అవయవదానంతో నలుగురి జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2022-08-12T06:45:54+05:30 IST

ఓ రైతు తాను మృతి చెందినా అవయవ దానంతో నలుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

అవయవదానంతో నలుగురి జీవితాల్లో వెలుగు
భాస్కర్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలు దానం

నేరేడుచర్ల, ఆగస్టు 11: ఓ రైతు తాను మృతి చెందినా అవయవ దానంతో నలుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన కందుకూరి భాస్కర్‌రెడ్డి (38) తనకున్న రెండు ఎకరాల పొలాన్ని సాగుచేసు కుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం కోటమైసమ్మ దేవా లయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ముకుందాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతుండగా బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భాస్కర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి, కుమారుడు వినయ్‌రెడ్డిలు జీవన్‌దాన్‌ సంస్థ ద్వారా భాస్కర్‌రెడ్డి నేత్రాలు, కాలేయం, కిడ్నీలు, గుండెను దానం చేశారు. ఇంటి పెద్ద మృతిచెందినా, ఆయన అవయవాలు దానంచేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపటంతో కుటుంబ సభ్యులను గ్రామస్థులు అభి నందించారు. స్వగ్రామం దిర్శించర్లలో గురువారం భాస్కర్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. 



Updated Date - 2022-08-12T06:45:54+05:30 IST