వెన్నెల దీపోత్సవం

ABN , First Publish Date - 2020-11-30T06:07:07+05:30 IST

తుంగభద్ర పుష్కరాలలో 10వ రోజు ఆదివారం కర్నూలు నగరంలోని సంకల్‌ భాగ్‌, రాంభొట్ల, రాఘవేంద్ర మఠం ఘాట్‌లలో భక్తుల సంఖ్య కొద్దిగా పెరిగింది. ఆదివారం సెలవు, కార్తీక పౌర్ణమి కలిసి రావడంతో భక్తులు తరలివచ్చారు.

వెన్నెల దీపోత్సవం
శ్రీశైలంలో జ్వాలా తోరణం

  1. భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి
  2. శ్రీశైలం, మహానందిలో జ్వాలా తోరణం
  3. పుష్కర ఘాట్లలో పెరిగిన రద్దీ
  4. మంత్రాలయానికి భక్తుల తాకిడి


కార్తీక పౌర్ణమి వేడుకలు అంబరాన్ని తాకాయి. పున్నమి వెలుగులతో దీపకాంతులు, జ్వాలా తోరణాల వెలుగులు పోటీ పడ్డాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.  శ్రీశైలంలో జ్వాలాతోరణం, పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కన్నుల పండువగా సాగాయి. మహానందిలో కోటి దీపోత్సవం, జ్వాలా తోరణోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తుంగభద్ర పుష్కర ఘాట్లలో  ఇన్నాళ్లు భక్తుల రద్దీ తక్కువగా ఉండేది.  కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానాలు ఆచరించేందుకు పోటీ పడ్డారు. కర్నూలు, మంత్రాలయం, సంగమేశ్వరంలో ఆధ్యాత్మిక సందడి కనిపించింది.



న్యూస్‌నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి: తుంగభద్ర పుష్కరాలలో 10వ రోజు ఆదివారం కర్నూలు నగరంలోని సంకల్‌ భాగ్‌, రాంభొట్ల, రాఘవేంద్ర మఠం ఘాట్‌లలో భక్తుల సంఖ్య కొద్దిగా పెరిగింది. ఆదివారం సెలవు, కార్తీక పౌర్ణమి కలిసి రావడంతో భక్తులు తరలివచ్చారు. పలువురు మహిళలు షవర్ల కింద పుణ్యస్నానం చేసి, నదిలో దీపాలు వదిలి పూజలు నిర్వహించారు.  ముస్లిం మహిళలు కూడా ఘాట్ల వద్దకు వచ్చారు. పంప్‌హౌస్‌ ఘాట్‌లో భక్తులు పూజలు నిర్వహించారు. ఇన్‌చార్జి జాయింట్‌ డైరెక్టర్‌ రమణయ్య ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహించారు. రాఘవేంద్ర ఘాట్‌ వద్ద భక్తులు పలుచగా కన్పించారు. పిండప్రదానం చేసేవారు ఎక్కువగా వచ్చారు. కొందరు మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. దివ్యాంగులకు పారిశుధ్య కార్మికులు సహకరించారు. ప్రత్యేక అధికారులు గూడుబాయి, రమాదేవి గుండ్రేవుల పుష్కర ఘాట్‌ నుంచి తెలంగాణ వైపు వెళ్లి తుంగభద్ర నదీ స్నానాలు ఆచరించారు. అధికారులు తెప్పలో అటువైపు వెళ్లి వచ్చారు.


సంగమేశ్వరానికి భక్తుల తాకిడి 

ఆత్మకూరు/కొత్తపల్లి: సప్తనదీ సంగమేశ్వరానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర జలాలతో సంప్రోక్షణ చేసుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వదిలి వాయనాలు సమర్పించారు. చాలామంది షవర్ల వద్ద స్నానాలు ఆచరించారు. కొందరు పిండప్రదానం చేశారు. కృతిక కార్తీక దీపోత్సవ క్రతువును ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ నేతృత్వంలో నిర్వహించారు. అంతకుముందు లలితాసంగమే శ్వరులు, శ్రీదేవీ భూదేవీ సహిత వెంకటేశ్వరస్వామి వార్లకు, సీతారాములు, గాయత్రీదేవి ఉత్సవ విగ్రహాలకు పుష్కర జలాలచే అభిషేకించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి పూజించారు. ఎగువ ఉమామహేశ్వరాలయంలో పూజలను జరిపారు. తుంగభద్రకు మహామంగళహారతి పట్టారు. పుష్కర బృహస్పతి గాయత్రీ యాగం, సూర్యనారాయణ స్వామికి ప్రీతికి అరుణయాగం నిర్వహించారు. సాయంత్రం గంగ హారతి ఇచ్చారు. కాశిరెడ్డినాయన ఆశ్రమం వారు అన్నదానం చేశారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రమోహన్‌, డ్వామా పీడీ వెంగన్న తదితరులు పర్యవేక్షిం చారు. కర్నూలుకు చెందిన మహిళ సంగమేశ్వరలో లక్ష ఒత్తుల దీపాన్ని వెలిగించారు.


మంత్రాలయంలో రద్దీ

మంత్రాలయం/ఎమ్మిగనూరు టౌన్‌: మంత్రాలయం మఠం, సంతమార్కెట్‌ ఘాట్ల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. మఠం వీఐపీ, ఎన్‌ఏపీ, వీఐపీ, వినాయక ఘాట్ల వద్ద నామమాత్రంగా కనిపించింది. భక్తులు షవర్ల కింద పుణ్యస్నానాలు చేసి నదిలో దీపాలు వదిలారు. పలువురు పిండ ప్రదానం చేశారు. పలువురు భక్తులు మాధవరం గ్రామం వద్ద నదిలోకి దిగి పుణ్యస్నానాలు చేశారు. భక్తులు ఇక్కడికి వాహనాల్లో రావడంతో మాధవరం-రాయచూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ పెరిగింది. పుణ్యస్నానాల అనంతరం గ్రామదేవత మంచాలమ్మను, బృందావనాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. బృందావనా నికి పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు మంత్రాక్షిత లిచ్చి ఆశీర్వదించారు. భక్తుల రాకతో మఠం పరిసరాలు, క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల కిటకిటలాడాయి.


ఘాట్ల వద్ద పాములు

మంత్రాలయం: సంత మార్కెట్‌ ఘాట్‌ వద్ద ఆదివారం పాములు కలకలం సృష్టించాయి. ఘాట్‌కు ఏర్పాటు చేసిన బారికేడ్లపై నాలుగు పాములు పాకుతూ కనిపించాయి. దీంతో భక్తులు భయాందోళన చెందారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ నాగేంద్ర, పారిశుధ్య కార్మికులను పిలిపించి పాములను తొలగించారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో పాములు కనిపించడం కలకలం రేపింది.


కోటి దీపకాంతులు

మహానంది, నవంబరు 29: మహానందిలో ఆదివారం రాత్రి కోటి దీపోత్సవం, జ్వాలా తోరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ వేదపండితులు చండూరి రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మ, అర్చకులు రాజమాణిక్యశర్మ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ప్రధాన రాజగోపురం ముందు ఈవో మల్లికార్జున ప్రసాద్‌, నంద్యాల డీఎస్పీ చిదానందారెడ్డి చేత జ్వాలా తోరణాన్ని  వెలిగింపజేశారు. అనంతరం వందలాదిమంది భక్తులు హర హర నినాదాల నడుమ కోటి దీపాలను వెలిగించారు. పరిసరాలు దీపకాంతులను సంతరించుకున్నాయి.


శ్రీగిరిపై జ్వాలా తోరణోత్సవం

శ్రీశైలం, నవంబరు 29: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైలంంలో జ్వాలా తోరణాన్ని వెలిగిం చారు. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకిలో ఆశీనులనుజేసి మంగళవాయిద్యాల నడుమ ఆలయం ముందు ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్దకు తోడ్కొని వచ్చారు. పూజాదికాలు  నిర్వహించి అనంతరం జ్వాలాతోరణాన్ని ప్రజ్వలింపచేశారు.  పౌర్ణమి ఘడియలను పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం పాతాళగంగ వద్ద కృష్ణవేణి నదీమతల్లికి ఏకాదశ హారతులు, వాయనంగా సారెను సమర్పించారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా భక్తులను అనుమతించలేదు. పరిమిత సంఖ్యలో అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. పుష్కరణి వద్ద సాయంత్రం లక్ష దీపోత్సవాన్ని నిర్వహించి హారతి పట్టారు. స్వామి అమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను పట్టారు. భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకుని భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించుకున్నారు.

Updated Date - 2020-11-30T06:07:07+05:30 IST