Abn logo
Jun 2 2020 @ 12:46PM

లైఫ్ ఆప్టర్ కరోనా: మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రకృతి

కరోనా పేరు చెప్తే మానవాళి ఉలిక్కిపడుతోంది. ఒక సూక్ష్మిక్రిమి ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. లాక్‌డౌన్‌తో ఆర్థికరంగం కుదేలై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. అయితే కరోనా వల్ల నష్టమే కాదు- ఒక లాభం కూడా జరిగింది. కాలుష్య భూతం నుంచి పర్యావరణాన్ని కాపాడింది. జబ్బుపడిన పర్యావరణానికి ఒకింత స్వస్థత చేకూర్చింది.


కరోనా ప్రమాద ఘంటికలకి భయపడి సుమారు రెండు నెలలకు పైగా ప్రపంచ దేశాలు స్వీయఖైదు విధించుకున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో ప్రపంచానికి ఒక లాభం కూడా చేకూరింది. కాలుష్యం అనే జబ్బుతో కునారిల్లుతున్న ప్రకృతికి ప్రాణవాయువు అందేలా కరోనా దోహదపడింది. 


లాక్‌డౌన్‌ సమయంలో కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసులు లేవు. ఫ్యాక్టరీలు లేవు. ఆడంబరాలు లేవు. సినిమాలు లేవు. షికార్లు లేవు. మాల్స్ లేవు. సేల్స్‌ లేవు.. రోడ్లపై వాహనాల చప్పుళ్లే లేవు. నింగిలో విమానాల విహారం లేదు. పట్టాలపై రైళ్ల పరుగులు లేవు. రేవు దాటే ఓడల జాడలు లేవు. ఇలా జనజీవితం మొత్తం బంద్‌ కావడంతో వాతావరణం ఒక్కసారిగా తెరిపిన పడింది. జల, వాయు, శబ్ధ కాలుష్యాల ఉక్కిరిబిక్కిరి నుంచి గొప్ప ఉపశమనం లభించింది.


కరోనా కాలంలో ఆకాశం బాగా తేటపడింది. గాలి పరిశుభ్రమైంది. హారన్ల మోత తగ్గిపోయింది. దీంతో రాత్రివేళ నింగిలో నక్షత్రాల వెలుగు మరింత దేదీప్యమానం అయ్యింది. మనుషుల అలికిడి తగ్గడంతో పశుపక్ష్యాదుల సందడి పెరిగింది. వనాలలో వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరించిన దృశ్యాలు సాక్షాత్కరించాయి. నదులు, వాగుల్లో తేటనీరు పారుతోంది. కాలుష్యం తగ్గడంతో ఎవరెస్ట్‌ శిఖరపు శోభ దూరప్రాంతాల వారికి కూడా కనువిందు చేస్తోంది. ఏప్రిల్‌ 3న పంజాబ్‌లోని జలంధర్‌ ప్రజలు వంద మైళ్ల దూరంలో ఉన్న హిమాలయాలను మళ్లీ వీక్షించగలిగారు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి వారు పరమానందభరితులయ్యారు. గంగానది కూడా అనూహ్య రీతిలో కాలుష్యం నుంచి తేరుకోవడం మరో శుభవార్త. గంగ ఒడ్డున ఉన్న అనేక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడటంతో కాలుష్య జలాలు నదిలో కలవలేదు. దీంతో తీర్థజలంలా ఆ జీవనది కళకళలాడుతోంది. ఈ పరిణామాలను చూసి పర్యావరణ ప్రేమికులు మురిసిపోతున్నారు. 


భారత్‌లో గత నలభై ఏళ్ల తర్వాత తొలిసారి కర్బన ఉద్గారాలు తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కార్బన్‌ ఉద్గారాలు 30 శాతంమేర తగ్గినట్టు తాజా సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. దేశంలో ఎక్కువ కార్బన్‌ ఉద్గారాలు విద్యుత్‌, రవాణా రంగాల నుంచే వెలువడుతుంటాయి. మార్చిలో దేశంలోని బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి 15 శాతం వరకు విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. శిలాజ ఇంధనాల వాడకం తగ్గడంతో సహజంగానే కార్బన్‌ ఉద్గారాల విడుదల కూడా ఆ మేరకు తగ్గిపోయింది. 


అభివృద్ధి అనే పరుగులో పడి పర్యావరణ పరిరక్షణను విస్మరించడం వల్ల అనేక విపత్తులు తలెత్తుతున్నాయి. మానవ మనుగడకి ఊతమిచ్చే గాలి, నీరు, నేల కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. ప్లాస్టిక్‌ వాడకానికి ఎడిక్ట్‌ అయిపోయాం. పాలిథిన్‌ కవర్లతో నదులు, సముద్ర గర్భాలని నింపేస్తున్నాం. పారిశ్రామిక వ్యర్థాలతో పరిసరాలను విషపూరితం చేస్తున్నాం. ఓజోన్‌ పొరకి చిల్లులుపడుతున్నాయి. అతినీల లోహిత కిరణాలు నేరుగా భూ ఉపరితలాన్ని తాకుతున్నాయి. సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఉత్తర- దక్షిణ ధృవాల్లోని మంచు కరుగుతోంది. ఫలితంగా ప్రకృతి సమతౌల్యం దెబ్బతిని రుతువులు గతితప్పాయి. తుపానుల విజృంభణ తీవ్రమైంది. వేసవి గాడ్పుల మంట ప్రాణాలు తోడేస్తోంది.. 


ఈ విపరిణామాలన్నింటికీ.. మన లైఫ్‌ స్టయిలే కారణం. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రజలకి అందుబాటులోకి తేవాలి. కానీ ఈ విషయంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం ఒక సోషల్‌ స్టేటస్‌గా మారిపోయింది. పెట్రోల్‌, డీజిల్‌ వాడకం అపరిమిత స్థాయికి చేరింది. నగర జీవితపు విలాసాలకు తగ్గట్టుగా విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్‌ క్రమశిక్షణ విషయంలో అవగాహన కరువైంది. ఫలితంగా హారన్ల మోతతో చెవులు చిల్లులు పడుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను ట్రీట్‌మెంట్‌ చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాలన్న నిబంధనలను ఆయా పరిశ్రమల యజమానులు పాటించడం లేదు. ఈ కారణంగా వాగులు, వంకలు, నదులతోపాటు భూగర్భ జలాలు కూడా విషతుల్యం అవుతున్నాయి. సభ్యసమాజంలో అనేక రకాల రోగాలు విపరీతంగా ప్రబలడానికి ఈ కాలుష్యమే ప్రధాన కారణం. ఎప్పుడైతే కరోనా భయంతో లాక్‌డౌన్‌ ప్రకటించారో.. ఆనాటి నుంచే ఈ కాలుష్యపు వెల్లువ బాగా తగ్గుముఖం పట్టడం గమనార్హం! 


ప్రపంచంలోని 20 అత్యంత కలుషిత నగరాలలో 14 నగరాలు మన దేశంలోనే ఉండటం ఒక విపత్కర సందర్భం. అయితే ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి అందిన నివేదికల ప్రకారం ఈ సంఖ్య ఇప్పుడు రెండుకి తగ్గింది. ప్రస్తుతానికి ముంబై, కోల్‌కతా మాత్రమే ఆ చిట్టాలో ఉన్నాయి. కొద్ది వారాల్లోనే దేశ పర్యావరణ రంగంలో చోటుచేసుకున్న ఈ మార్పుకి కారణం మాత్రం కచ్చితంగా కరోనా వైరస్సే. లాక్‌డౌన్‌ వేళ అన్ని రకాల జీవన వ్యాపకాలు బంద్‌ కావడం, ముఖ్యంగా ఫ్యాక్టరీలు మూతపడటంతో ప్రకృతి తనకు తానే కాలుష్యం నుంచి ప్రక్షాళన అయ్యిందన్న మాట!


గాలిలో కాలుష్యం పెరిగితే న్యూమోనియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. వాయు కాలుష్యం వల్ల యేటా దాదాపు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో మన దేశంలో వాయుకాలుష్యం 90 శాతం తగ్గిపోయిందట. ఎక్కడికక్కడ గాలి స్వచ్ఛంగా మారడంతో శ్వాససంబంధ వ్యాధులు కొంతవరకైనా తగ్గుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కరోనా మహిమ అనే చెప్పుకోవాలి! వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం బాగా క్షీణించడంతో వర్షాకాల సీజన్‌ కాస్త ముందే ఆరంభం కావచ్చునని అంటున్నారు. మే 31వ తేదీనాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకవచ్చునని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. 


గత అయిదేళ్లతో పోలిస్తే ప్యారిస్‌ నగరంలో 46 శాతం, సిడ్నీలో 38 శాతం, బెంగళూరులో 35 శాతం, లాస్‌ ఏంజెల్స్‌లో 29 శాతం, రియో డిజనీరోలో 26 శాతం వాయుకాలుష్యం తగ్గిందట. హైదరాబాద్‌ నగరంలో మార్చి 22 నాటికి గరిష్టంగా కాలుష్య పరిమాణం 196 మైక్రాన్లుగా నమోదు అయితే ఏప్రిల్‌ రెండో వారం నాటికి అది 64 మైక్రాన్లకు తగ్గిపోయింది. విపరీతమైన పొగ, దుమ్ము, ధూళితో నిండిపోయిన ఢిల్లీ నగరం కూడా ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటోంది. ఇక్కడి వాతావరణంలో కాలుష్యం రేటు 57. 64 శాతానికి తగ్గిపోయింది. లాక్‌డౌన్‌కి ముందు ఢిల్లీలో వాయు కాలుష్యం 300 మైక్రాన్లు ఉంటే... లాక్‌డౌన్‌ తర్వాత అది 76 శాతంగా నమోదయ్యింది.


ప్రకృతిని మనం వికృతిగా మారిస్తే.. అది మానవాళి ప్రాణాలను హరించేస్తుంది. ఈ సూత్రాన్ని ఇకపై ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పాలకులకి ఈ ఎరుక ఎంతో ముఖ్యం. కరోనా ప్రబలిన తర్వాత ఆరోగ్య ఎమర్జెన్సీ అనే కొత్త పరిణామం మన అనుభవంలోకి వచ్చింది. ప్రభుత్వాలు విధించిన ఆంక్షల పర్వాన్ని ప్రజలు పాటించక తప్పలేదు. కరోనాతో సహజీవనానికి ప్రజానీకం అలవాటుపడే రోజులు వచ్చేశాయి. ఈ తరుణంలో మెల్లమెల్లగా లాక్‌డౌన్‌ని సడలిస్తున్నారు. జనం మళ్లీ రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కొన్నికొన్ని జాగ్రత్తలు పాటించడం అత్యవసరం!


ఇంధన వనరుల వినియోగం విషయంలో పొదుపు చర్యలను చేపట్టాలి. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ని ప్రజలు వినియోగించేలా అవగాహన కల్పించాలి. పరిశ్రమల్లో వ్యర్థాల ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటును, నిర్వహణను తప్పనిసరి చేయాలి. కాలుష్య నియంత్రణబోర్డులకి పట్టిన అవినీతి కాలుష్యాన్ని ముందుగా ప్రక్షాళనం చేయాలి. అన్నింటికంటే ప్రధానంగా.. ప్రజల లైఫ్‌ స్టయిల్‌లో మార్పు రావాలి. లగ్జరీకి దూరంగా.. నిరాడంబరంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. వృథా ఖర్చులపై వేటు వేయాలి. అనవసరపు ప్రయాణాలకు స్వస్తిచెప్పాలి. ఇలాంటివన్నీ పాటిస్తే.. ప్రకృతి మెల్లమెల్లగా కోలుకుంటుంది. 


కరోనా వ్యాప్తి తర్వాత ప్రపంచంలో భౌతిక దూరం అనే మాట బాగా వాడుకలోకి వచ్చింది. ఆరోగ్య ప్రాధాన్యాన్ని మళ్లీమళ్లీ గుర్తుచేసింది. వచ్చే రోజుల్లో ప్రజల జీవనశైలిలో ఈ మార్పు ప్రతిఫలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్భాటాలు, అతి పోకడలు వంటివి బాగా తగ్గవచ్చు. ఈ పరిణామం కొంతైనా ప్రకృతికి మేలు చేస్తుందని చెప్పక తప్పదు. ఇది పరోక్షంగా మానవాళికి కూడా మంచిదే! ఇదే కరోనా మనకు నేర్పిన సరికొత్త పాఠం. 

Advertisement
Advertisement