లైఫ్ ఆఫ్టర్ కరోనా: ఇలా చేస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ABN , First Publish Date - 2020-05-28T18:38:50+05:30 IST

కరోనా అనంతరం ప్రపంచం ఎలా ఉంటుంది? మనుషుల జీవనశైలిలో ఏ మార్పులు సంభవిస్తాయి? వచ్చే రోజుల్లో ఎలాంటి ఉద్యోగాలకి డిమాండ్‌ పెరుగుతుంది? ఫ్యూచర్‌ జాబ్స్‌ గురించి పరిశీలకులు ఏం చెప్తున్నారు? రేపటి గురించిన భయం పోవాలంటే ఏంచేయాలి?

లైఫ్ ఆఫ్టర్ కరోనా: ఇలా చేస్తే ఉద్యోగం గ్యారెంటీ!

కరోనా అనంతరం ప్రపంచం ఎలా ఉంటుంది? మనుషుల జీవనశైలిలో ఏ మార్పులు సంభవిస్తాయి? వచ్చే రోజుల్లో ఎలాంటి ఉద్యోగాలకి డిమాండ్‌ పెరుగుతుంది? ఫ్యూచర్‌ జాబ్స్‌ గురించి పరిశీలకులు ఏం చెప్తున్నారు? రేపటి గురించిన భయం పోవాలంటే ఏంచేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు వెతుక్కోవలసిన సందర్భాన్ని కరోనా ఇప్పుడు మన ముందుకు తెచ్చింది. అసలు ఉద్యోగాలు కోల్పోయే అవకావం ఉందా?.. ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై ‘ఏబీఎన్’ ప్రత్యేక కథనం..


కరోనా కోరలకి చిక్కి ప్రపంచం అల్లాడుతోంది. అగ్రదేశాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఆర్థికరంగం అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలో అనేక రంగాలు కుదేలయ్యాయి. ఆటోమొబైల్‌, పర్యాటకం, ట్రావెల్‌, హాస్పిటాలిటీ, ఫుడ్‌ ఇండస్ట్రీ, రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌ సెక్టార్‌, ఐటీ రంగాలు ఇప్పటికే భారీ కుదుపునకు గురయ్యాయి. కోట్లాది ఉద్యోగాలు ఊడే ప్రమాదం ముంచుకొచ్చింది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలోనే చాలామందికి ఇలాంటి చేదువార్తలు కూడా అనుభవంలోకి వచ్చాయి. 


ఇప్పటికే మనం రెండు ప్రపంచ యుద్ధాలను దాటుకొని వచ్చాం. ప్లేగు, కలరా, మశూచి, ఫ్లూ వంటి అంటువ్యాధులు మానవాళిని వణికించాయి. తదనంతర కాలంలో అవి కూడా వైద్యశాస్త్రం ముందు లొంగుబాటు ప్రకటన చేశాయి. కరోనా వైరస్‌కీ ఇదే గతి పడుతుంది. అయితే ఇందుకు మరికొంత సమయం పట్టవచ్చు- అంతే తేడా! ఇకపోతే.. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి అల్లాడుతున్న వారి బాధ మాత్రం వర్ణనాతీతం. అనేకమంది బతుకు చిత్రాన్ని ఈ వైరస్‌ రివర్స్‌ చేసిన మాట వాస్తవం. 


ఉద్యోగం ఊడిందని ఉసూరుమంటే రోజులెలా గడుస్తాయి? బతుకు బండి మళ్లీ గాడిన పడేది ఎప్పుడు? నిజానికి ఇప్పుడు కావాల్సింది గుండె నిబ్బరం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలం అనే మొండిధైర్యం. ఈ రెండూ ఉంటే సంక్షోభకాలంలోనూ కొత్త అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే మనమే ఆ అవకాశాల్ని సృష్టించుకోగలుతాం. పోయినచోటే వెతుక్కోవాలి అన్న పెద్దల మాటకి అసలు అర్థం ఇదే!


ఉదాహరణకి ఐటీ రంగాన్నే తీసుకోండి. కరోనా వల్ల ఈ సెక్టార్‌కి కూడా గట్టి షాక్ తగిలింది. దీంతో పలు కంపెనీలు తమ విస్తరణ పథకాలను, కొత్త నియామకాలను రద్దుచేసుకున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఈ కష్టకాలంలో కూడా ఐటీలో కొన్ని ఉద్యోగాలకి బాగా డిమాండ్‌ ఉంది. నెట్‌వర్క్‌ ఆర్కిటెక్ట్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా సైంటిస్ట్‌, ఆగ్యుమెంటెడ్‌ అండ్‌ వర్చువల్‌ రియాలిటీ ఎక్స్‌పర్ట్స్‌ వంటి స్కిల్స్‌ మీకు ఉంటే చాలు- జాబ్‌ గ్యారంటీ! ఐటీలో ఇలాంటి జాబ్‌ ఆపర్ట్యూనిటీస్‌ ఇంకెన్నో ఉన్నాయి. 


వచ్చే రోజుల్లో భూగోళమే ఒక డిజిటల్‌ ఐకాన్‌గా మారబోతోంది. కరోనా విజృంభణ తర్వాత.. ప్రపంచం తన గతిని మార్చుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ అస్తిత్వంలో ఉన్న కొన్ని రంగాలు తెరమరుగు అయ్యి.. వాటి స్థానంలో కొత్త రంగాలు తెరపైకి రావచ్చు. వర్క్‌ ఫ్రం హోం, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ గేమ్స్‌ అనేవి లాక్‌డౌన్‌ సమయంలో మన జీవితాల్ని ఎంతగా ఆక్రమించాయో చూస్తున్నాం కదా! ఈ మార్పే రేపటి మన ఆశలకి ఊతమిస్తుందనీ, కొత్త ఉపాధి మార్గాలను ఆవిష్కరిస్తుందనీ విజ్ఞులు చెబుతున్నారు.


ఇప్పటివరకూ ప్రపంచం వైపు పరుగుతీసిన జనాలు.. ఇకపై ప్రపంచాన్నే తమవైపు పరుగు తీయించుకుంటారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒకేఒక్క డిజిటల్‌ గాడ్జెట్‌ ఉంటే చాలు- అరచేతిలోనే వార్తా ప్రపంచం. చిటిక వేస్తే- కావాలసిన సరుకులు గుమ్మం ముందు ప్రత్యక్షం. కోరుకున్న వారికి కోరుకున్నంత కాలక్షేపం. ధియేటర్‌కి వెళ్లకుండానే కొత్త సినిమాని ఇంట్లో చూసే సదుపాయం- ఇలా చెప్తూ పోతే ఎన్నో అద్భుతాలు. ఇలాంటి సేవలన్నీ ఊరికే జరిగిపోవు. కనిపించని మరో ప్రపంచం ఆ సేవలను అందిస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్‌ రంగమే వచ్చే రోజుల్లో అనేక ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. 


లాక్‌డౌన్‌ సమయంలో కంటెంట్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌ వంటివాటికి జనం బాగానే అలవాటుపడ్డారు. మొబైల్‌ గేమ్స్‌పై క్రేజ్‌ మరింత పెరిగింది. నలుగురు లేదా ఐదుగురు ఫ్రెండ్స్‌ ఎవరి ఇంట్లో వాళ్లే కూర్చుని ఆన్‌లైన్‌లో ఒకే ఆటని ఆడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో ఈ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


ఆర్థికరంగంలో డిజిటల్‌ లావాదేవీలదే ఇకపై పైచేయి. చెల్లింపులు, డిపాజిట్లు వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగే అవకాశముంది. కరోనాకి ముందు డిజిటల్‌ చెల్లింపులపై అంతగా ఆసక్తి చూపని వారు కూడా ఇప్పుడు ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారరంగంలో ఈ-కామర్స్‌ అతిపెద్ద సెక్టార్‌గా అవతరిస్తుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అదే నిజమైతే కళ్లెదుట కనిపించే దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ సందడిని కోల్పోవచ్చు. అప్పుడు ఆ సెక్టార్‌లో ఉద్యోగాలు కోల్పోయేవారికి ఈ- కామర్స్‌ రంగం చోటిస్తుందన్న మాట! అయితే ఆ మేరకు నైపుణ్యాలు పెంచుకోవడం అత్యవసరం!


ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌, ఆన్‌లైన్‌ పాఠాలు, ఆన్‌లైన్‌ ట్యూటర్‌, ఆన్‌లైన ట్యూషన్‌.. ఇవీ ఇకపై విద్యారంగంలో విస్తృతం కాబోతున్న ప్రయోగాలు. బ్లాక్‌బోర్డ్‌ ప్లేస్‌ని డిజిటల్‌ స్క్రీన్‌ ఆక్రమించబోతున్నది. పిల్లలకి డిజిటల్‌ పాఠాలు అలవాటు చేయడంలో భాగంగా గేమిఫికేషన్‌ అనే కొత్త ట్రెండ్‌ని వారికి రుచి చూపించబోతున్నారు. ఇవన్నీ సాకారమైతే ప్రస్తుత విద్యావ్యవస్థ స్వరూపం కూడా పూర్తిగా మారిపోతుంది. టీచర్లు, తరగతి గదులు, ఇన్‌స్టిట్యూషన్స్‌ అనే మాటలకి కొత్త నిర్వచనం చెప్పుకోవలసి వస్తుంది. ఈ రంగంలో ఆన్‌లైన్‌ నైపుణ్యాలు ఎవరు పెంచుకుంటే వారికే అగ్రపీఠం అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఉపాధ్యాయవర్గాలు డిజిటల్‌ పాఠాలు నేర్చుకుంటున్నట్టు సమాచారం!


ఆరోగ్యరంగంలో పెనుమార్పులు షురూ అంటున్నారు సామాజికవేత్తలు. ఇకపై డిజిటల్‌ హెల్త్‌కేర్‌ బాగా విస్తరించబోతోంది. ఇప్పటికే పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు ఈ ప్రక్రియని అమలుచేస్తున్నాయి. విదేశాల్లో ఈ తరహా వైద్యవిధానం బాగానే ప్రాచుర్యం పొందింది. ఇక మీదట మన దేశంలోనూ ఇదే పద్ధతి వేళ్లూనుకుంటుందన్న మాట! పేషెంట్లకు వారి ఇళ్ల వద్దే నర్సింగ్‌ సేవలు లభించడం, మందులను డోర్‌ డెలివరీ చేయడం వంటివి కూడా మరింత అందుబాటులోకి వస్తాయి. ఈ మార్పు కూడా కొత్త ఉద్యోగాల కల్పనకి ఊతమిస్తుందని చెప్పక తప్పదు.


వచ్చే రోజుల్లో ఫుడ్‌ సెక్టార్‌లో కుకింగ్‌ అండ్‌ డెలివరీ అనే సర్వీసుకే అధిక ప్రాధాన్యం లభించే అవకాశముంది. దీనికి సంబంధించి అనేక కొత్తకొత్త యాప్‌లు పుట్టుకురావచ్చు. కస్టమర్‌ సేవలు మరింత సులభతరం కావచ్చు. మార్పు మంచిదే అని పాజిటివ్‌గా ఆలోచించేవారికి ఈ రంగంలోనూ అవకాశాలకి కొదవ ఉండదు. మార్పుని చూసి భయపడితే మాత్రం వెనుకబడటం ఖాయం! ఏ రంగంలో అయినా సరే- ఎదగాలంటే నైపుణ్యంతోపాటు నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. కష్టపడి పనిచేయడానికి మనసుని సంసిద్ధం చేసుకోవాలి. ఈ సూత్రాన్ని పాటించేవారు కొత్త ఉద్యోగంలో కుదురుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు!


పూర్వంలా ఇకముందు జిమ్‌లలో సందడి కనిపించకపోవచ్చు. కరోనా భయంతో చాలామంది జిమ్‌లకి బైబై చెప్పొచ్చనీ, ఈ ప్లేస్‌లో సరికొత్త వ్యాయామ పద్ధతులకి గిరాకీ పెరగొచ్చనీ కొందరు అంచనా వేస్తున్నారు. ఆ ప్లేస్‌ని సైక్లింగ్, ట్రెక్కింగ్, సర్ఫింగ్‌ వంటి ఆటలు భర్తీచేస్తాయని ఊహిస్తున్నారు! మనుషుల కదలికలపై నిఘాపెట్టే కొత్త టెక్నాలజీకి కూడా డిమాండ్‌ పెరుగుతుందన్న వాదనలున్నాయి. ఉదాహరణకి ఫేస్‌ రికగ్నిషన్‌ వంటి సాంకేతికత అన్న మాట! ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఎవరైనా వ్యక్తి మనకి మూడు అడుగుల కంటే దగ్గరగా వస్తే మన జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ అలారం మోగించి మనల్ని అలర్ట్‌ చేస్తుందట. ఇలా ఆడియో- వీడియో రంగాలు సమీప భవిష్యత్తులో అనేక కొత్త అవకాశాల్ని మన ముందుకి తేబోతున్నాయి. యువభారతం ఈ నవపథంలో పయనించడానికి సంసిద్ధం కావాలంతే!


పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు, సినిమా ఫంక్షన్లు, పొలిటికల్ గేదరింగ్స్‌ వంటివి కూడా ఇకపై కొత్త తరహాలో జరుగుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏ కార్యక్రమంలో అయినా సోషల్‌ డిస్టెన్సింగ్‌కి పెద్దపీట వేసేలా డిజైన్‌ చేస్తారన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఈవెంట్‌ మేనేజర్స్‌కి గిరాకీ పెరగబోతున్నది. కొత్త ఆలోచన- చురుకుదనం, పేజ్‌ త్రీ పీపుల్‌ మెంటాలిటీకి తగ్గట్టుగా నడుచుకునే తెలివితేటలు ఉంటే చాలు- ఈ రంగంలోనూ ఒక వెలుగు వెలిగిపోవచ్చు. 


ఏతావాతా చెప్పొచ్చేదేమంటే- స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యాక్టివిటీస్‌పై దృష్టిపెట్టండి. మీమీ నైపుణ్యాలను పెంచుకోండి. రేపటి ప్రపంచంలో మీ చోటుని ముందే పదిలం చేసుకోండి. ఈ దిశగా తోడ్పడే మార్గదర్శకులు ఎందరో ఉన్నారు. శిక్షణ ఇచ్చే అనేక సంస్థలు కూడా ఉన్నాయి. మనసుంటే మార్గముంటుంది. 


కరోనా వల్ల ఎవరైనా ఉద్యోగాన్ని కోల్పోతే అధైర్య పడనవసరం లేదు. కొద్దికాలంలోనే మరొక అవకాశం మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే అందుకోసం కొంచెం ఓపిక పట్టాలి. అవసరమైన నాలెడ్జ్‌ని పెంచుకోవాలి- అంతే! అలా చేస్తే మీకు మళ్లీ కొత్త కొలువు గ్యారంటీ! నో డౌట్‌!!

-ఏబీఎన్ ఫీచర్స్ డెస్క్

Updated Date - 2020-05-28T18:38:50+05:30 IST