పంటలకు ప్రాణం

ABN , First Publish Date - 2021-07-18T06:01:52+05:30 IST

ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణంపోయగా, రైతుల ఆశలు సజీవంగా మిగిలాయి. జూలై మాసం చివరి దశకు చేరినా ఇంతకాలం నల్లటి మబ్బులే తప్ప చినుకు జాడలేక సాగు పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు దిగాలు చెందారు.

పంటలకు ప్రాణం

ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు

ఓ వైపు వరి సేద్యం, మరోవైపు మెట్ట పంటల జోరు

సాగు పనుల్లో రైతాంగం బిజీబిజీ

పత్తి దిగుబడులపై పెరిగిన ఆశలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణంపోయగా, రైతుల ఆశలు సజీవంగా మిగిలాయి. జూలై మాసం చివరి దశకు చేరినా ఇంతకాలం నల్లటి మబ్బులే తప్ప చినుకు జాడలేక సాగు పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు దిగాలు చెందారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగా, మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు రో జులుగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయరంగానికి ఊపిరి పోశాయి. దీంతో సాగుపనులు ఊపందుకోగా, పత్తి చేలు, మెట్ట పంటలు కళకళలాడుతున్నాయి. ఎర్రనేలతో పాటు నల్లరేగడిలో సాగుచేసిన పత్తి ఏపుగా పెరుగుతోంది. ఇప్పటికే పత్తి సాగుచేస్తున్న రైతులు అదనంగా మరో రెండు నెలలు కంది సాగు చేసే అవకాశం ఏర్పడింది.


ఉమ్మడి జిల్లాలో వరితోపాటు పత్తినే రైతులు అధికంగా సాగుచేస్తున్నారు. గత ఏడాది పత్తి భారీగా సాగుకాగా, అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడారు. ప్రస్తుతం అడపాదడప కురుస్తున్న వర్షాలతో పాటు వరుస ముసురుతో ఈ ఏడాది సైతం రైతులు పత్తి సాగుకే మొగ్గుచూపారు. దీంతో మెట్టలో ప్రధాన పంటగా పత్తి విస్తీర్ణం భారీగా పెరిగింది. వ్యవసాయశాఖ అధికారులు సైతం వరికి బదులు మెట్ట పంటలను, ముఖ్యంగా పత్తినే సాగుచేయాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండగా, బోరు బావులు పుష్కలంగా నీరు పోస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల రైతులు వరి సాగును వదులుకునేందుకు సిద్ధంగా లేరు. మైనర్‌, మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కింద అత్యధికంగా వరినే సాగవుతోంది. నాన్‌ఆయకట్టులో మెట్టపంటలతో పాటు వరి సేద్యమవుతోంది.


పెరిగిన పంటల విస్తీర్ణం

నల్లగొండ జిల్లాలో పత్తి పంట విస్తీర్ణం పెరిగింది. ఈ సీజన్‌లో 8.10లక్షల ఎకరాల్లో పత్తి సేద్యం అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కాగా, ఇప్పటి వరకు 7లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగైంది. గత ఏడాది పత్తి 7.30లక్షల ఎకరాల్లో సాగైంది. మరి కొద్ది రోజుల పాటు పత్తి విత్తనాలు వేసే అవకాశం ఉంది. వరి 3.60లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో రైతులు ఆ వైపుగా వరి నార్లు కూడా పోశారు. వరి ఇప్పటి వరకు 4వేల ఎకరాకు పైగా విస్తీర్ణంలో సాగైంది. రైతులు ఇప్పుడిప్పుడే పొలాలు సిద్ధం చేసుకోవడంతో పాటు నారుమడులు చేశారు. కాగా, పంటల విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధంగా ఉంచింది. కందులకు మరింత సమయం ఉండటంతో విత్తనాలను అందుబాటులో ఉంచారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటికే 73,500ఎకరాల్లో నాట్లు వేశారు. యాదాద్రి జిల్లాలో ముందస్తుగానే వరి నార్లు  వేసుకొని సిద్ధంగా ఉండటంతో నాట్లు ముమ్మరమయ్యాయి. పత్తి 1.95లక్షల ఎకరాలకు ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో సాగైంది. కందులు 46వేల  ఎకరాలకు 19,151ఎకరాల్లో సాగైంది. సూర్యాపేట జిల్లాలో 4,25,527 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 1,30,440ఎకరాల్లో సాగైంది. పత్తి 1,39,514ఎకరాలకు 1.10లక్ష ఎకరాల్లో, కందులు 18,869ఎకరాలకు 4,315ఎకరాల్లో సాగయ్యాయి.


విస్తారంగా వానలు

ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటల సేద్యం ఊపందుకుంది. రైతాంగం ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమైంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు వేసిన రైతులు పత్తిచేళ్లలో గుంటుక తోలుతున్నారు. యాదాద్రి జిల్లాలో జూన్‌ 1 నుంచి ఈనెల 17 వరకు 187.03మి.మీ వర్షపాతానికి ఇప్పటికే 368. 09మి.మీ వర్షం కురిసింది. 97 మి.మీ వర్షం అధికంగా నమోదైంది. ఈ జిల్లాలో మెట్ట పంటల కంటే అత్యధికంగా వరి ఇప్పటికే సేద్యమైంది. తాజాగా కురుస్తున్న వానలతో మెట్టపంటల సేద్యం కూడా ఊపందుకోనుంది. సూర్యాపేట జిల్లాలో జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు 184.09మి.మీ సాధారణ వర్షపాతానికి 264.07మి.మీ వాన కురిసింది. 43మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలో జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు 166.08మి.మీ సాధారణ వర్షపాతానికి 268.02మి.మీ కురిసింది. జిల్లాలో అధికంగా 61మి.మీ వర్షపాతం నమోదైంది. విస్తారంగా పడుతున్న వానలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిక వానలు కురిస్తే పత్తిచేలపై ప్రభావం చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు.


వర్షాలు సాగుకు అనుకూలం : శ్రీధర్‌రెడ్డి, నల్లగొండ జేడీఏ

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటల సాగుకు అనుకూలం. సకాలంలో వానలు పడుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుత సీజన్‌లో సమయానికి విత్తనాలు వేశారు. వరి నారును కూడా రైతులు సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుత సీజన్‌లో ముందస్తుగా రైతుబందు పెట్టుబడి సాయాన్ని అందజేసింది. దీంతో రైతులకు పెట్టుబడుల ఇబ్బంది లేదు.


Updated Date - 2021-07-18T06:01:52+05:30 IST