Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాంతి లేని సంక్రాంతి

  • పల్లెల్లో పెద్దగా కనిపించని పండగ సందడి.. వరుస కష్టాలు, నష్టాలతో రైతులు దిగాలు
  • తెగుళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు.. అన్నదాతలకు వేల కోట్ల పెట్టుబడి నష్టం
  • నెల దాటినా ధాన్యం బకాయిలు పెండింగ్‌.. కరోనా దెబ్బకు ఉపాధి కరవు
  • గత ప్రభుత్వం ఇచ్చిన కానుకలు రద్దు.. జనవరిలో ఇచ్చే అమ్మఒడి ఈసారి లేదు
  • తల్లుల ఖాతాల్లో జమకాని 6,500 కోట్లు ..పేదలు, మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం 

 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

సంక్రాంతి.. రైతన్నలకు పెద్ద పండగ. పంటలు, డబ్బులు ముంగిట్లోకి వచ్చే కాలం. పేదలు, మధ్యతరగతి వర్గాల వారూ ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. ప్రభుత్వం కూడా ఎంతో కొంత సాయం చేయడం ఆనవాయితీ. పనులు ముమ్మరంగా సాగితే రైతు కూలీలకు, పట్టణాల్లో కూలీలకు చేతినిండా పని ఉంటుంది. జేబులో డబ్బుకు కొదవ ఉండదు. ఈ సంక్రాంతికి ఇవేవీ కనిపించడం లేదు. పండగ కళ తప్పింది. దీనికి ఎన్నో కారణాలు. వివిధవర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్రాంతి కానుకను ఈ ప్రభుత్వం రద్దుచేసింది. గత రెండేళ్లలో సంక్రాంతికి ఇచ్చిన అమ్మ ఒడి పథకం ఈసారి లేదు. ఏకంగా రూ.6,500 కోట్ల అమ్మఒడి సొమ్ములు తల్లుల ఖాతాల్లో పడలేదు. ఈ పథకాన్ని ప్రభుత్వం జూన్‌కు వాయిదా వేసింది. దీంతో సంక్రాంతి సమయంలోఇచ్చే పథకం లేకుండా పోయింది.కరోనా దెబ్బకు పేదలు విలవిల 

కరోనా మహమ్మారి దెబ్బకు కూలీలు, కార్మికులకు పనుల్లేకుండా పోయాయి. సంక్రాంతికి కొత్త బట్టలు తీసుకుని, కుటుంబమంతా సంతోషంగా గడిపే పరిస్థితి లేదు. అభివృద్ధి పనులు లేకపోవడం, ప్రైవేటు ప్రాజెక్టులు ఆగిపోవడం ఉపాధిపై దెబ్బకొట్టాయి. రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా పరిస్థితులు మారకపోవడంతో కార్మికులు నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ కష్టాల నుంచి బయటపడేసే దిశగా ప్రభుత్వం ఆలోచించకపోవడంతో వారి జీవితాల్లో సంక్రాంతి వెలుగులు లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయంలో ప్రతికూల పరిస్థితులు, కొవిడ్‌తో వివిధ వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో జిల్లాలో కూడా సంక్రాంతి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. 


సొంతూరికి దూరంగా చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు ఏటా సంక్రాంతి పండగకు కుటుంబ సమేతంగా స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు వచ్చేవారు. ఆయన వెంట ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా వచ్చేవారు. కొవిడ్‌ కారణంగా ఈసారి కూడా చంద్రబాబు స్వగ్రామానికి రావడం లేదు. దీంతో గ్రామంలో పండగ సందడి లేక బోసిపోయినట్టు కనిపిస్తోంది. అన్నదాతలకు అపారనష్టం 

సంక్రాంతి అంటేనే రైతన్నకు సంబరం. అయితే.. ఈ ఏడాది రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. చేతికొచ్చిన పంట తెగుళ్లు, అకాల వర్షాలతో నోటివరకు రాలేదు. గత మూడు నెలల నుంచీ రాష్ట్రంలో పలుచోట్ల అకాల వర్షాలు పంటలను దెబ్బతీస్తోన్నాయి. ఈ-క్రాప్‌ కొనుగోళ్లలో ఇబ్బందుల వల్ల ధాన్యం అమ్మకాల్లో రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. ధాన్యం బకాయిలు కూడా చెల్లించకపోవడంతో రైతుల చేతికి డబ్బు పూర్తిగా రాలేదు. తాజాగా కురిసిన అకాల వర్షాలు కూడా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాయి. 


Advertisement
Advertisement