ఊరికే జీవితమై..

ABN , First Publish Date - 2020-03-16T10:10:44+05:30 IST

నువ్వూ, నీ జీవితమూ మినహా మనసులో మచ్చుకైనా మరేమీ లేని అనుభవాన్ని పొందావా నువ్వు ఇది నా ప్రతిభ, నా విజయం... ఇది నా ఆస్తి, నా కుటుంబం ఇది నా కీర్తి, నా అనుభవం అన్నట్లుగానే

ఊరికే జీవితమై..

నువ్వూ, నీ జీవితమూ మినహా

మనసులో మచ్చుకైనా మరేమీ లేని


అనుభవాన్ని పొందావా నువ్వు

ఇది నా ప్రతిభ, నా విజయం

ఇది నా ఆస్తి, నా కుటుంబం

ఇది నా కీర్తి, నా అనుభవం

అన్నట్లుగానే

ఇది నా జీవితం అని

ఎప్పుడైనా తలచావా


ఉత్త జీవితం

ఏమీ లేని జీవితం

ఖాళీ జీవితం

ఎప్పుడైనా తాకిందా నిన్ను


ఆకులమీంచి సంధ్యావర్ణాలు రాలిపోతున్నాయి

పిట్ట ఒకటి ఆకాశాన్ని విదిలించుకొంటూ 

    స్వేచ్ఛలోకి ఎగురుతూ ఉంది

ఏ అర్థమూ లేని ఉత్త ఖాళీ చప్పుడొకటి

గాలిలోంచి నీ మీదుగా నిశ్శబ్దంలో కరిగిపోతుంది


ఊరికే చూసావా జీవితాన్ని జీవితంగా

అద్దంలోకి కాక, ఉత్త అద్దాన్ని చూసినట్టు

జీవితంలోకి దూకకుండా ఉత్త జీవితాన్ని చూసావా


నిన్నేమీ అనని జీవితాన్ని

నీ తప్పు ఒప్పుల్ని పట్టించుకోని జీవితాన్ని

నీ సుఖదుఃఖాలు తాకని జీవితాన్ని

ఊరికే శ్వాసలా నిద్రలోనూ నిన్ను విడవని జీవితాన్ని

రంగూ, రుచీ, స్పర్శా, వాసనా లేని జీవితాన్ని

తలచావా

గుర్తించావా

తమకంగా కౌగలించుకొన్నావా


ఊరకనే జీవితమైపోయావా ఎప్పుడైనా

బివివి ప్రసాద్‌

90320 75415


Updated Date - 2020-03-16T10:10:44+05:30 IST