Advertisement
Advertisement
Abn logo
Advertisement

లైట్‌ మెట్రోనే...

బీచ్‌రోడ్డులో ట్రామ్‌ సిస్టమ్‌

‘ఆంధ్రజ్యోతి’తో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ నూతన ఎండీ యుజేఎం రావు

కాలుష్య రహిత ప్రయాణమే మెట్రో ధ్యేయం

ప్రాజెక్టుకు నిధులు సమీకరించేలోపు భూ సేకరణ, ట్రాక్‌ అలైన్‌మెంట్‌, డిజైన్లు వంటివి పూర్తి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖలో ప్రధానంగా లైట్‌ మెట్రో సిస్టమ్‌ పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన అని, అలాగే బీచ్‌ కారిడార్‌లో భీమిలి వరకు మోడరన్‌ ట్రామ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ యూజేఎం రావు తెలిపారు. భారతీయ రైల్వేలో వివిధ స్థాయిల్లో 40 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన ఇటీవల కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగర ప్రజలకు కాలుష్య రహిత ప్రయాణం అందించడమే తమ ధ్యేయమన్నారు. మెట్రో రైలు కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం అమరావతిలోనే ఉందని, విశాఖలో ఏర్పాటు చేసింది ప్రాంతీయ కార్యాలమని వెల్లడించారు. మెట్రో ప్రాజెక్టు లాభమా?, నష్టమా?...అనే ఆలోచనతో కాకుండా మెట్రో నగరంగా ఎదుగుతున్న విశాఖపట్నం ప్రజలకు కాలుష్య రహితమైన, చక్కటి సౌకర్యాలతో కూడిన రవాణా సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. ఢిల్లీలో మెట్రో రైలు పట్టాలెక్కి 11 ఏళ్లు కావస్తోందని, ఆరేళ్ల తరువాత బ్రేక్‌ ఈవెన్‌ సాధించి, ఇప్పుడు మంచి లాభాలు సాధిస్తోందన్నారు. విశాఖలో కూడా ఆ విధంగానే ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి తొలుత వెచ్చించే మొత్తమే పెట్టుబడిగా ఉంటుందని, ఆ తరువాత పెద్దగా నిర్వహణ వ్యయం ఉండదు కాబట్టి, ఆర్థికంగా నష్టం రాదన్నారు. ఇంకా ఏమన్నారంటే... 


తక్కువ చార్జీలతోనే...

- ఈ ప్రాజెక్టు ప్రధానంగా గాజువాక నుంచి భోగాపురం వరకు ఉంటుంది. భోగాపురం కొత్త విమానాశ్రయంలో దిగే ప్రయాణికులు కేవలం రూ.150 ఖర్చుతో, అతి తక్కువ సమయంలో నగరంలోకి వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

- విశాఖపట్నం జనాభా 25 లక్షలకు చేరుకుంది. మెట్రో రైలు ద్వారా రోజుకు ఐదు లక్షల మందికి ప్రయాణ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో తొలుత 79.91 కి.మీ. పొడవున లైట్‌ మెట్రో వేస్తాం. ఈ మార్గంలో గుర్తించిన ఎనిమిది స్టేషన్లను ‘కమర్షియల్‌ హబ్స్‌’గా అభివృద్ధి చేస్తాం. పిల్లలను సంరక్షించడానికి బేబీ కేర్‌ సెంటర్లు, ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి ఆడిటోరియాలు వంటివి ఉంటాయి. ఇవి వన్‌స్టాప్‌ సెంటర్లుగా పనిచేస్తాయి.

- ఈ ప్రాజెక్టుకు నిధులు సమీకరించేలోపు భూ సేకరణ, ట్రాక్‌ అలైన్‌మెంట్‌, డిజైన్లు వంటివి పూర్తిచేస్తాం. నిర్మాణ సమయంలో దీని ద్వారా ఎనిమిది వేల మందికి, ఆ తరువాత శాశ్వతంగా ఐదు వేల మంది ఉపాధి లభించనుంది. 

Advertisement
Advertisement