ఇలా రిజిస్ట్రేషన్‌.. అలా టీకా

ABN , First Publish Date - 2021-02-25T06:47:46+05:30 IST

కొవిడ్‌ టీకా రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది.

ఇలా రిజిస్ట్రేషన్‌.. అలా టీకా

  • రెండో విడత వ్యాక్సినేషన్‌కు లబ్ధిదారుల నమోదు సులభతరం 
  • యాప్‌ ద్వారా చేసుకునే వెసులుబాటు
  • ‘కొవిన్‌’ సాఫ్ట్‌వేర్‌ సరళతరం
  • రాష్ట్రంలో 50 లక్షల మందికి లబ్ధి 
  • దాదాపు 1,046 ప్రభుత్వ ఆస్పత్రులు 
  • 333 ‘ఆరోగ్యశ్రీ’  ప్రైవేటు దవాఖానాల్లో టీకాలు
  • జూలైలోగా వృద్ధులు, కో-మార్బిడిటీస్‌ ఉన్న వారందరికీ రెండో డోసే లక్ష్యం
  • సమాయత్తమవుతున్న రాష్ట్ర వైద్య శాఖ
  • వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ దిశానిర్దేశం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ టీకా రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ అమలుచేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొవిడ్‌ టీకా కోసం లబ్ధిదారులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే వ్యాక్సిన్‌ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటివరకు కొవిడ్‌ టీకా తీసుకోవాలంటే ముందస్తుగా పేరు నమోదు చేసుకొని, కేటాయించిన నిర్ణీత తేదీలో వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్‌ కోసం ‘కొవిన్‌’ సాఫ్ట్‌వేర్‌లో పేరు నమోదు చేసుకుంటేనే టీకా ఇవ్వాలన్న నిబంధనను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇప్పుడు కూడా ఇదే నిబంధన కొనసాగినా... రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే టీకా తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకెళితే తక్షణమే టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేస్తారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారితో పాటు 45 సంవత్సరాలకు పైబడి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి  వ్యాక్సినేషన్‌ చేయనున్న నేపథ్యంలో బుధవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీకా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో టీకా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలతో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్‌కు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. 


వీడియో కాన్ఫరెన్స్‌లోని ప్రధానాంశాలు.. 

వారంలో కనీసం నాలుగు రోజులకు తగ్గకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించాలి. 


దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల ఎంప్యానెల్‌ ఆస్పత్రులు (687), ఆయుష్మాన్‌ భారత్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు (7000) వివరాలను దగ్గరిలోని కోల్డ్‌ చైన్‌ పాయింట్లకు మ్యాపింగ్‌ చేస్తారు. వాటి వివరాలను త్వరలోనే అన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపుతుంది. మార్చి 1 నుంచి ఈ ఆస్పత్రులన్నీ వ్యాక్సినేషన్‌ కేంద్రాలుగా ఉంటాయి. 


రాష్ట్ర, జిల్లా ఆస్పత్రుల స్థాయిల్లోని నోడల్‌ అధికారుల వివరాలను ఫిబ్రవరి 24 సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు అందించాలి.  


టీకా కోసం కొత్తగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బంది వివరాలను నమోదు చేయకూడదు.

  

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అందరికీ మార్చి 1లోగా తొలి డోసు అందించాలి. వీరిలో మిగిలిన వారందరికి మార్చి 6 వరకు వ్యాక్సినేషన్‌ చేయాలి.  


వైద్య సిబ్బందికి ఫిబ్రవరి 25లోగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 


వ్యాక్సిన్‌ వృథాపై సీరియ్‌సగా దృష్టిపెట్టాలి. వేస్టేజ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలి. 


ప్రైవేటు ఆస్పత్రి నోడల్‌ అధికారులకు టీకా కార్యక్రమంపై యుద్ధ ప్రాతిపదికన శిక్షణ ఇవ్వాలి.


రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత ఇలా..

తెలంగాణలో 60 ఏళ్లకు పైబడిన వారు, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు 50 లక్షల మంది ఉంటారని అంచనా. రాష్ట్రంలో 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ కేర్‌ ప్రభుత్వ ఆస్పత్రులు 138, టెర్షరీ కేర్‌ ఆస్పత్రులు 23, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌మెంట్‌ కలిగిన 333 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. మార్చి 1 నుంచి వీటన్నింటా టీకా రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ రిజిస్ట్రేషన్‌, ఆ వెంటనే టీకా ఇస్తారు. జూన్‌, జూలైలోగా ఈ వర్గాలకు రెండు డోసులు ఇవ్వడం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నాలుగు రోజులు వైద్య సిబ్బందికి రెండో డోసు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు పూర్తి చేయనున్నారు. 


రిజిస్ట్రేషన్‌ రెండు రకాలు..

కొవిడ్‌ టీకా కోసం రెండు రకాలుగా రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నారు. ఒకటి అడ్వాన్డ్స్‌ రిజిస్ట్రేషన్‌. అంటే ఇంటివద్ద నుంచే యాప్‌ ద్వారా కొవిడ్‌ టీకా కోసం వివరాలు నమోదు చేసుకోవడం. రెండోది స్పాట్‌. అంటే ప్రభుత్వ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అమలు చేసే ప్రైవేటు ఆస్పత్రులకు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం. 

Updated Date - 2021-02-25T06:47:46+05:30 IST