లైఫ్ ఆఫ్టర్ కరోనా: నేతన్నలు, నేతమ్మలకి ఇప్పుడో మరో కష్టం

ABN , First Publish Date - 2020-05-27T21:32:31+05:30 IST

చేనేత మగ్గంపై ఎన్నో బతుకులు ఆధారపడి ఉన్నాయి. మగ్గంపై పనిచేస్తేనే వారికింత ఉపాధి. లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే

లైఫ్ ఆఫ్టర్ కరోనా: నేతన్నలు, నేతమ్మలకి ఇప్పుడో మరో కష్టం

చేనేత మగ్గంపై ఎన్నో బతుకులు ఆధారపడి ఉన్నాయి. మగ్గంపై పనిచేస్తేనే వారికింత ఉపాధి. లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అలాంటి మగ్గాల పరిశ్రమపై కూడా కక్షకట్టింది కరోనా వైరస్‌. లాక్‌డౌన్‌ సమయంలో చేనేత రంగం నిలువునా చితికిపోయింది. 


చేనేత మగ్గాలపై వీవర్లు కుస్తీపడితే తయారయ్యే వస్త్రాల సొగసు వర్ణనాతీతం. నేర్పరితనానికి అదొక నిదర్శనం. చేనేత వెరయిటీలలో దేశీయ మార్క్‌ సుస్పష్టం. చేనేత మగ్గాలపై సాధారణంగా చీరలు, దుప్పట్లు, తువ్వాళ్లు, జంపఖానాలు, ఇతర ఫ్యాబ్రిక్‌ వెరయిటీలు తయారవుతుంటాయి. మిల్లుబట్టల మార్కెట్‌ ముందు చేనేత వస్త్రాలు చిన్నబోతున్నా.. తమ వన్నెని మాత్రం కాపాడుకుంటూనే ఉన్నాయి. అలాంటి చేనేతకే ఇప్పుడు చిక్కొచ్చి పడింది. లాక్‌డౌన్‌ తర్వాత మగ్గాల కదలికే నిలిచిపోయింది. వీవర్ల కడుపు మాడుతోంది. 


ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా హేండ్‌లూమ్స్‌పై ఆధారపడి 45 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఫోర్త్‌ హేండ్‌లూమ్‌ సెన్సెస్‌ ప్రకారం ఏపీలో 1,22,644 కుటుంబాలు, తెలంగాణలో 27,916 కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. నిజానికి ఈ లెక్కలు అసమగ్రం అని కొందరు విశ్లేషకుల వాదన. వారు చెప్తున్న లెక్కల ప్రకారం ఏపీలో ప్రస్తుతం రెండున్నర లక్షల కుటుంబాలు, తెలంగాణలో లక్ష కుటుంబాలు చేనేతపై బతుకునేత సాగిస్తున్నాయి. ఏపీలో వెంకటగిరి, ధర్మవరం, చీరాల, పొందూరు, ఉప్పాడ వంటి చేనేత ఉత్పత్తులకీ, చీరలకీ మంచి పాపులారిటీ ఉంది. తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్‌ పట్టుచీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల, నారాయణపేట, కొత్తకోట చీరలు, కరీంనగర్‌ కాటన్‌ చీరలు, వరంగల్‌ దర్రీలకి గిరాకీ ఎక్కువ. సిరిసిల్ల పేరు కూడా వినిపిస్తున్నా అక్కడ అధిక ఉత్పత్తులు పవర్‌లూమ్స్‌పైనే జరుగుతాయి. 


చేనేత వస్త్రాలకి పాపులారిటీ బాగున్నా.. వీవర్ల బతుకుల్లో మాత్రం చేవ కనిపించదు. ఈ రంగంలో కష్టం ఎక్కువ- ఫలితం తక్కువ. అందువల్ల నేతన్నలు, నేతమ్మల జీవిత కతల్లో కష్టాల కడగండ్లే అధికం. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి పరిణామాలతో చేనేత పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. అయితే తర్వాత కాలంలో హేండ్‌లూమ్స్‌కి మార్కెట్‌ పెరగడంతో మెల్లగా పరిశ్రమ నిలదొక్కుకుంది. ఈ సమయంలోనే కరోనా పడగ విప్పింది. చైనా నుంచి మన దేశానికి జరిగే సిల్క్‌ నూలు దిగుమతికి జనవరిలోనే బ్రేక్‌ పడింది. దిగుమతి తగ్గడంతో.. సహజంగానే సిల్క్‌నూలు ధర పెరిగింది. లాక్‌డౌన్‌ వల్ల దేశీయంగా లభించే పత్తినూలు రవాణాకి కూడా అడ్డంకి  ఏర్పడింది. ఫలితంగా చేనేత మగ్గాలు చప్పుడు చేయడం మానుకున్నాయి.


నిజానికి చేనేత వస్త్ర వ్యాపారానికి మార్చి నెల మంచి సీజన్‌. అప్పటినుంచి జూన్‌ వరకు పెళ్లిళ్లు బాగా జరుగుతాయి కనుక చేనేత చీరలకి బాగా డిమాండ్‌ ఉంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడి పనులు అక్కడ, ఎక్కడి సరుకు అక్కడ నిలిచిపోయాయి. ఒకపక్క పనీ ఆగిపోయి.. మరోపక్క ఉత్పత్తులను మార్కెట్‌ చేయలేక వీవర్స్‌తోపాటు వ్యాపారులు కూడా డీలాపడ్డారు. ఈ సెక్టార్‌లో క్యాష్‌ఫ్లో ఆగిపోయింది. పనిలేని వీవర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. రాబడి లేకపోగా ఖర్చులు మాత్రం పెరిగాయి. అత్యధికులకి ఆహారదినుసులు కొనుక్కునే స్థోమత కూడా లేదు! దీంతో కనపడని ఆకలి చేనేత కుటుంబాలను కాల్చుకు తిన్నది. ఇళ్లలో కలోగంజో కాచుకుంటే దాన్ని మగవాళ్లకి, పిల్లలకి పెట్టి ఆడవాళ్లు పస్తులు పడుకునే పరిస్థితి!


చేనేత వృత్తిలో ఉండేవారు బీసీ సామాజికవర్గంలోకి వస్తారు. అందువల్ల వీరికి ప్రభుత్వాల నుంచి పెద్దగా ఏ రాయితీలు అందవు. చేనేతకి ఒక డిపార్ట్‌మెంట్‌ ఉంది కనుక అదే చూసుకుంటుందిలే అని పాలకులు భావిస్తారు. అయితే ఆ డిపార్ట్‌మెంట్ ఇచ్చే ఐడెంటిటీ కార్డులు కొందరికే అందుతాయి. అవి లేనివారి పరిస్థితి మరింత దుర్భరం. సాధారణ సమయంలోనే ఇంత కష్టం ఉంటే.. ప్రస్తుత కరోనా కాలంలో వీరి గోడు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు!


హేండ్‌లూమ్స్‌పై ఆధారపడేవారిలో కొందరు బాగా బీదరికంలో ఉంటారు. వీరిని షెడ్‌ వీవర్లు అంటారు. షెడ్‌లో మగ్గాలు పెట్టి బిజినెస్‌ చేసే ఓనర్లు వీరికి పని ఇస్తారు. రోజుకింత కూలీ ఇస్తారు. ఇలాంటి వీవర్లకి ఇళ్లు-వాకిళ్లు ఉండవు. యజమాని పని ఇచ్చిన షెడ్‌లోనే నివాసముంటారు. ఒంటరి మహిళలు కూడా చేనేత పని చేస్తుంటారు. వీరికొచ్చే ఆదాయం అతి స్వల్పం. లాక్‌డౌన్‌ వల్ల షెడ్‌ ఓనర్లు కూడా చితికిపోయారు. మిగతావారికి పని ఎలా కల్పిస్తారు? అందువల్ల షెడ్‌ వీవర్ల కుటుంబాలు నేడు పస్తులతో కాలక్షేపం చేస్తున్నాయి. కాటన్‌ వీవర్లతో పోలిస్తే.. సిల్క్‌ వీవర్ల పరిస్థితి మాత్రమే కాసింత మెరుగ్గా ఉంది.


మాస్టర్‌ వీవర్ల దగ్గర పనిచేసే వారికంటే సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వీవర్స్‌కి లాక్‌డౌన్‌ సమయంలో కొంత పని దొరికింది. ఉదాహరణకి.. ఏపీలోని గుంటూరు తదితర ప్రాంతాల్లోని చేనేత సహకార సంఘాలకి ఆర్డర్లు వచ్చాయి. ప్రధానంగా వీరు ఫ్యాబ్రిక్‌ వర్క్‌ చేస్తుంటారు. ఆదాయపరంగా చూస్తే మార్జిన్‌ తక్కువ ఉంటుంది. అదే కృష్ణాజిల్లా విషయానికి వస్తే అక్కడ మాస్టర్‌ వీవర్లు ఎక్కవ. వీరి బిజినెస్‌ అంతా చీరలపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌ బంద్‌ అయ్యాక ఈ మగ్గాలు చప్పుడు చేస్తే ఒట్టు!


నేత కుటుంబాలకి అప్పులు ఎక్కువ ఉంటాయి. పని ఉంటే పైసలు వస్తాయి కనుక.. ఎలాగోలా నెట్టుకొస్తుంటారు. కరోనా విపత్తుతో ఇప్పుడు పనే లేకుండాపోయింది. ఇక ఆ అప్పులు- వడ్డీలు తీర్చేదెలా? ఈ పరిణామమే నేతన్నలను తీవ్ర నిరాశలోకి నెట్టేస్తోంది. దీంతో కొందరు ఉసురు తీసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం తన బడ్జెట్‌లో చేనేత రంగానికి 384 కోట్లు కేటాయించింది. అయితే ఇందులో అధికశాతం నూలు సబ్సిడీకే పోతుంది. వీవర్లకి ఒరిగేది ఏమీ ఉండదు. ఇదివరకు చేనేత కుటుంబాలకు బీమా సౌకర్యం ఉండేది. మోదీ ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీవర్లకి ప్రస్తుతం కేంద్ర- రాష్ట్రప్రభుత్వాల నుంచి ఎలాంటి రక్షణ పథకాలు లేవు. 


ఉమ్మడి ఏపీలో చేనేత వస్త్రాల అమ్మకాలు బాగానే జరిగేవి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు హ్యాండ్‌లూమ్స్‌ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఆప్కోలో, టెప్కోలో బాగా స్టాక్స్‌ ఉన్నాయి. వీటిని ఎలా మార్కెట్‌ చేయాలి అన్నదానిపై యాక్షన్‌ ప్లాన్‌ కనిపించడం లేదు. కరోనా వ్యాప్తి తర్వాత ఆసుపత్రుల్లో అవసరాలకి చేనేత బట్టని వాడమని ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తులు వెళ్లాయి. కానీ ప్రతిస్పందన శూన్యం. 


ఏపీలో నేతన్నలు, నేతమ్మలకి ఇప్పుడో మరో కష్టం వచ్చిపడింది. రాష్ట్రంలో జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్కో మగ్గానికి ఏటా 24 వేల రూపాయలు చొప్పున వీవర్‌ అకౌంట్‌లో వేసే పథకానికి శ్రీకారం చుట్టారు. నిజానికి కడపలో చేనేత మగ్గాలు తక్కువ. పవర్‌లూమ్స్‌ ఎక్కువ. అయినా ఆ జిల్లాకే ఈ పథకం ద్వారా ఎక్కువ కేటాయింపులు జరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. అయితే మిగతా వీవర్స్‌కి కూడా ఎంతోకొంత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఎవరూ పెద్దగా నోరెత్తలేదు. ఆ పథకం జగన్‌ ప్రారంభించడానికి ముందు ఏపీలో సర్వే చేయించారు. మగ్గాల సంఖ్యను నమోదు చేశారు. కొవిడ్‌ తర్వాత జగన్‌ బుర్రలోకి ఏ పురుగు దూరిందో తెలియదు కానీ.. ఇప్పుడు మళ్లీ మగ్గాల రిజిస్ట్రేషన్‌ మొదలుపెట్టారు. తాజా సర్వే జరిగే సమయంలో మగ్గంపై నేతపని జరుగుతుండాలనేది ప్రధాన షరతు! అసలే ఇది కరోనా కాలం. నూలు దొరికే పరిస్థితి లేదు. ఈ సమయంలో మగ్గంపై పనిచేయడం ఎలా సాధ్యం? ఏతావాతా చెప్పొచ్చేదేమంటే.. మగ్గాల జాబితా నుంచి చాలామంది వీవర్ల పేర్లను తొలగించాలన్న ఉద్దేశంతోనే జగన్‌ ప్రభుత్వం కొత్త సర్వే చేయిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


ఈ మధ్య దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ "చేనేతను ధరించమని ఉద్బోధించారు. ఆయన మాటల్లో ఖాదీ, గ్రామీణ ఉపాధి, సెల్ఫ్‌ రిలయన్స్‌ అన్న పదాలు పదేపదే వినిపించాయి. దీంతో భారత ప్రభుత్వం ప్రకటించబోయే ప్యాకేజీలో తమకేదో మేలు జరిగిపోతుందని వీవర్లు బాగా ఆశపెట్టుకున్నారు. తీరా.. ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీలో చేనేత అన్న ప్రస్తావనే రాలేదు. దీంతో వారు మరింత నీరసపడ్డారు. ప్రస్తుత సందర్భంలో చేనేత రంగానికి ఒకేఒక్క ఆశాకిరణం ఏమిటంటే.. లాక్‌డౌన్‌ వల్ల అంతర్జాతీయ వస్త్రవ్యాపారం అస్తవ్యస్తమైంది. దీంతో ఆధునిక జౌళి పరిశ్రమ అంటే చేనేతయేతర ఉత్పత్తులకి గిరాకీ తగ్గి చేనేత వస్త్రాలకి డిమాండ్‌ పెరిగే అవకాశముంది. అదే జరిగితే వీరు కొంతైనా ఊపిరి పీల్చుకోగలుగుతారు. 


లాక్‌డౌన్‌ నష్టాల నుంచి బయటపడటానికి జౌళి పరిశ్రమ వర్గాలు లక్షకోట్ల ప్యాకేజీ ఇమ్మని కోరుతున్నట్టుగా వార్తలొచ్చాయి. ఆ సెక్టార్‌తో పోలిస్తే.. చేనేతను ఆదుకోవడం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఎంతో తేలిక అని హ్యాండ్‌లూమ్స్‌ శ్రేయోభిలాషులు చెబుతున్నారు. "కేవలం అయిదు వేలకోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ఇస్తే చాలు. ఈ రంగానికి చెందిన కోటి కుటుంబాలకు సత్వరం మేలు చేకూరుతుంది. అతి త్వరలోనే ఈ రంగం కోలుకుంటుంది'' అని వారు విశ్లేషిస్తున్నారు. 


చేనేత సహకార సంఘాలకి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఆ రుణాలపై 12.8 శాతం వడ్డీ ఉంటుంది. ఏటా ఈ వడ్డీ సకాలంలో చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం 3 శాతం రిటర్న్‌ ఇస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సమయంలో కరోనా విపత్తు తలెత్తిన సంగతి తెలిసిందే. అందువల్ల బకాయిల చెల్లింపునకు జూన్‌ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే ఆరు నెలలపాటు వడ్డీని మాఫీ చేయాలని చేనేతరంగ ప్రముఖులు కోరుతున్నారు. ప్రభుత్వాలకి ఇదేమంత భారం కూడా కాదు. 


కరోనా తర్వాత గల్ఫ్‌, సూరత్‌, ముంబై వంటి ప్రాంతాల నుంచి తెలుగువారు భారీ సంఖ్యలో తిరిగి వస్తున్నారు. సూరత్‌, ముంబైల నుంచి వచ్చేవారిలో అత్యధికులు చేనేత రంగానికి చెందినవారే. అందువల్ల వచ్చే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తాండవిస్తుంది. వీరందరికీ పని కల్పించడం స్థానిక ప్రభుత్వాల తక్షణ బాధ్యత! ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయిదు వందల కోట్లు, ఏపీ ప్రభుత్వం వెయ్యికోట్లను కేటాయిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా చేనేత రంగం త్వరగా కోలుకుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే గ్రామీణ ఉపాధిరంగమూ గాడిన పడుతుందన్న మాట వాస్తవం! నిజానికి పనిలేక కటకటలాడేవారికి అన్నం పెట్టడం కంటే పని చూపించడమే ఉత్తమ మార్గం! అలా చేస్తే వారు ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. చేనేతపై ఆధారపడ్డవారు ఇదే కోరుకుంటున్నారు. 


తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈ మధ్య కేంద్రప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. చేనేతరంగంపై విధించిన జీఎస్‌టీకి మూడేళ్ల పాటు మారటోరియం విధించాలని కోరారు. ఈ రంగాన్ని ఉద్ధరించాలన్న సదుద్దేశం కేంద్ర పెద్దలకి ఉంటే నిజంగానే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే.. సమీప రోజుల్లో అనేక చేనేత సంఘాలు మూతపడే ప్రమాదం ఉంది. 

Updated Date - 2020-05-27T21:32:31+05:30 IST