Abn logo
May 16 2020 @ 13:41PM

లైఫ్ ఆఫ్టర్ కరోనా: కష్టాల్లో సిమెంట్ పరిశ్రమ.. రేపటి రోజెలా?

Kaakateeya

సిమెంట్‌ అనేది దేశ నిర్మాణరంగంలో కీలక మూలకం. అది లేకపోతే ఏ పునాదికైనా అంత గట్టిదనం ఎలా వస్తుంది చెప్పండి? ఇనుము, ఇసుక, కంకర, ఇటుకలు వంటి సరంజామా ఎంత ఉన్నా వాటికి సిమెంట్‌ జత కలపకపోతే కాంక్రీటు పిల్లర్లు, గోడలు, శ్లాబులు, ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణం సాధ్యమే కాదు. అలాంటి సిమెంట్‌ పరిశ్రమే ఇప్పుడు చిక్కుల్లో పడింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆ ఇండస్ట్రీస్‌కి గట్టి దెబ్బే తగిలింది. 


సిమెంట్‌ అనేది దేశ నిర్మాణ రంగానికి బేస్‌మెంట్‌ వంటిది. పెరటి గోడ నుంచి బహుళ అంతస్తుల బిల్డింగ్‌ వరకూ.. ఫ్యాక్టరీలు మొదలు భారీ ప్రాజెక్టుల వరకూ ఏది నిర్మించాలన్నా సిమెంట్‌ ఉండాల్సిందే. ఆధునిక కట్టడాల అణువణువునా సిమెంట్‌ తాపడమే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పునాది రాళ్లకి పట్టు ఇచ్చేది.. పిల్లర్లలో సత్తువ నింపేది.. ఇటుక ఇటుకనీ గోడల్లో కలిపి కుట్టేదీ.. కాంక్రీట్‌ శ్లాబులకి బలవర్ధకమైన టానిక్‌లా పనిచేసేదీ సిమెంటే..! అలాంటి కీలక మూలకానికే ఇప్పుడు కరోనా షాక్‌ తగిలింది. 


ప్రపంచ సిమెంట్‌ ఉత్పత్తిలో భారతదేశానిది రెండో స్థానం. దేశవ్యాప్తంగా జరుగుతున్న సిమెంట్‌ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలది అగ్రపీఠం. ఇక్కడ సున్నపురాయి గనులు, బొగ్గు అధికంగా ఉండటం ఈ పరిశ్రమలకు కలిసొచ్చిన ముఖ్యాంశం! దేశంలోని 20 వరకూ భారీ సిమెంట్‌ పరిశ్రమలున్నాయి. మొత్తం ఉత్పత్తిలో 70 శాతం వాటా ఆ కంపెనీలదే! ఈ తరహా భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, రాజస్థాన్‌లలో కొలువుదీరాయి. 


అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగంలో భారత్‌ సాధిస్తున్న వృద్ధిరేటు సిమెంట్‌ డిమాండ్‌ని అనూహ్యంగా పెంచుతోంది. అందువల్ల ఏ యేటికి ఆ యేడు ఉత్పత్తి లక్ష్యం పెరుగుతూ వస్తోంది. సుమారు పది లక్షలమంది ఈ పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. సిమెంట్‌తో ముడిపడి ఉన్న కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో అయితే కోట్లాదిమంది ఉపాధి పొందుతున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని సిమెంట్ కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 9.8 కోట్ల టన్నులు. అయితే మార్కెట్‌లో అంత డిమాండ్‌ లేదు. అందువల్ల స్థానిక పరిశ్రమలు 50 నుంచి 65 శాతం మేరకే సిమెంట్‌ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో 2.8 కోట్ల టన్నుల సిమెంట్‌ని తెలుగు రాష్ట్రాల్లోనే వినియోగిస్తున్నారు. మిగతా 2.8 కోట్ల టన్నుల సిమెంట్‌ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. 


మార్కెట్‌కి సరఫరా అయ్యే సిమెంట్‌లో 65 శాతాన్ని రియల్‌ఎస్టేట్‌ రంగం ఉపయోగించుకుంటోంది. ప్రైవేట్‌ కంపెనీలు, సంస్థలు తమ అవసరాలకి 15 శాతం సిమెంట్‌ వినియోగిస్తున్నాయి. మిగతా 20 శాతం పబ్లిక్‌రంగ అవసరాలు.. అంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపట్టే వివిధ ప్రాజెక్టులు, కట్టడాలు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకి ఉపయోగిస్తున్నారు. సాధారణంగా వర్షాకాలం తర్వాతే నిర్మాణరంగం పుంజుకుంటుంది. నవంబర్‌, జనవరి మధ్యకాలంలో పనులు వేగం అందుకుంటాయి. ఈ సమయంలో గిరాకీతోపాటు ధరలు కూడా పెరుగుతాయని సిమెంట్‌ వ్యాపారులు కొంత ఆశపడతారు. కానీ కరోనా కారణంగా ఈసారి సీన్‌ పూర్తిగా నిరాశాజనకంగా మారింది. 


లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక సిమెంట్ ఇండస్ట్రీకి కూడా దాదాపుగా లాక్‌ పడింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కంపెనీలూ తాత్కాలికంగా ప్రొడక్షన్‌ మొత్తం నిలిపివేశాయి. రవాణా వ్యవస్థ సైతం స్తంభించింది. వివిధ ప్రాంతాలకు సరఫరా కావాల్సిన కోట్లాది రూపాయల సిమెంట్‌ ట్రక్కుల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ పరిణామంతో అటు సిమెంట్ కంపెనీల యజమానులు, ఇటు సిమెంట్‌ డీలర్లు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. తమ ఆదాయాలతోపాటు లాభాలపైనా ఈ ప్రభావం పడిందని వారు చెబుతున్నారు. ఉదాహరణకి తెలంగాణ విషయానికే వస్తే స్థానిక కంపెనీలు నెలకు సుమారు 30 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసేవి. అంటే రోజుకి ఒక మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి అన్న మాట! 


సిమెంట్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆయా కంపెనీల్లో పనిచేసే పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఉపాధి కరువైంది. ప్రొడక్షన్‌కి నిలిచిపోయి.. ఆర్డర్లు కూడా లేకపోవడంతో అనేక కంపెనీలు సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ సెక్టార్‌కి అనుబంధంగా ఉండే ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, హమాలీలతోపాటు సిమెంట్‌ డీలర్లు కూడా ఆర్థిక ఒడిదుడుకులకు లోనయ్యారు. అయితే మార్కెట్‌లో సిమెంట్‌ లభ్యత తగ్గగానే కొందరు డీలర్లు తమ గోదాముల్లో నిల్వ ఉన్న సిమెంట్‌ని అధిక ధరకు అమ్మినట్టుగా వార్తలొచ్చాయి. ఒక్కో బస్తాపై 70 రూపాయల వరకూ ధర పెంచారన్నది లోకల్‌ టాక్‌! ఇందులో కొంత వాస్తవం ఉన్నా.. వారిలోనూ ఒకరకమైన గుబులు మొదలైంది. లాక్‌డౌన్‌కు ముందు డీలర్లు దిగుమతి చేసుకున్న సిమెంట్‌ చాలావరకూ గోదాముల్లోనే ఉండిపోయింది. సిమెంట్‌ ఎక్కువకాలం అలాగే ఉండిపోతే గడ్డకట్టే ప్రమాదముంది. అందువల్ల వెంటనే సరుకు కదలాలని వారంతా బలంగా కోరుకుంటున్నారు. 


లాక్‌డౌన్‌ సమయంలో ఎమర్జెన్సీ రిక్వైర్‌మెంట్‌ కింద కొన్ని ప్రాజెక్టులకు సిమెంట్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల పనులు ఈ కోవలోకి వస్తాయి. ఆయా సైట్లకు సిమెంట్‌ సరఫరా చేసేందుకు కొన్ని ట్రక్కులకు పర్మిషన్‌ ఇచ్చారు. అందువల్ల ఏప్రిల్‌ నెలలో కొంత మేర సిమెంట్‌ సప్లయి కొనసాగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ నుంచి సిమెంట్‌ కంపెనీలకు బాగానే ఆర్డర్లు ఉన్నాయి. అయితే ట్రక్‌ డ్రైవర్ల కొరత వల్ల రవాణాకి అంతరాయం కలుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ వాతావరణం చూస్తుంటే ఇప్పట్లో పూర్వపు పరిస్థితులు నెలకొనకపోవచ్చునని సిమెంట్‌ కంపెనీల యజమానులు భావిస్తున్నారు. గత పదేళ్ల నుంచి సిమెంట్‌ పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యంలో సుమారు 60 శాతం వరకే ఉపయోగించుకుంటున్నాం. ఇకపై 30 నుంచి 35 శాతమే మార్కెట్‌లో డిమాండ్‌ ఉండొచ్చనని వారు అభిప్రాయపడుతున్నారు. 


ఈ ఏడాది వర్షాకాలం తర్వాత నిర్మాణ పనులు పుంజుకునే అవకాశం ఉన్నా.. పూర్తిస్థాయిలో కార్మికులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే లాక్‌డౌన్‌ విధించిన తొలి రోజుల్లోనే దేశవ్యాప్తంగా మైగ్రెంట్‌ లేబర్‌ భారీగా తిరుగు వలస పోయారు. అడ్డాకూలీలు, మేస్త్రీలు అయితే లక్షల సంఖ్యలో తమ స్వస్థలాలకు తరలిపోయారు. అందువల్ల ఇప్పుడే కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ సెక్టార్‌ కోలుకుంటేనే సిమెంట్‌కి గిరాకీ ఏర్పడుతుంది. మైగ్రెంట్‌ లేబర్‌ తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఇటీవల కేంద్రప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసింది. ఇప్పుడు కూడా సంబంధిత కార్యాలయాల వద్ద మైగ్రెంట్‌ లేబర్‌ తండోపతండాలుగా గుమ్మిగూడిన దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. అంటే ఆ స్థాయిలో ప్రజల్లో ఒకరకమైన భయం ఏర్పడిందన్న మాట! ఊళ్లకి వెళ్లిన వారు మాన్‌సూన్‌ తర్వాత నూరుశాతం తిరిగివచ్చి పనుల్లో చేరతారా అన్నది సందేహమే అంటున్నారు పరిశ్రమ పెద్దలు. ఇవన్నీ కూడా సిమెంట్‌ పరిశ్రమలకి కొంత ప్రతికూలమే అని చెప్పక తప్పుదు. 


లాక్‌డౌన్‌ నుంచి సిమెంట్ పరిశ్రమలు, రోడ్డు నిర్మాణ పనులు సహా అనేక రంగాలకు కేంద్రప్రభుత్వం తాజాగా సడలింపులు ఇచ్చింది. అయితే ఈ వెసులుబాటు సిమెంట్‌ కంపెనీలకి పెద్దగా కలిసిరాకపోవచ్చునన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీనికి కూడా కారణం వర్కర్స్‌ సమస్యే! సిమెంట్‌ కంపెనీల్లో సాధారణంగా యాభై శాతం మంది పర్మినెంట్‌ వర్కర్స్‌ ఉంటే, మిగతా యాభై శాతం కాంట్రాక్ట్‌ సిబ్బంది ఉంటారు. ప్యాకింగ్‌ ప్లాంట్‌ సహా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వంటి పనుల్లో సాధారణంగా ప్రైవేట్‌ కార్మికులే ఎక్కువ కనిపిస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా సిమెంట్‌ పరిశ్రమల్లో పనిచేసే చాలామంది కార్మికులు మూటాముల్లె సర్దుకుని ఊర్లకు వెళ్లిపోయారు. ఆయా ప్లాంట్ల వద్ద ప్రస్తుతం మ్యాన్‌పవర్‌ బాగా కొరవడింది. ఈ పరిణామం సిమెంట్‌ ఉత్పత్తిపై  ప్రభావం చూపుతుందని ఆయా కంపెనీల పెద్దలు స్పష్టంగా చెబుతున్నారు. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌ డిమాండ్‌ 25 నుంచి 40 శాతంపైగా  తగ్గిపోవచ్చునని కొన్ని రేటింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రియాల్టీ సెక్టార్‌ గాడిలో పడితే తప్ప ఈ పరిస్థితి మెరుగుపడదు. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత నెలరోజుల వరకు వర్కర్స్‌ సమస్య, రవాణా అంతరాయాలు వంటి ఒడిదుడుకులు కొనసాగుతాయని అంటున్నారు. గృహనిర్మాణ రంగానికి పట్టిన గ్రహణం కూడా వెంటనే వీడకపోచ్చునని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల రంగంలో ప్రాజెక్టులు కూడా వెంటనే మొదలుకాకపోవచ్చునన్న మాట వినిపిస్తోంది. 


పరిశ్రమలకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. నరేంద్రమోదీ రెండో దఫా అధికారం చేపట్టాక స్వచ్ఛభారత్ మిషన్‌, అమృత్‌, స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ వంటి పథకాలకి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. గృహనిర్మాణ రంగానికి సపోర్ట్‌గా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ హామీలు అమలులోకి వస్తే సహజంగానే మార్కెట్‌లో సిమెంట్‌కి డిమాండ్‌ పెరుగుతుంది. నిజానికి ఈ దిశగా అడుగులు పడుతున్న దశలోనే దేశంలోకి కరోనా ఎంటరై టెర్రర్‌ పుట్టించింది. మార్కెట్‌ సూచీలనే ఆ బూచీ తీవ్ర భయబ్రాంతులకి గురిచేసింది.


లాక్‌డౌన్‌ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇదే సమయంలో మార్కెట్‌లో స్టీలు, ఇటుకలు, ఇసుక ధరలకి రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి ఆలోచనలు చేయకపోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిర్మాణం రంగం పుంజుకునే అవకాశం లేదు. అందువల్ల కేంద్ర- రాష్ట్రప్రభుత్వాలు ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించడం అవసరం. పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వంతోపాటు ఆర్‌బీఐ కూడా కొన్ని ఉద్దీపనలు ప్రకటించాయి. అయితే అవి "పెద్ద గాయానికి చిన్న బ్యాండేజీ వంటివే'' అని సిమెంట్‌ కంపెనీల యజమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతమాత్రాన వారు ఎవరినీ పనిగట్టుకుని విమర్శించడం లేదు. ప్రస్తుతం కేంద్రంతోపాటు ఆర్‌బీఐ కూడా విపత్తు సమస్యని ఎదుర్కొంటున్నాయన్న అవగాహనతోనే మాట్లాడుతున్నారు. 


ఏదిఏమైనా ప్రస్తుత గండం నుంచి సిమెంట్‌ పరిశ్రమలు నిలదొక్కుకునేలా కేంద్రప్రభుత్వ పెద్దలు తొందరలోనే సానుకూల నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో నిర్మాణరంగానికి ఊతమందించాలి. పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్లలో భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు, ప్రజల మౌలిక అవసరాలు తీర్చే కట్టడాలు ఇతోధికంగా చేపట్టాలి. అలా చేసినప్పుడు కచ్చితంగా మార్కెట్‌లో క్యాష్‌ఫ్లో పెరుగుతుంది. పెట్టుబడులు వస్తాయి. కష్టజీవులకి చేతినిండా పని దొరుకుతుంది. పనిలో పనిగా సిమెంట్‌ పరిశ్రమల ఉత్పత్తులకి బాగా గిరాకీ ఏర్పడుతుంది. ఈ దిశగా మన పాలకులు అడుగులు వేస్తే మంచిది.


దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే సెక్టార్లలో సిమెంట్‌ పరిశ్రమ ఎంతో ముఖ్యమైనది. సిమెంట్‌తో ముడిపడిన నిర్మాణరంగం కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తోంది. అందువల్ల కరోనా తర్వాత సిమెంట్‌ పరిశ్రమల కష్టాలు తీర్చేందుకు పాలకులు నడుం కట్టాలి. లాక్‌డౌన్‌ సమయంలో సొంత ఊళ్లకు తరలిపోయిన కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తిరిగి పనులకు హాజరయ్యే పరిస్థితులు కల్పించాలి. అప్పుడే సిమెంట్‌ పరిశ్రమ కోలుకోగలుగుతుంది. 

Advertisement
Advertisement