మంత్రి ఊళ్లో ఇలా

ABN , First Publish Date - 2022-04-24T05:11:02+05:30 IST

ఇది ఆర్థిక మంత్రి సొంత ఊరు. ఒక్క అభివృద్ధి పనీ సవ్యంగా జరగడం లేదు.

మంత్రి ఊళ్లో ఇలా
నత్తనడకన సాగుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం

నత్తనడకన అభివృద్ధి పనులు

పునాదుల్లోనే కూరగాయల మార్కెట్‌ సముదాయం

సాగని వంద పడకల ఆసుపత్రి నిర్మాణం 

ఇండోర్‌ స్టేడియం పూర్తయ్యేదెప్పుడో..? 

ప్రకటనలకే గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం 

ఆర్థిక మంత్రి ఇలాఖాలో ఇదీ పరిస్థితి 


ఇది ఆర్థిక మంత్రి సొంత ఊరు. ఒక్క అభివృద్ధి పనీ సవ్యంగా జరగడం లేదు. కొన్ని పనులకు ఏళ్ల కిందట శంకుస్థాపనలు చేశారు.  పనులు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. మంత్రి స్వగ్రామమే ఇలా ఉంటే .. ఇక రాష్ట్రమంతా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  డోన్‌లో అభివృద్ధి పనులు పూర్తి చేయరా? అని ప్రజలు మంత్రి బుగ్గనను ప్రశ్నిస్తున్నారు. 


డోన్‌, ఏప్రిల్‌ 23: రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఆర్భాటంగా చేశారు. పనుల్లో పురోగతి లేదు. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రహదారిలో గల ఐసీడీఎస్‌ కార్యాలయ ఆవరణలో మున్సిపల్‌ నూతన కార్యాలయ భవన సముదాయానికి మంత్రి బుగ్గన భూమి పూజ చేశారు. రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా నిర్మాణ పనులు ఇంకా స్లాబుల వద్దే ఉన్నాయి. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్లనే పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇలా డోన్‌లో ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. 


నత్తనడకన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం


 18 నెలల క్రితం డోన్‌ గుత్తి రోడ్డులోని రుద్రాక్షగుట్టలో ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాబార్డు నిధులు రూ.20.16 కోట్లతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. జీ+2తో మెయిన్‌ బ్లాకును నిర్మిస్తున్నారు. విజయవాడకు చెందిన కేఎంబీ ప్రాజెక్ట్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జూలై ఆఖరు నాటికి పనులు పూర్తి కావాలి. ఇంకా మెయిన్‌ బ్లాకు పనుల్లో స్లాబులు కూడా పడలేదు. ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలని గడువు పెట్టారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అప్పటికీ  ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి కావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటమే ఆలస్యానికి కారణమనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆస్పత్రి భవనం పూర్తయితే డోన్‌ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. దాని కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. 

  

గొర్రెల పెంపకందారుల శిక్షణ  కేంద్రం మాటేమిటి ? 


ప్యాపిలి మండలంలోని హుశేనాపురం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం ప్రకటనలకే పరిమితమైంది. ఏడాదిన్నర క్రితం హుశేనాపురంలో రూ.5 కోట్లతో గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్‌  ఆమోదం తెలిపింది. అయితే ఇంతవరకు దాని అతీగతి లేదు. దానికి అనుబంధంగా కొమ్మేమర్రిలో రూ.8కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరైంది. ఇది కూడా ప్రకటనలకే పరిమితమైందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మీటింగ్‌లో మంత్రులు వీటి గురించి మాట్లాడుతున్నారు. పనులు మాత్రం ముందుకు పోవడం లేదు.  


పునాదుల వద్దే కూరగాయల మార్కెట్‌ సముదాయం


పట్టణంలోని పాత బస్టాండులో నిర్మిస్తున్న ఆధునిక కూరగాయల మార్కెట్‌ సముదాయం పనులు పునాదుల వద్దే ఉన్నాయి. పాతకూరగాయల మార్కెట్‌ స్థానంలో కొత్తగా రూ.7.6 కోట్ల నిధులతో సెల్లార్‌తో పాటు జీ+1గా  నిర్మిస్తున్నారు. ఏడాది దాటినా నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది. దీంతో గత 15 నెలలుగా రైల్వేస్టేషన్‌లోని రహదారిలో ఉన్న ఖాళీ స్థలంలో టెంట్లు వేసుకుని కూరగాయల మార్కెట్‌ వ్యాపారులు కాలక్షేపం చేస్తున్నారు. కూరగాయల మార్కెట్‌ సముదాయం కోసం వ్యాపారులకు ఎదురుచూస్తున్నారు. 


ఇండోర్‌ స్టేడియం ఎప్పటికి పూర్తయేనో..? 


పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రహదారిలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తయ్యేదీ తెలియడం లేదు. ఇదివరకు ఉన్న ఇండోర్‌ స్టేడియాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్తగా రూ.2 కోట్లతో నిర్మిస్తున్నారు. ఏడాది క్రితం నిర్మాణ పనులకు మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. అయితే ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  


మూడు నెలల్లో పూర్తి చేస్తాం 


కోర్టు కేసుల కారణంగా పట్టణంలోని ఆధునిక కూరగాయల మార్కెట్‌ సముదాయ నిర్మాణ పనుల్లో   జాప్యం ఏర్పడింది. మూడు నెలల్లో  పనులు పూర్తి చేస్తాం. మున్సిపల్‌ నూతన కార్యాలయ భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరును ఆదేశించాం. 


- కేఎల్‌ఎన్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, డోన్‌

Updated Date - 2022-04-24T05:11:02+05:30 IST