కొంచెం ఇష్టం... ఎక్కువ కష్టం!

ABN , First Publish Date - 2021-01-14T07:48:28+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ కొలువుల్లో తెలుగువారే ఎక్కువ. సీమాంధ్రకు చెందిన వేలాది మంది యువకులు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె తదితర నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువుల్లో కుదురుకున్నారు.

కొంచెం ఇష్టం... ఎక్కువ కష్టం!

  • హోమ్‌లో హ్యాపీ.. వర్క్‌లో హార్డ్‌
  • కరోనాతో ఇంటి పట్టునే కొలువులు
  • ఇంటి పనుల్లో పెద్దలకు సాయం
  • కానీ... పని భారం పెరిగిందనే వాదన
  • ఇంక్రిమెంట్లు, జీతాల్లో కంపెనీల కోత
  • ఇంట్లో నుంచి పనిపై నిత్యం ‘నిఘా’
  • ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’లో ఎన్నో కోణాలు
  • ‘ఏరా, ఈసారైనా పండగకు వస్తావా?’... 
  • ఊరి నుంచి అమ్మ ఫోన్‌!

‘కుదరదమ్మా. ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తికాలేదు’... హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కొలువు చేస్తున్న కుమారుడి సమాధానం!

ఇప్పుడు ఆ గొడవే లేదు. ఉగాదికి ఇంటికి వచ్చిన కుమారుడు సంక్రాంతికీ ఇంట్లోనే ఉంటాడు. కళ్లముందే పని చేసుకుంటూ. ఇంటి తిండి తింటున్నాడు. కరోనా కారణంగా వచ్చిన ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’లో ఇలాంటి కోణాలు ఎన్నెన్నో!


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్‌ కొలువుల్లో తెలుగువారే ఎక్కువ. సీమాంధ్రకు చెందిన వేలాది మంది యువకులు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె తదితర నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువుల్లో కుదురుకున్నారు. కరోనాతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలన్నీ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఇచ్చేశాయి. దీంతో.. అత్యధికులు సొంత ఇళ్లకు వచ్చేశారు. బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ తీసుకొని ల్యాప్‌టా్‌పలతో ఇంటి నుంచి పనిచేస్తున్నారు. తొలుత డిసెంబరు వరకు అనుకున్న వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను కొన్ని కంపెనీలు వచ్చే ఏడాది జూన్‌ వరకు పొడిగించాయి. కొన్నయితే 40శాతం ఉద్యోగులను శాశ్వతంగా ఇదే పద్ధతిలో కొనసాగించాలని నిర్ణయించాయి. 

పెద్దలు హ్యాపీ...

‘పిల్లోడు ఇంట్లోనే కూర్చుని కుదురుగా పని చేసుకుంటున్నాడు’ అంటూ పెద్దలు మురిసిపోతున్నారు. చాలాచోట్ల యువకులు తల్లిదండ్రులకు సంబంధించిన వ్యాపారం, వ్యవసాయంలో సాయం చేస్తున్నారు. వీకెండ్‌ పార్టీలు, సినిమాలు, పబ్బులు అన్నీ బంద్‌! అనవసరమైన షాపింగ్‌లు, వీకెండ్‌ పార్టీలు, సినిమాలు, పబ్బులు అన్నీ బంద్‌! ఇంట్లోనే ఉండి, ఇంట్లోనే తింటుండటంతో ఖర్చులు తగ్గి, పొదుపు పెరిగిపోయింది. ఉద్యోగం చేస్తున్న ఊర్లో రూమ్‌లు/ఇళ్లను ఖాళీ చేసేసి... కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘స్టోరేజ్‌ ఫెసిలిటీ సెంటర్‌’లో సామగ్రిని భద్రపరుచుకున్నారు. సింగిల్‌ బెడ్‌ రూమ్‌ సామగ్రికి రూ.3 వేలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ సామగ్రికి రూ.4 వేల నుంచి రూ.5 వేల అద్దె చెల్లిస్తే సరిపోతోంది. తక్కువ సామగ్రి ఉన్న వాళ్లు... తమతోపాటు సొంతూళ్లకు తెచ్చేసుకున్నారు. 


కంపెనీలకు కలిసొచ్చే ఖర్చు... 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో బడా కంపెనీలకు బాగా కలిసిస్తోంది. క్యాబ్‌ ఖర్చుల్లేవ్‌. ఆఫీసులో ఉద్యోగులకు ఎంటర్‌టైన్‌మెంట్‌, సబ్సిడీ ఫుడ్‌ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదు. ఆఫీసు నిర్వహణ ఖర్చూ భారీగా తగ్గిపోయింది. ఇవన్నీ కలిపితే పెద్ద కంపెనీలకు నెలకు రూ.కోటి దాకా అవుతున్నట్లు అంచనా. అలాగే ప్రతి ఏటా ఉద్యోగులకు జీతం పెంచడం, ప్రమోషన్లు ఇవ్వడం రివాజు. కరోనా పేరిట వాటిని పక్కకు పెట్టారు. పెంచడం సంగతి అటుంచి... చాలా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాయి. ఓ బడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బెంగళూరులో ఉద్యోగులకు 15 శాతం హైక్‌ ఇస్తామని తొలుత హామీ ఇచ్చింది. కరోనా కారణంగా దానిని 6.5 శాతానికి కుదించేసింది.


పని పెరిగింది మరి... 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ‘ఆల్‌ హ్యాపీస్‌’ అనుకుంటే పొరపాటే. ‘హోమ్‌’లో ‘వర్క్‌’ విపరీతంగా పెరిగిందని చాలామంది టెకీలు వాపోతున్నారు. గతంలో వారానికి ఒకసారో రెండుసార్లో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ తీసుకుని... అదోరకం ‘లీజర్‌’గా ఫీల్‌ అయ్యేవారు. ఇప్పుడు... పని మొత్తం ఇంటి నుంచి కావడంతో ఇంటికీ, ఆఫీసుకూ తేడాలేకుండా పోయింది. పైగా... ఆఫీసుకు వెళితే సీరియస్‌ పనితోపాటు కొలీగ్స్‌తో కాసేపు కబుర్లు, రెండుసార్లు కాఫీ బ్రేక్‌, ఒక లంచ్‌ బ్రేక్‌తో సరదాగా కూడా కాలం గడిచేది. ఇప్పుడు అవేవీ లేవు. ఇంట్లో ఉన్న వాళ్లు సక్రమంగా పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మేనేజర్‌, టీమ్‌ లీడర్‌ కన్నార్పకుండా ఆన్‌లైన్‌లో చూస్తూనే ఉంటారు. ఓ పది  నిమిషాలు ఆఫ్‌లైన్‌లోకి  వెళితే... వెంటనే కాల్‌ వస్తుంది. లేదా... వాట్సాప్‌ గ్రూప్‌లో ‘హే... వాట్‌ హ్యాపెండ్‌. రెస్పాండ్‌ ఇమ్మీడియట్లీ’ అంటూ మెసేజ్‌లతో వెంటాడతారు. దీనివల్ల గ్రూప్‌లోని ఇతర కొలీగ్స్‌ ముందు తలవంపులు తప్పవు!  పైగా... ఇంట్లోనే ఉన్నారు కదా అంటూ... వారం వర్జ్యం తేడా లేకుండా, శనివారం కూడా పని చేయిస్తున్నారు. ఇక... జూమ్‌ మీటింగ్‌లు సరేసరి! మొత్తంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో 20 నుంచి 30 శాతం పని పెరిగిందని చాలామంది టెకీలు చెబుతున్నారు. ఇక... చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు జీతాలు కోత వేశాయి. వెరసి... ‘వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లో పని ఎక్కువ, జీతం తక్కువ’ అని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు వాపోతున్నారు.


రకరకాల వ్యాపకాలు..

సొంతూళ్లో ఉంటే ఎంత ఖర్చుపెట్టుకొన్నా ఒక ఉద్యోగికి నెలకు రూ.15 వేలు చాలా ఎక్కువ. మిగిలినదంతా ఆదాయే. దాంతో చాలామంది పెట్టుబడులపై దృష్టి పెడుతున్నారు. కొందరు కార్లు కొనుక్కుంటుంటే...పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ ఆర్డర్‌ తీసుకున్నవారు పొలాలు, ఇళ్ల స్థలాలు సమకూర్చుకుంటున్నారు. మరోవైపు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన యువకులు ఇష్టంగా తమ పొలాల్లో కలియదిరుగుతున్నారు. కొందరు ఆధునిక పద్ధతుల్లో మరింత దిగుబడి సాధించడంపై దృష్టి పెడితే, మరికొందరు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆసక్తి పెంచుకొంటున్నారు. పశు పోషణ, కోళ్ల పరిశ్రమ, పక్షుల పెంపకం వంటి కొత్త వ్యాపార మార్గాలను అన్వేషిస్తున్నారు. చిన్నప్పుడు తాము చదివిన స్కూళ్లకు తమవంతు సాయం చేయడం, సొసైటీలు, ట్రస్టులు, చారిటీలకు విరాళాలు ఇవ్వడం ద్వారా కొందరు యువతీయువకులు సంతృప్తిని పొందుతున్నారు. 


బ్రాడ్‌ బ్యాండ్‌ స్పీడ్‌ పెంచాలి

‘‘బెంగళూరులోని ఓటీయ్‌సలో సీనియర్‌ ఫైనాన్షియల్‌ అనలిస్టుగా చేస్తున్నాను. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల కుటుంబానికి దగ్గరగా ఉంటున్నా. గ్రామీణ ప్రాంతం కావడం వల్ల నెట్‌వర్క్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలి’’

- శిద్ధా ఉదయభాస్కర్‌, తగరపువలస, విజయనగరం జిల్లా


తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకొంటున్నా

‘‘చెన్నైలోని ఎయిర్‌బస్‌ ఇండియాలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. కరోనాతో ఇంటి నుంచే పనిచేస్తున్నా. మా అమ్మ,నాన్నలు వృద్ధులు. నేను దూరంగా ఉన్నపుడు..‘ఇద్దరమే కదా?’ అని వారు ఏదో ఒకటి వండుకొని తినేవారు. దాంతో అనారోగ్య సమస్యలు వచ్చేవి. ఇప్పుడు మేమంతా ఒక దగ్గరే ఉండడం వల్ల వారికి పౌష్టికాహారం ఇవ్వగలుగుతున్నాం. ఏదైనా సమస్య వస్తే నేనే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకువెళుతున్నా. నెలకోసారి చదువుకున్న పాఠశాలకు వెళ్లి...నాకు తోచినసాయం చేయగలుగుతున్నా!’’

- రెడ్డి సింహాద్రి, చోడవరం, విశాఖ జిల్లా 

Updated Date - 2021-01-14T07:48:28+05:30 IST