టీడీపీతోనే వెలుగు

ABN , First Publish Date - 2022-05-28T07:37:31+05:30 IST

టీడీపీతోనే వెలుగు

టీడీపీతోనే వెలుగు

తెలుగుదేశం ఒక చారిత్రక అవసరం

దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవాలి

టీడీపీ రాజకీయ తీర్మానం పిలుపు

రాజకీయ తీర్మానం ప్రవేశపెడుతున్న యనమల

జగన్‌ అవినీతి, నిరంకుశ పాలనతో రాష్ట్ర భవిష్యత్‌ అంధకారం

ఈ విపత్కర పరిస్థితుల్లో టీడీపీని అధికారంలోకి తేవాలి

చరిత్ర ఎరుగని సంక్షోభంలోకి రాష్ట్రం

మూడేళ్లలో 1.8 లక్షల కోట్ల అవినీతి

మరో శ్రీలంకగా ఆంధ్రప్రదేశ్‌

మితిమీరిన అప్పులు, బాదుడే బాదుడు

స్వార్థ రాజకీయాల కోసం కులమతాలను రెచ్చగొడుతున్నారు

వీటన్నిటినీ తిప్పికొట్టాలి


అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్టీఆర్‌ ఆశయాలను నిజం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలి. తెలుగుదేశం పార్టీ చారిత్రక అవసరం. ఈ 40 ఏళ్ల వేడుకతో మరోసారి కొత్త పోరాటానికి కార్యోన్ముఖులమవుదాం’ అని టీడీపీ రాజకీయ తీర్మానంలో పిలుపిచ్చింది. రాష్ట్రాన్ని పాలించేవారు అసమర్థులు, అవినీతిపరులు, ఆర్థిక నేరస్థులైతే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో.. రాష్ట్రం ఎలా నష్టపోతుందో ప్రజలందరికీ వివరించాలని సూచించింది. జగన్‌ ప్రభుత్వ అవినీతి, అసమర్థ, నిరంకుశ పాలనతో రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమైందని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో టీడీపీని అధికారంలోకి తేవడానికి, రాష్ట్ర భవిష్యత్‌ కోసం అందరం నడుం కట్టాలని పేర్కొంది. భవిష్యత్‌ వ్యూహాలకు సంబంధించిన కీలక రాజకీయ తీర్మానాన్ని శుక్రవారం మహానాడులో పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ‘స్వార్థ రాజకీయ శక్తుల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉంది. అన్ని స్థాయుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి బలమైన వ్యూహాన్ని అమలుచేస్తూ.. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా దీటుగా ఎదుర్కొని విజయం సాధించాలి.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి’ అని తీర్మానం ఉద్ఘాటించింది. చరిత్రలో ఎరుగని సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టారని దుయ్యబట్టింది. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. ‘నాడు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టడం ఒక విప్లవం. ఒక రాజకీయ సంస్కరణ. రాజకీయ సంస్కరణ అన్నది చెప్పకుండానే చేసిన మహానుభావుడు ఎన్టీఆర్‌. దాంతోనే మేమంతా చేరాం’ అని తెలిపారు. టీడీపీ ఆవిర్భవించి ఇప్పటికి 40 ఏళ్లయిందని.. పేదోడికి ఇల్లుండాలని.. మంచి బట్టలు కట్టుకోవాలని.. తినడానికి తిండి ఉండాలన్న ప్రధాన లక్ష్యాలతో పాటు.. తెలుగోడి ఆత్మగౌరవం ప్రధాన నినాదంగా తెలుగుదేశాన్ని స్థాపించారని గుర్తుచేశారు. సామాజిక న్యాయం మొదటిసారిగా మొదలుపెట్టింది ఎన్టీఆర్‌ అని చెప్పారు. ‘ఈరోజు మేం కూడా చేశామని చాలామంది అంటున్నారు. పేదలకు అందాల్సిన సొమ్ము దోపిడీ చేసిన వీళ్లు.. సామాజిక న్యాయం ఏం చేశారు? భవిష్యత్‌ తరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోజు ఎన్టీఆర్‌ ఎలా రాజకీయం చేశారో.. ఈరోజు చంద్రబాబు కూడా అదే దృష్టితో రాష్ట్రం కోసం పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సంస్కరణలు కూడా కావాలి. డబ్బు ప్రభావమే ఉంటే ఎన్నికలు చేయలేం. సామాజిక న్యాయం జరగదు. పేదోడికి వచ్చే సంపదను జగన్‌రెడ్డి బృందం దోచేస్తోంది. పాలనలో అణగారిన వర్గాలకు భాగ స్వామ్యం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలి. స్వాతంత్రం ఎందుకు తెచ్చారు? ఈ దోపిడీదారుల కోసం కాదు. వీళ్లకు గుణపాఠం చెప్పాలి. అధికారంలోకి రావడంలో అనుమానం లేదు. కానీ వచ్చాక దేశంలోనే మెరుగైన రాష్ట్రంగా మళ్లీ తీర్చిదిద్దడమే లక్ష్యం..  రైతులు, మహిళలు, యువత హక్కుల కోసం, వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమించాలి. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ క్విడ్‌ ప్రొ కోలో లక్ష కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ మూడేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు వెనకేసుకున్నారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, డ్రగ్స్‌, గంజాయి మాఫియాలను ప్రోత్సహిస్తూ ప్రజల ఆస్తులను కూడా బొక్కేస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని శ్రీలంక దిశగా తీసుకెళ్తున్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఇంకోవైపు పన్నులు, చార్జీల బాదుడేబాదుడు’ అని విమర్శించారు.


రాజధాని విధ్వంసం.. 

ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్రాలు ఇవ్వడానికి నాడు గాంధీజీ పోరాటం చేశారని.. నేడు వైసీపీ పాలనలో బందీ అయిన రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి తెలుగుదేశం పోరాడుతోందని యనమల తెలిపారు. ‘రాజధానిని విధ్వంసం చేశారు. రాజధాని లేకపోవడంతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చి యువతను మేధావులుగా తీరిదిద్దారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత ప్రపంచ పటంలో తెలుగోడిని అత్యున్నతస్థాయిలో నిలిపేందుకు చంద్రబాబు శ్రమించారు. కానీ నేడు జగన్‌రెడ్డి పాలనలో గంజాయి, డ్రగ్స్‌కు బానిసలను చేసి యువతను నిర్వీర్యం చేస్తున్నారు’ అని విరుచుకుపడ్డారు. పార్టీ సీనియర్‌ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఈ తీర్మానాన్ని బలపరిచారు. ‘వచ్చేఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. తెలంగాణలో పార్టీ బలపడేందుకు నాయకుడి అండదండలు ఉండాలి. సీనియర్‌నేతగా చంద్రబాబు సేవలు దేశ స్థాయిలోనూ ఉపయోగపడాలి’ అని ఆకాంక్షించారు.


ఇలాగే చేస్తే... టైర్లలో గాలి తీస్తారు

పిచ్చి చేష్టలు మానితే మంచిది: చంద్రబాబు

‘‘టీడీపీ సభలకు ఇవ్వకుండా వైసీపీ సభలకు ఆర్టీసీ బస్సులు ఇస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోవు. అడ్డుపడి వాటి టైర్లలో గాలి తీస్తారు’’ అని చంద్రబాబు హెచ్చరించారు. మహానాడు నిర్వహణ కోసం భూములు ఇచ్చిన మండవవారిపాలెం గ్రామస్తులను అభినందిస్తూ ఆయన మహానాడు సమావేశంలో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఒంగోలులో స్టేడియం ఇవ్వాలని కోరాం. ఇవ్వలేదు. ఇటువంటి సమయంలో ఈ గ్రామం ప్రజలు ముందుకు వచ్చి తమ భూములు ఇచ్చారు. వారిని కూడా వేధించారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు. ప్రతి విషయంలో ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. పిచ్చి చేష్టలు మానితే మంచిది’’ అని బాబు హెచ్చరించారు.



Updated Date - 2022-05-28T07:37:31+05:30 IST