Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీవితం కొత్తగా మొదలెట్టినట్టుంది

నాలుగేళ్లకే నటన మొదలైంది. అలాగని చదువుని పక్కన పెట్టలేదు. ఎంఎస్సీలో డబల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌. పీహెచ్‌డీ చేద్దామనుకున్న సమయంలో మళ్లీ ఓ అవకాశం... అదే ఇప్పుడు ఆమెను నటిగా మన ముందు నిలబెట్టింది. ‘శ్రీమతి శ్రీనివాస్‌’గా తెలుగు ప్రేక్షకులను అరించడానికి వస్తున్న అంకితా అమర్‌ను ‘నవ్య’ పలకరించింది.


నట వారసత్వం నాది. మా అమ్మా నాన్న నాటకాల్లో నటించేవారు. వాళ్లతో పాటు నన్నూ తీసుకువెళ్లేవారు. అవి చూస్తూనే పెరిగాను. అలా నాకు తెలియకుండానే నటనపై ఆసక్తి కలిగింది. కర్ణాటకలోని మైసూర్‌ మాది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాం. 2000లో అనుకొంటా... నాలుగేళ్ల వయసు నాకు. ‘డీడీ చందన’లో కన్నడ సీరియల్‌ కోసం మొదటిసారి ముఖానికి రంగు వేసుకున్నా. కెమెరా ముందు అదే నా తొలి అనుభవం. విశేషమేమంటే... ఆ సీరియల్‌లో నా తండ్రిగా మా నాన్నే నటించారు. తరువాత ప్రభుత్వం రూపొందించిన ఏడెనిమిది డాక్యుమెంటరీల్లో నటించాను. బాల్య వివాహాలు, విద్య, వివక్ష తదితర అంశాలపై తీసిన డాక్యుమెంటరీలవి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వాటిని ప్రదర్శించారు. మూడు సీరియల్స్‌, ఓ సినిమాలో కూడా బాల నటిగా చేశా. పై తరగతులకు రావడంతో చదువు మీద శ్రద్ధ పెట్టాలని బ్రేక్‌ తీసుకున్నా. 


డబల్‌ గోల్డ్‌... 

చిన్నప్పుడు ఒక పక్కన నటిస్తూ, చదువుకొంటూ భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. నాకు డ్యాన్స్‌ చాలా చాలా ఇష్టం. కోరి మరీ మెడికల్‌ బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివా. అందులో డబుల్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించాను. లెక్చరర్‌ కావాలన్న సంకల్పంతో పీహెచ్‌డీకి దరఖాస్తు చేశాను. ఆ పట్టా చేతికి వస్తే వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పవచ్చు. కానీ దేవుడి నిర్ణయం మరోలా ఉంది. అదే సమయంలో బాల నటిగా నన్ను చూసినవారు ‘నమ్మనే యువరాణి’ కన్నడ సీరియల్‌ కోసం అడిగారు. అమ్మా నాన్న కూడా ప్రోత్సహించారు. ఓకే అనడంతో 2019లో సీరియల్‌ ప్రారంభమైంది. ఇప్పటికీ నడుస్తోంది. 


తరువాత రావు కదా...  

చాలామంది అడుగుతుంటారు... ఎంతో కష్టపడి చదివి, టాపర్‌గా నిలిచి మళ్లీ ఇటు వైపు ఎందుకు వచ్చావని! నేను అలా అనుకోను. మన ముంగిట ఉన్న అవకాశాన్ని వదులుకోకూడదన్నది నా అభిమతం. పాతికేళ్లప్పుడు కథానాయికగా చేయగలను. ఓ పదేళ్లు గడిస్తే ఆ పాత్రలు రావు కదా. కానీ మూడు పదులు దాటినా పీహెచ్‌డీ పూర్తి చేసుకోవచ్చు. చదువనేది అంతంలేనిది. ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తా. శృంగేరి శారదాంబిక ఆశీస్సులవల్లే చిన్నప్పుడు నటించాను. నాట్యం, సంగీతం నేర్చుకున్నాను. బాగా చదువుకున్నాను. ఆ అమ్మవారే ఓ మార్గం చూపి అందులో నన్ను నడిపిస్తున్నారని నా విశ్వాసం. 


యాంకరింగ్‌ కూడా... 

కన్నడలో సీరియల్‌తో పాటు యాంకరింగ్‌ కూడా చేస్తున్నాను. తెలుగులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన ‘పాడుతా తీయగా’ తరహా కార్యక్రమం అది. ‘ఎడె తుంబి హాడువేను’ పేరుతో వచ్చే ఆ కార్యక్రమానికి కూడా ఎస్పీ గారే హోస్ట్‌. ఆయన మరణం తరువాత దానికి నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా. నిజానికి నేను నటినే కాదు... మంచి గాయనిని కూడా. ప్రస్తుతం ‘భావ గీత’ నేర్చుకొంటున్నా. ఉర్దూలో ఘజల్స్‌లా కన్నడలో ‘భావ గీత’ అన్నమాట. ప్రముఖ కవులు, రచయితలు రాసిన గీతాలు అందులో ఉంటాయి. అంతేకాదు... అక్కడ నెల నెలా నిర్వహించే ‘నగర సంకీర్తన’లో పాల్గొంటాను. అందులో నా వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అయింది. ఇరవై మిలియన్ల మందికి పైగా దాన్ని వీక్షించారు. 


‘శ్రీమతి శ్రీనివాస్‌’గా... 

తెలుగులో నేను చేస్తున్న తొలి ప్రాజెక్ట్‌... ‘శ్రీమతి శ్రీనివాస్‌’. ‘స్టార్‌ మా’లో వచ్చే వారం ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పిక్సల్‌ పిక్చర్స్‌’ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. మంచి సంస్థ, చక్కని వేదిక... అందుకే అడిగిన వెంటనే ఓకే అన్నాను. గత నెలలో షూటింగ్‌ ప్రారంభమైంది. నాకు తెలుగు రాదు. కానీ అర్థమవుతుంది. దీంతో పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. అయితే త్వరలోనే తెలుగు నేర్చుకొంటాను. ఏదో అవసరానికి కాకుండా... అన్ని మాండలికాలనూ తెలుసుకుని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాను. ఇప్పటికే సాధన మొదలుపెట్టాను.  


అందరూ మెచ్చే పాత్ర... 

‘శ్రీమతి శ్రీనివాస్‌’లో నాది ‘శ్రీదేవి’ పాత్ర. పక్కింటి అమ్మాయిని తలపించే శ్రీదేవి... అందం, అణకువ, తెలివితేటలు గల సున్నిత మనస్కురాలు. మంచాన పడ్డ అమ్మను, కుటుంబాన్ని చూసుకోవడానికి చదువు మానేస్తుంది. కానీ లోకజ్ఞానం ఎక్కువ. పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తూ, ఇంట్లో వాళ్లందరికీ సహకరిస్తుంటుంది. అలాంటి శ్రీదేవి జీవితం ఆ తరువాత ఎలాంటి మలుపు తిరుగుతుంది? బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తుందన్నది కథ. ఇది కచ్చితంగా అందరికీ నచ్చే పాత్ర. కొత్త ప్రాంతం... కొత్త మనుషులు... కొత్త భాష... జీవితం కొత్తగా ప్రారంభించిన అనుభూతి కలుగుతోంది. 

                                                                                                          


వారే నాకు స్ఫూర్తి... 

ఫలితం ఆశించకుండా కష్టపడి పని చేయడం మా అమ్మా నాన్నల నుంచి నేర్చుకున్నా. ఎలాంటి ఒత్తిడులు, ఇబ్బందులు లేకుండా నా పని నేను చేసుకోగలుగుతున్నానంటే అది వారివల్లే. కానీ నటిగా గుర్తుండి పోయే పాత్రలు పోషించాలన్న తపన, కసి నాలో రగిలిస్తున్నది మాత్రం ప్రేక్షకులే. తెరపై నన్ను చూస్తూ, అభినందిస్తూ, ప్రోత్సహిస్తున్నది వారే. అందుకే వారే నాకు స్ఫూర్తి. ఇక తెలుగు ప్రేక్షక హృదయాల్లో నాకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకోవాలన్నది ప్రస్తుత లక్ష్యం. ఆ దిశగా విజయవంతమవుతానని ఆశిస్తున్నా. అలాగే ఇటీవల మరణించి కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు నా పాట, ఆట, నటన ద్వారా నివాళులు అర్పిస్తున్నా. ఆయన ఆశయ సాధనకు చేపట్టే ఏ కార్యక్రమానికైనా ముందుంటాను. 

                                                                                                            హనుమా  

Advertisement
Advertisement