జీవితాలు తెల్లారిపోయాయి

ABN , First Publish Date - 2022-09-26T08:08:51+05:30 IST

కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డి (47) తిరుపతిలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో రేడియాలజి్‌స్టగా పనిచేస్తున్నారు.

జీవితాలు తెల్లారిపోయాయి
బిడ్డలతో తండ్రి రవిశంకర్‌ రెడ్డి

షార్ట్‌ సర్క్యూట్‌తో రేణిగుంటలో ఘోర అగ్నిప్రమాదం

తండ్రి సజీవ దహనమవగా, ఊపిరాడక ఇద్దరు బిడ్డల మృతి

ఇద్దరు మహిళలను కాపాడిన పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, స్థానికులు

రేణిగుంట, సెప్టెంబరు 25: కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డి (47) తిరుపతిలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో రేడియాలజి్‌స్టగా పనిచేస్తున్నారు. తల్లి కోరిక మేరకు రేణిగుంట భగత్‌సింగ్‌కాలనీ రాజరాజేశ్వరి ఆశ్రమం ఎదుట ఏడాది క్రితం కొత్త ఇల్లు కట్టుకున్నారు. భార్య అనంతలక్ష్మి కూడా వైద్యురాలు కావడంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కార్తీక క్లినిక్‌ ప్రారంభించి.. ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. మిగిలిన రెండు అంతస్తులు డూప్లెక్స్‌ కాగా, పైన చిన్నపాటి పెంట్‌ హౌస్‌లో కుమారుడు సిద్ధార్థరెడ్డి (11), కుమార్తె కార్తిక(6), తల్లి రామసుబ్బమ్మ(70)లతో కలసి నివసిస్తున్నారు. 

మంటలను గుర్తించిన వాచ్‌మన్‌ బంధువు 

ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో మొదటి అంతస్తు వంటగది నుంచి పొగలు వస్తున్నట్లు క్లినిక్‌లో పనిచేసే వాచ్‌మన్‌ వీరయ్య సమీప బంధువు గుర్తించాడు. వాచ్‌మన్‌ బంధువుల అబ్బాయి  యేసు ఒంగోలు నుంచి రేణిగుంటకు ఉదయం నాలుగు గంటలకు డాక్టర్‌ ఇంటికి చేరుకున్నాడు. వాచ్‌మన్‌ను నిద్రలేపి మాట్లాడుతుండగా మొదటి అంతస్తు వంట గదినుంచి మంటతో కూడిన పొగలు రావడం గమనించాడు. పైఅంతస్తు తలుపులకు తాళం వేయడంతో డాక్టర్‌ అనంతలక్ష్మికి ఫోన్‌ చేసి వాచ్‌మన్‌ సమాచారం అందించాడు. మంటలను చూసి భయాందోళన చెందిన ఆమె తన భర్త, పిల్లలను కాపాడుకోవడం కోసం గట్టిగా కేకలు వేస్తూ వారు పడుకుని ఉన్న గదుల వైపు పరుగులు తీశారు. ఇంతలో స్థానికులు తలుపులు పగలకొట్టి అనంతలక్ష్మికి బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పొక్లెయిన్‌ సాయంతో ఓ పడకగది కిటికీని తొలగించి అందులో ఉన్న రవిశంకర్‌రెడ్డి తల్లి రామసుబ్బమ్మను స్థానికుల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

తల్లి కోరిక మేరకు ఇంటి నిర్మాణం

రవిశంకర్‌ రెడ్డి కుటుంబీకులు విదేశాల్లో ఉంటున్నారు. ఆయన తల్లి రేణిగుంటలోని రాజరాజేశ్వరిదేవి భక్తురాలు. ఆలయానికి చెందిన ఆశ్రమానికి సమీపంలోనే ఇల్లు కట్టుకుని ఉండాలన్నది ఆమె కోరిక. దాంతో రవిశంకర్‌రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టి, ఏడాది కిందట గృహప్రవేశం చేశారు.  

ఫైర్‌ ఇంజన్‌ ఆలస్యంపై విమర్శలు

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న గంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని భావిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న రేణిగుంట ప్రాంతంలో అగ్నిమాపక శాఖ కార్యాలయం లేకపోవడం విచారకరం. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే జంక్షన్‌, రెండు పారిశ్రామికవాడలున్న రేణిగుంటలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే తిరుపతి కోర్టు సమీపంలో ఉండే ఫైర్‌ ఇంజన్లే దిక్కుగా మారే 

పరిస్థితి రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

బిడ్డలను కాపాడుకునే 

ప్రయత్నంలో తండ్రి ఆహుతి

బిడ్డలను కాపాడుకునే ప్రయత్నంలో తండ్రి రవిశంకర్‌ రెడ్డి వారి పడకగదివైపు పరుగులుతీసినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో వారి గది బయటే అగ్నికి ఆహుతై కనిపించాడు. చిన్నారులు మాత్రం గదిలో పొగచూరుకుని పోవడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 108 వాహనంద్వారా తిరుపతిలోని  ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే  పిల్లలిద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం రేణిగుంటలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషాద ఘటనతో స్థానికులు చలించిపోయారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు తల్లులను ఓదార్చడం ఎవ్వరితరమూ కాలేదు. 



Updated Date - 2022-09-26T08:08:51+05:30 IST