ్వొద్దనుకుంటే అడిగే హక్కు అభ్యర్థికి లేదు

వెయిటేజీ మార్కులు 20ు దాటడానికి వీల్లేదు

ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కొలువుల్లో

కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీపై హైకోర్టు


హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందికి రెగ్యులర్‌ నియామకాల్లో వెయిటేజీపై అస్పష్టతకు తెర దించుతూ హైకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. విద్యుత్తు సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న సబ్‌ ఇంజనీర్లు, లైన్‌మేన్లు, జూనియర్‌ లైన్‌మేన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లకు రెగ్యులర్‌ నియామకాల్లో వెయిటేజ్‌ మార్కులు ఇవ్వడంపై ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు కట్టబెడుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.


తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ 1996 రూల్‌ 31 ప్రకారం కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ నియామకాల్లో వెయిటేజ్‌ మార్కులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. సర్వీసు రూల్స్‌కు కొంత వెసులుబాటు కల్పించి తాత్కాలిక/కాంట్రాక్టు సర్వీసుకు వెయిటేజ్‌ కల్పించే అధికారాలు గవర్నర్‌కు ఉంటాయని చెప్పింది.

సదరు అధికారం ఉద్యోగం కల్పించే ప్రభుత్వానికి లేదా ప్రభుత్వరంగ సంస్థకు మాత్రమే ఉంటాయని, తాత్కాలిక/కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి వెయిటేజ్‌ కోసం ఒత్తిడి చేసే అధికారం/హక్కు లేదని స్పష్టం చేసింది. పిటిషనర్లు ఎవరూ.. సర్వీసు రూల్స్‌ చట్టబద్ధతను సవాల్‌ చేయనందున దాని జోలికి వెళ్లడం లేదని, ఆయా అంశాలకు సంబంధించి సింగిల్‌ జడ్జి/డివిజన్‌ బెంచ్‌ ముందే తేల్చుకోవాలని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.


హైకోర్టు తాజా తీర్పుతో కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సానుభూతితో ఉన్న ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకొనే అధికారం ఏర్పడింది. వెయిటేజీ 20 శాతానికి తగ్గినప్పటికీ వారిలో కొంతమందికైనా రెగ్యులర్‌ ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ హక్కు కాదని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఏర్పడింది. 




కాంట్రాక్టు విద్యుత్‌  ఉద్యోగుల వివాదం

రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో(విద్యుత్‌ సంస్థలు) కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో వెయిటేజ్‌ మార్కులు ఇవ్వడానికి వ్యతిరేకంగా/అనుకూలంగా పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలు విచారించిన రెండు వేర్వేరు డివిజన్‌ బెంచ్‌లు వేర్వేరు తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పులను సమన్వయ పర్చడానికి ఏర్పాటు చేసిన బెంచ్‌ ఈ అంశాన్ని ముగ్గురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి(ఫుల్‌ బెంచ్‌) నివేదించింది.


ఒకే అంశానికి సంబంధించి హైకోర్టులోని రెండు డివిజన్‌ బెంచ్‌లు పరస్పరం విభేదిస్తూ తీర్పులు వెలువరించడంతో.. అంశం త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయ్యింది. ఈ వ్యాజ్యాలను సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం వెయిటేజీకి సంబంధించి పూర్తి అధికారాలు ప్రభుత్వానికే ఉంటాయంటూ తాజా తీర్పును ఇచ్చింది. 


Updated Date - 2020-09-20T07:36:17+05:30 IST