మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒకే ఒక్క ఆలోచన.. అదేంటో తెలిస్తే ఏదీ సమస్య కానేకాదు!

ABN , First Publish Date - 2021-12-15T17:26:24+05:30 IST

జీవితంలో మనకు ఎదురయ్యే విషాదకర ఘటనల కన్నా..

మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒకే ఒక్క ఆలోచన.. అదేంటో తెలిస్తే ఏదీ సమస్య కానేకాదు!

జీవితంలో మనకు ఎదురయ్యే విషాదకర ఘటనల కన్నా మన మనసు సృష్టించే సమస్యలే అధికం. మనసు వ్యతిరేక ఆలోచనల్లో కూరుకుపోయినప్పుడు మనం సమర్థవంతంగా పనిచేయలేం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నిరంతరం మన మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలి?.. ఈ విషయాలను ప్రముఖ ఆంగ్ల రచయిత లూయిస్ ఎల్. హే తన పుస్తకం 'యు కెన్ హీల్ యువర్ లైఫ్' లో వివరించారు. ఆ అమూల్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మనకు ఎదురయ్యే అనుభవాలన్నిటికీ మనమే బాధ్యత వహించాలి. మన ప్రతి ఆలోచన మన భవిష్యత్తును తయారు చేస్తుంది. అయితే ఈ  ఆలోచనల అధికార కేంద్రం ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వీయ ద్వేషానికి, అపరాధానికి లోనవుతుంటారు. ఫలితంగా ప్రతి ఒక్కరూ 'నేను అంత మంచివాడిని కాదు.' అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే. అయితే ఇటువంటి ఆలోచనలను మార్చవచ్చు. మనకు వచ్చే మానసిక వ్యాధులను మనమే సృష్టించుకుంటాం. కోపం, విమర్శ, అపరాధం మొదలైనవి అత్యంత హానికరమైన ఆలోచనలు. గతాన్ని మరచి అందరినీ క్షమించాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలనే కోరిక బలంగా కలగాలి. వర్తమానంలో మనల్ని మనం అంగీకరించడం ద్వారా మాత్రమే మనం సానుకూల మార్పును పొందగలం. ఎప్పుడైతే మనల్ని మనం నిజంగా ప్రేమించుకోవడం మొదలుపెడతామో అప్పుడు జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతాయి.



ప్రతి క్షణం ఒక కొత్త ప్రారంభం

జీవితంలో శక్తి అనేది ఎప్పుడూ ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది. ఈ క్షణంలో ఇప్పుడే మన మనసును మార్చుకోవచ్చు. ఇంతకాలం మనం ప్రతికూల ఆలోచనల్లో కూరుకుపోయాయి, అర్థం లేని పోరాటం చేస్తున్నాం. ఈ రోజు నుంచే ఈ క్షణంలో జీవించడం ద్వారా మనం మార్పును చవిచూడవచ్చు. మీ సొంత మానసిక ప్రపంచానికి మీరే రాజు. గతమనే దాని నుంచి ఏర్పడిన ఆలోచనలు, నమ్మకాలను ఈ క్షణంలోనే తుడిచివేయండి. ప్రతి క్షణం కొత్త ప్రారంభానికి నాంది పలకండి.

ఈ క్షణంలో ఏమి ఆలోచిస్తున్నారు?

ఒక క్షణం ఆగి, ఇప్పుడున్న మీ ఆలోచనను పట్టుకోండి. ఈ సమయంలో మీరు ఏమి ఆలోచిస్తున్నారు? మీ ఆలోచనలే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మీ ఆలోచనలను పట్టుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే అవి వేగంగా కదులుతుంటాయి.  అయినప్పటికీ మనం ప్రయత్నపూర్వకంగా దీనిని సాధించవచ్చు. మీ నోటి నుంచి ప్రతికూలమైన మాటలు వచ్చినప్పుడు.. వెంటనే నియంత్రించండి. ఈ విధంగా ప్రతీక్షణం ప్రయత్నించండి. ఇటువంటి ఆలోచనలు మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఇంకా మీరు సమస్యలను, బాధను కలిగించే ఆలోచనలను చేస్తుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఉదాహరణకు మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేసే ఆహారానికి దూరంగా ఉన్నట్లే, మానసిక అనారోగ్యాన్ని కలిగించే ఆలోచనలకు కూడా దూరంగా ఉండండి. మన మనస్సే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన వర్తమానంలో ఏదైనా అవాంఛనీయమైనది జరిగినప్పుడు, ఆ పరిస్థితిని మార్చడానికి మన మనస్సును ఉపయోగించాలి. 

మీ మనస్సును నియంత్రించండి

మీ ఆలోచనలకు, మాటలకు ప్రతిస్పందించే అద్భుతమైన తెలివి మీలోనే ఉంది. అవగాహనతో సరైన ఆలోచనలను ఎంచుకోవడం ద్వారా మీరు మీ మనస్సును నియంత్రించుకోవడం సులభమవుతుంది. ఇటువంటి శక్తి మీలో ఏర్పడినప్పుడు మీరు మరింత సమర్థవంతులవుతారు. ఇప్పటి వరకు మీరు మీ మనను నియంత్రణలో ఉన్నారు. ఇకపై మీరే మీ మనసును నియంత్రించండి. అప్పుడు మీలో మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏమి చేస్తున్నారనేదే మీకు ముఖ్యం. అయితే మీ పాత ఆలోచనలు తిరిగి మీ మనసులోకి చేరి 'మార్పు చాలా కష్టం' అని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, మీ మనస్సును నియంత్రించుకోండి. మీ మనసుకు.. 'నేను మారడం చాలా సులభమని నమ్ముతున్నాను’ అని చెప్పండి. ఈ విధమైన ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. అప్పుడే మీరు వర్తమానంలో ఉంటూ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోగలుగుతారు.



Updated Date - 2021-12-15T17:26:24+05:30 IST