లైఫ్ ఆఫ్టర్ కరోనా: కిల్లర్‌ కరోనా వల్ల పిల్లర్‌కి పగుళ్లు

ABN , First Publish Date - 2020-05-27T19:08:58+05:30 IST

అంటువ్యాధుల వంటి ప్రమాదకర సందర్భాలు ఏర్పడినప్పుడు సాధారణంగా మీడియాకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందునా పత్రికల పాత్ర కీలకం అవుతుంది.

లైఫ్ ఆఫ్టర్ కరోనా: కిల్లర్‌ కరోనా వల్ల పిల్లర్‌కి పగుళ్లు

అంటువ్యాధుల వంటి ప్రమాదకర సందర్భాలు ఏర్పడినప్పుడు సాధారణంగా మీడియాకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందునా పత్రికల పాత్ర కీలకం అవుతుంది. అయితే కరోనా విజృంభణ తర్వాత న్యూస్‌పేపర్లకి అనూహ్యమైన విపత్తు వచ్చిపడింది. లాక్‌డౌన్‌ వల్ల దారితీసిన కష్టాలు పత్రికల నిర్వహణకి ప్రతిబంధకంగా మారాయి. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా పత్రికారంగం నష్టాలబాట పట్టింది. 


ఎక్కడో చైనాలోని వూహాన్‌ నగరంలో కరోనా కలకలం రేగితే ఆ విషయాన్ని ప్రపంచానికి చేరవేసింది మీడియానే. రోజుల వ్యవధిలోనే ఆ వైరస్‌ ఎలా విశ్వరూపం దాల్చిందో, ఎన్నెన్ని దేశాలను చుట్టిముట్టిందో, ఈనాటికీ ఎలా టెర్రర్‌ పుట్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చేరవేసిన ఏకైక మాధ్యమం మీడియానే. కొవిడ్‌- 19గా నామకరణం పొందిన ఆ వైరస్‌తో ప్రపంచ దేశాలు చేస్తున్న యుద్ధం గురించి వార్తా కథనాలు అల్లిందీ, ఆ సన్నివేశాలను కళ్లకు కట్టించింది కూడా మీడియానే. వార్తల కవరేజ్‌కి వెళ్లి ఆ వైరస్‌ బారినపడ్డ పాత్రికేయుల సాహసకృత్యాలను చాటిచెప్పింది కూడా ప్రచార- ప్రసార మాధ్యమాలే. అటువంటి మీడియరంగం కూడా ఇప్పుడు తీవ్ర కష్టాల్లో చిక్కుకుంది. "కాదేదీ కవితకు అనర్హం'' అన్న కవి మాటలను కొంచెం సవరించి "కాదేదీ కరోనా సోకడానికి అనర్హం'' అని చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. 


లాక్‌డౌన్‌ విధింపుతో దేశమే ఒక పెద్ద ఖైదులా మారిపోయింది. సకలం బంద్‌! ఏ క్షణాన ఎటువైపు నుంచి కరోనా కమ్మేస్తుందో అనే భయంతో దిక్కులు చూస్తూ గడపాల్పిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి విపత్కర స్థితిలో మీడియాకి ప్రధాన ఆదాయ వనరు అయిన ప్రకటనలన్నీ నిలిపోయాయి. ఈ పరిణామం న్యూస్‌ పేపర్‌ సెక్టార్‌ని అనూహ్య నష్టాల్లోకి నెట్టేసింది! ప్రసార మాధ్యమం పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే తీరుగా ఉంది. కోట్లాది పాఠకులు- వీక్షకులను- లక్షలాది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ సెక్టార్‌ ఇప్పుడు కష్టాల కడలికి ఎదురీదుతోంది. 


ప్రసార-ప్రచార మాధ్యమ రంగంలో ప్రింట్‌ మీడియాకే కాసింత ప్రాధాన్యం ఉంటుంది. న్యూస్‌ ఛానెళ్లలో రోజంతా ఎన్ని వార్తలు విన్నా.. చూసినా.. వాటికి సంబంధించిన పూర్తి కథనాలను ఆ మర్నాడు పత్రికల్లో చదువుకోనిదే కొందరికి తృప్తి అనిపించదు. ఈ తరహా సంప్రదాయ పాఠకుల సంఖ్య అపరిమితంగా ఉండబట్టే... కుప్పలు తెప్పలుగా న్యూస్‌ ఛానెళ్లు వచ్చినా దినపత్రికల ప్రాధాన్యంగానీ, సర్క్యులేషన్‌ గానీ ఏమాత్రం తగ్గలేదు. పైగా పెరిగింది కూడా! ఇంతటి పాఠకాదరణ, బలమైన మార్కెట్‌ కలిగి ఉన్న పత్రికా రంగాన్ని కూడా గట్టిగానే కాటేసింది మాయదారి కరోనా! చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా దాదాపుగా ప్రచురణకర్తలంతా విలవిల్లాడిపోతున్నారు.


లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సర్వీసుల్లో భాగంగా మీడియాకి మినహాయింపు లభించింది. అయినప్పటికీ.. అచ్చయిన దినపత్రికలను పాఠకులకి చేర్చే వ్యవస్థకి ఆటంకమేర్పడింది. పేపర్లు విడి ప్రతులు అమ్మే షాపులు సైతం మూతపడ్డాయి. దీనికితోడు.. రాజకీయ, వ్యాపార, సినీ, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ బంద్‌ అయ్యాయి. వాటికి సంబంధించిన ప్రచార ప్రకటనలు సున్నాకి చేరాయి. మీడియాకి అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చే అన్ని రకాల ప్రోడక్ట్‌ల ఉత్పత్తులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో వాణిజ్య ప్రకటనలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వపరమైన ప్రకటనల శాతం బాగా తగ్గిపోయింది. మార్కెట్‌లో సేల్స్‌ దెబ్బతినడంతోపాటు యాడ్‌ రెవిన్యూ కూడా పడిపోవడంతో పత్రికా రంగం నిలువునా కుదేలయ్యింది. 


దెబ్బమీద దెబ్బ అన్నట్టుగా న్యూస్‌ప్రింట్‌ దిగుమతి సుంకం భరించలేని స్థాయికి చేరింది. ఫలితంగా న్యూస్‌ప్రింట్ వినియోగాన్ని సాధ్యమైనంత నియంత్రించడం ద్వారా దిగుమతులను తగ్గించే వ్యూహాన్ని యాజమాన్యాలు అమలుచేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే క్రమంలో పలు పత్రికలు తమ పేజీలను కుదించివేశాయి. సండే సప్లిమెంట్‌ను మెయిన్‌ పేజీల్లోకి కలిపేశాయి. కొన్ని స్పెషల్‌ పేజీలను రద్దుచేశాయి. దేశంలో చిన్నాచితకా పత్రికలు కొన్ని ఇప్పటికే మూతపడ్డాయి. పరిస్థితి మరింత వికటిస్తే పెద్ద పత్రికల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడేలా ఉంది. అదే జరిగితే.. దేశీయ న్యూస్‌ప్రింట్‌ తయారీ పరిశ్రమ కూడా సంక్షోభంలోకి జారుకుంటుంది. పత్రికల్లో పనిచేసే ఉద్యోగులు, ముద్రణా పరిశ్రమలు, పేపర్‌ ఏజెన్సీల నిర్వాహకులు, పత్రికల అమ్మకందారులు, డెలివరీ బాయ్స్‌.. ఇలా అనేకమంది ఉపాధి దెబ్బతింటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 30 లక్షలమందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పత్రికలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. 


తెలుగునాట ప్రస్తుతం ప్రధాన దినపత్రికలన్నీ తక్కువ పేజీల్లోనే పొదుపుగా వార్తలను ముద్రిస్తూ పత్రికలు ఉనికిపాట్లు పడుతున్నాయి. కొవిడ్‌ సమస్య నుంచి బయటపడిన తర్వాత కూడా కొన్ని నెలలపాటు పత్రికారంగాన్ని సమస్యలు వెంటాడతాయి. ఈ నేపథ్యంలోనే పత్రికా యాజమాన్యాలు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. మీడియాలో తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు అచ్చు పత్రికల స్థానంలో ఆన్‌లైన్ ఎడిషన్ల ప్రాచుర్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. 


పెద్ద పత్రికలన్నీ న్యూస్‌ప్రింట్‌ను రష్యా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత వెంటనే న్యూస్‌ప్రింట్‌ సరఫరా మొదలుకాకపోవచ్చు. అందువల్ల దేశంలోని ప్రధాన పత్రికలన్నీ పేజీలను కుదించడం ద్వారా తమ ముందుచూపును ప్రదర్శించాయి. అయితే రాబోయే రోజుల్లో న్యూస్‌ప్రింట్‌ సంక్షోభం తలెత్తుతుందని మీడియారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా కుదేలయ్యాయి. అందువల్ల మీడియాకి వాటినుంచి ఆశించిన సపోర్ట్‌ వెంటనే అందకపోవచ్చునని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


లాక్‌డౌన్‌ కారణంగా మీడియాతోపాటు వినోదరంగానికి కూడా అడ్వర్టయిజ్‌మెంట్‌, సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం భారీగా తగ్గినట్టు రేటింగ్‌ ఏజెన్సీ "క్రిసిల్‌'' తాజాగా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఇండస్ట్రీ ఆదాయం 16 శాతం క్షీణించవచ్చునని అంచనా వేసింది. మీడియా, వినోద రంగం మొత్తం ఆదాయంలో ప్రకటనల రూపంలో వచ్చే రాబడి వాటా 45 శాతం. ఇంత పెద్ద మొత్తంలో కోత పడితే మీడియా గానీ, వినోద రంగం గానీ పూర్వంలా మనుగడ సాగించలేవు. న్యూస్‌ ఛానెళ్ల ఆదాయానికి కూడా కరోనా బాగానే గండికొట్టింది. పత్రికలకి, ఛానెళ్లకి ప్రకటనలిచ్చే ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌, ఈ-కామర్స్‌ తదితర రంగాలు కరోనా వల్ల బాగా కుదేలయ్యాయి. ఈ రంగాలు పుంజుకుంటేనే రేపటినాడు మీడియాకి యాడ్స్‌ పెరుగుతాయి. అంతవరకూ ఈ కటకటలు తప్పకపోవచ్చు. 


సందట్లో సడేమియా అన్నట్టుగా పత్రికలపై మరో పిడుగు పడింది. అసలే  కారోనా పేరు చెప్తే జడుసుకునే సందర్భమిది. ఇలాంటి తరుణంలోనే పత్రికల ద్వారా కరోనా సోకుతుందనే దుష్ప్రచారం మొదలైంది. ఈ తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరస్‌లా పాకిపోయింది. నిజం గడప దాటేలోపు అబద్ధం లోకమంతా చుట్టివస్తుంది అంటారు కదా.. అలాగే తయారైంది పరిస్థితి! ఒక పుకారు కారణంగా పత్రికలవైపు తొంగిచూడ్డానికే చాలామంది భయపడ్డారు. పలుచోట్ల పత్రికలను పంపిణీ చేయవద్దంటూ సేల్స్‌ ఏజెంట్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక పత్రికలు ఒక్కసారిగా తమ సర్క్యులేషన్‌ తగ్గించుకోవలసి వచ్చింది. ఈ తరహా ఫేక్‌ వార్తలను నమ్మవద్దని కేంద్రప్రభుత్వ పెద్దలు గట్టిగా చెప్పలేకపోయారు. "పుకార్లను నమ్మవద్దు. వార్తాపత్రికలు చదవడం ద్వారా మీరు వ్యాధి బారిన పడరు'' అంటూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేసి వదిలేశారే తప్ప దీనిపై ఆశించిన స్థాయిలో ప్రచారం చేపట్టకపోవడం గమనార్హం. 


లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న వార్తా పత్రికలు కేంద్రప్రభుత్వాన్ని శరణువేడాయి. పత్రికల మనుగడకు సహకరించాలని అభ్యర్థించాయి. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార  మంత్రిత్వశాఖ కార్యదర్శికి "ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ'' ఒక లేఖ రాసింది. కరోనా వ్యాప్తి, ప్రకటనల ఆదాయం పడిపోవడం, నిర్వహణ వ్యయం పెరగడం, న్యూస్‌ ప్రింట్‌పై కస్టమ్స్‌ సుంకం వంటి సమస్యలతో దేశీయ వార్తా పత్రికలు అతలాకుతలం అవుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో పత్రికలకు రెండేళ్ల పాటు పన్ను రాయితీ ఇవ్వాలనీ, న్యూస్‌ప్రింట్‌ మీద దిగుమతి సుంకం ఎత్తివేయాలనీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోతే దేశీయ పత్రికారంగం వచ్చే ఆరేడు నెలల్లో సుమారు 15 వేలకోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదముందని కూడా ఐఎన్ఎస్ వెల్లడించింది.. 


ఇదిలా ఉంటే.. కేంద్రం సహా వివిధ రాష్ట్రప్రభుత్వాలకు చెందిన ప్రకటనల విభాగాలు మీడియా సంస్థలకు 1500 కోట్ల నుంచి 1800 కోట్ల రూపాయల మేర బకాయి పడినట్లుగా ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ తాజాగా సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మీడియారంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కోర్టుకి ఒక ఆఫిడవిడ్‌ సమర్పిస్తూ ఈ వివరాలు వెల్లడించింది. ఇందులో ప్రింట్‌ మీడియా వాటా 800 కోట్ల నుంచి 900 కోట్ల వరకు ఉందని తెలిపింది. ప్రస్తుత కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని ఆయా ప్రభుత్వాలు తక్షణం విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం తాజాగా ప్రకటించిన ప్యాకేజీలో కూడా మీడియారంగ ప్రస్తావన లేకపోవడం ఒకింత బాధాకర అంశం! 


పత్రికా రంగం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి వెన్నుదన్నుగా నిలిచే నాలుగో స్తంభం. కిల్లర్‌ కరోనా వల్ల అలాంటి పిల్లర్‌కే పగుళ్లువారుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి పత్రికారంగం త్వరగా కోలుకోవాలని ప్రజాస్వామికవాదులంతా ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్ష నెరవేరాలంటే కేంద్రప్రభుత్వ పెద్దలు కూడా తలుచుకోవాలి. మీడియా సెక్టార్‌కి పూర్వవైభవం వచ్చేలా ఊతమివ్వాలి. 


మీడియారంగం అనేది కేవలం వ్యాపారం కాదు. అదొక బాధ్యత. నిబద్దత. గొప్ప ఆదర్శం. ప్రజాపక్షం వహించే కంఠస్వరం. మీడియాపై పాలకులు కక్షగట్టిన సందర్భాలలోనూ మీడియా తలవొంచదు. తన కర్తవ్య దీక్షని వీడదు. అందుకే దశాబ్దాలుగా ప్రజలు ఆ రంగానికి నీరాజనం పడుతున్నారు. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారు. అలాంటి రంగానికే ఇప్పుడు కరోనా కష్టం వచ్చింది. ఈ సమస్య కూడా త్వరలోనే మేఘంలా కరిగిపోవాలని ఆశిద్దాం. 

Updated Date - 2020-05-27T19:08:58+05:30 IST