దళితబంధుతో లబ్ధిదారుల జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2022-06-26T06:04:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

దళితబంధుతో లబ్ధిదారుల జీవితాల్లో వెలుగు
కిసాన్‌నగర్‌లో లబ్ధిదారుని ట్రాక్టర్‌ నడుపుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

- మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌, రేకుర్తిలో దళితబంధు పథకం కింద మంజూరైన యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌, జ్యోతిబాపూలే కలలను కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తోందని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 13,559 మంది లబ్ధిదారుల్లో 11,500 మందికి దళితబంధు పథకం అమలు చేశామన్నారు. కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో  ఇప్పటి వరకు 250 మందికి యూనిట్లు మంజూరు చేశామన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో మంజూరైన వంద యూనిట్లను త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 1500 మంది లబ్ధిదారులను దళితబంధు పథకానికి ఎంపిక చేయనున్నామని, సోమవారం అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, నెహ్రూ యువకేంద్ర కో-ఆర్డినేటర్‌ రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేష్‌, కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్‌, కంసాల శ్రీనివాస్‌, నక్క పద్మాకృష్ణ పాల్గొన్నారు. 

 విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌, స్మార్ట్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌, సహారా ఏజెన్సీ ద్వారా కార్ఖానాగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల్డలో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌/స్మార్ట్‌ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌లోని 52 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాఠశాలలకు గూగుల్‌ క్రోమ్‌ బుక్స్‌ (1000), కె-యాన్స్‌(104), యూపీఎస్‌లు(52), స్టూడెంట్‌ డెస్కులు (500), ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

 అర్హులందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

కరీంనగర్‌ రూరల్‌: అర్హులైన వారందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు దశల వారీగా అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కొత్తపల్లి మండలంలోని ఎలగందల్‌, ఖాజీపూర్‌ గ్రామాల్లో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి డబుల్‌ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం పథకం కింద ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. దశల వారీగా నిరుపేదలందరిని గుర్తించి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందిస్తామని చెప్పారు. ఎలగందల్‌ గ్రామంలో మిగిలిపోయిన అర్హులను గుర్తించి పట్టాలు పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెండు గ్రామాల్లో 40 మంది లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత, జడ్పీటీసీ పిట్టల కరుణ, సర్పంచ్‌ ఎద్దండి షర్మిల, ఎంపిటీసీ రమేష్‌గౌడ్‌, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడి పాల్గొన్నారు.

 గ్రామస్థుల నిరసన

కొత్తపల్లి మండలం ఎలగందల్‌ గ్రామంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభించడానికి వచ్చిన  రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంతి గంగుల కమలాకర్‌కు గ్రామస్థుల నుంచి నిరసన వ్యక్తమైంది. అర్హులకు కాకుండా స్థానిక నాయకులు తమకు నచ్చిన వారికే  ఇళ్లు కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు.  అర్హులైన వారందరికి దశల వారీగా ఇళ్లు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

 పాఠశాల భవనం ప్రారంభం

కొత్తపల్లి మండలం ఎలగందల్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన భవనం విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం ముందు ఉన్న పురాతన భవనాన్ని తొలగించాలని అధికారులను ఆదేశించారు. 

 నాకు పోటీ ఎవరూ రారా..

పాఠశాల భవనం ప్రారంభం అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌ విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. విద్యార్థులు భవిష్యత్తులో ఏం అవుతారని ప్రశ్నించగా కొంత మంది ఐఏఎస్‌, కొంత ఐపీఎస్‌ అవుతామని బదులిచ్చారు. దీంతో మంత్రి నవ్వుతూ ఎవరూ ఎమ్మెల్యేలు కారా.. నాకు ఎవరు పోటీ రారా.. అని అడిగారు. దీంతో అక్కడున్న వారు అందరూ నవ్వారు. విద్యార్థులు ఎక్కువ మంది తమిళ కాలనీకి చెందిన వారుండడంతో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ వారితో కాసేపు తమిళంలో మాట్లాడారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి ఆనందం పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-26T06:04:39+05:30 IST