మందులకు కటకట..!

ABN , First Publish Date - 2022-05-29T09:39:38+05:30 IST

తెలంగాణ సర్కారు వైద్యానికి, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెబుతున్నా..

మందులకు కటకట..!

  • సర్కారీ దవాఖానాల్లో సగం మందులు బయట కొనుక్కోవాల్సిందే!
  • చిన్న పిల్లల యాంటీబయాటిక్స్‌కూ కొరతే
  • కాల్షియం, విటమిన్‌-డి బిల్లుల జాడే ఉండదు
  • జనరిక్‌ పేర్లను సిఫారసు చేయని వైద్యులు
  • నిబంధనలకు విరుద్ధంగా బ్రాండ్‌ పేర్లు
  • ఆస్పత్రుల దగ్గర్లోని ప్రైవేటు ఫార్మసీల్లో కిటకిట
  • ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలన


ఎర్ర గోళి.. తెల్ల గోళి.. పచ్చగోళి.. ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో, ప్రాథమిక/పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో.. రోగులు ఏ సమస్యతో వెళ్లినా, డాక్టర్లు రాసిచ్చే మందులివి..! అందుకే.. అప్పట్లో ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అనే పరిస్థితులుండేవి..! ఇప్పటికీ సర్కారీ దవాఖానాల్లో ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదు.


హైదరాబాద్‌/న్యూస్‌ నెట్‌ వర్క్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సర్కారు వైద్యానికి, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెబుతున్నా.. జిల్లా కేంద్రాల్లో, ప్రధాన పట్టణాల్లో అన్ని వైద్యపరీక్షలు నిర్వహించేలా డయాగ్నస్టిక్స్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినా.. ఆస్పత్రులకు తగినంతగా మందులను సరఫరా చేయడం లేదు. దీంతో.. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు రాసిస్తున్న మందుల చీటీల్లో సగం మందులను రోగులు బయటే కొనుగోలు చేస్తున్నారు. ‘‘ఈ మందులను బయట కొనాలి’’ అంటూ డాక్టర్లు తేల్చిచెబుతున్నారు. ఈ దుస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో.. ఖ్యాతి గడించిన గాంధీ, ఉస్మానియా ధర్మాస్పత్రులు మొదలు.. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లోనూ మందులకు కొరత ఉన్నట్లు తేలింది. ఉచిత వైద్యం కోసం ఆస్పత్రికి వస్తున్న పేదలు.. తప్పనిసరి పరిస్థితుల్లో రూ.వందలు వెచ్చించి, ప్రైవేటు ఫార్మసీల్లో మందులు కొంటున్నారు. మరికొందరు పేదలు ఆస్పత్రిలో దొరికిన మందులను తీసుకుంటూ.. డబ్బు వెచ్చించలేక ప్రైవేటు ఫార్మసీలకు వెళ్లడం లేదు. ఫలితంగా వ్యాధులు మరింత ముదిరే ప్రమాదాలున్నాయి. 


నిజానికి సర్కారీ ఆస్పత్రులకు వచ్చే వారి ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి, వైద్యులకు తెలియంది కాదు. వారికి తగిన సమయంలో మందులు ఇవ్వకుంటే.. వారు కోర్సును పాటించకుంటే.. వ్యాధులు ఏ స్థాయిలో ముదురుతాయనే దానిపై వైద్యులకు స్పష్టమైన అవగాహన ఉంది. అయినా.. ఎమర్జెన్సీ ఔషధాల కొరతను తీర్చడంలో ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 500 కోట్లు.. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొనుగోళ్లకు సరిపోతాయా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే..! ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో చాలా ఆస్పత్రుల్లో సగం మందులే లభిస్తున్నట్లు తేలింది. అంటే.. డాక్టర్‌ ఆరు రకాల మందులు రాస్తే, దవాఖానాలో కేవలం మూడు రకాలే దొరుకుతున్నాయి. మిగతా మూడు రకాలను ప్రైవేటులో కొనాలంటూ వైద్యులు, ఫార్మసిస్టులు సూచిస్తుండడం గమనార్హం. వైద్యులు రాసే చీటీలో బాహాటంగా.. బ్లూపెన్‌, రెడ్‌పెన్‌తో మందులపై టిక్‌ చేస్తున్నారు. అంటే.. బ్లూటిక్‌ ఉన్న మందులు ఆస్పత్రుల్లో దొరుకుతాయని, రెడ్‌టిక్‌ మందులను బయట కొనాలని అర్థం.


యాంటీ బయోటిక్‌కూ కొరతే

ప్రభుత్వాస్పత్రుల్లో కొరత నెలకొంటున్న మందుల్లో చాలా వరకు ఖరీదైనవే ఉంటున్నాయి. వాటితోపాటు.. చాలా దవాఖానాల్లో విటమిన్‌ ట్యాబ్లెట్లు, మధుమేహం, బీపీ రోగులు వాడే ఔషధాలు, ఆస్తమా రోగుల మందులు, యాంటీబయోటిక్‌లు అందుబాటులో ఉండడం లేదు. పిల్లలకు సంబంధించిన సిర్‌పలు.. కాల్షియం, విటమిన్స్‌, విటమిన్‌-డి వంటి వాటిని కూడా బయటే కొనాలని వైద్యులు చెబుతున్నారు. అత్యంత కీలకమైన యాంటీబయోటిక్‌ మాత్రలు అమాక్సిలిన్‌-500 ఎంజీ, గైనిక్‌ విభాగంలో వాడే యాంటి డీ ఇంజక్షన్‌, సెఫోటాక్జిమ్‌, డైక్లోఫినాక్‌ పేయిన్‌ కిల్లర్‌  ఆయింట్‌మెంట్‌, మాక్సిఫ్లాక్సిన్‌ చుక్కలు మందులతో పాటు కొన్ని బీపీకి సంబందించిన మందులు మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో దొరకడం లేదు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మానసిక వ్యాధులకు సంబంధించిన ట్రైహెగ్జిఫెనిడైర్‌ అనే మందు అందుబాటులో లేదు. చిన్న పిల్లలకు సంబంధించిన ఒఫ్లాక్సిన్‌, కొన్ని రకాల యాంటీబయోటిక్స్‌కు కూడా ఇక్కడ కొరత ఉంది. తలతిరగడం వంటి రుగ్మతలను ఎదుర్కొనేవారికి ఇచ్చే బెటాహిస్టిన్‌ టాబ్లెట్లు, కంటిలో వేసుకొనే మోక్సిస్లాక్సియన్‌ కూడా అందుబాటులో లేవు. జిల్లా ఆస్పత్రుల్లోనే కాదు.. హైదరాబాద్‌లో పేరొందిన ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి, కోటి, నయాపూల్‌(పేట్లబుర్జు) ప్రసూతి ఆస్పత్రులు, నిలోఫర్‌ చిన్నపిల్లల ఆస్పత్రి.. ఇలా కీలక దవాఖానాల్లోనూ మందుల కొరత తీవ్రంగా ఉంది.


అంతటా అదే పరిస్థితి!

ఉస్మానియా ఆస్పత్రికి చికిత్సకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని కడప వాసి స్వామి దాస్‌కు.. ఫార్మసీలో మందుల్లేవని బయటకు పంపారు. కాలికి గాయమవ్వడంతో చికిత్స చేయించుకుంటున్న స్వామిదాస్‌.. అదే స్థితిలో ప్రైవేటు ఫార్మసీ వరకు వెళ్లి మందులను కొనాల్సి వచ్చింది.


ఎదుగుదల సరిగా లేదని ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన ఓ బాలిక(17)కు పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎనిమిది రకాల మందులను రాశారు. టి-పాన్‌ వూడ్‌, టి-జోఫి యూని్‌స-బిడి, టి-ఎంవీటీ, టి-టోనియ్‌ 200-బిడి, టి-మెహోజిల్‌ 400, సకసిల్‌ 10ఎంఎల్‌ సిరప్‌, టి-ఎ్‌ఫఈ షార్ట్‌కట్‌ పేర్లతో రాసి ఇచ్చారు. ఉస్మానియా ఫార్మసీలో లభించకపోవడంతో ప్రైవేట్‌లో కొనుగోలు చేసినట్లు ఆ బాలిక సహాయకులు తెలిపారు.


మహబూబ్‌నగర్‌కు చెందిన భారతమ్మ ఆస్తమాతో బాధపడుతోంది. ఆమెకు గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆరు రకాల మందులు రాశారు. .ఆస్పత్రి ఫార్మసీలో మూడు రకాలు దొరికాయి, ఆస్తమా స్ర్పే(ఇన్‌హీలర్‌), నాజల్‌ స్ర్పే, సిట్రిజెన్‌ను బయటే కొనాల్సి వచ్చింది.


మల్కాజిగిరికి చెందిన ఓ తొమ్మిదేళ్ల చిన్నారి చేయి విరిగితే.. గాంధీ ఆస్పత్రిలో కట్టుకట్టి.. ఐదు రకాల మందులు రాశారు. వాటిల్లో ఒకటి మాత్రమే ఫార్మసీలో దొరికింది.


యాదాద్రి పరిధిలోని రాజపేటకు చెందిన లక్ష్మీనర్సమ్మ అనే మహిళకు మధుమేహంతో గాంధీ ఆస్పత్రి రాగా.. వైద్యులు ఆమెకు నాలుగు రకాల మందులు రాశారు. గాంధీలో లేకపోవడంతో అన్నింటినీ బయటే కొనాల్సి వచ్చింది.


గజ్వేల్‌ పరిధిలోని ముస్తాబాద్‌కు చెందిన పరశురాం కడుపు నొప్పితో గాంధీ ఆస్పత్రికి వస్తే.. ఆరు రకాల మందులు రాశారు. మూడు గాంధీ ఫార్మసీలో లభించగా.. మిగతావి బయటే కొన్నారు.


నర్సాపూర్‌ నివాసి మమతకు అనారోగ్యం కారణంగా గాంధీ వైద్యులు ఐదు రకాల మందులు రాశారు. అందులో టాక్సిమ్‌ ఇంజెక్షన్‌ను బయట కొనాలని చెప్పారు. పారాసిటమోల్‌, బి-కాంప్లెక్స్‌, గ్యాస్‌ట్రబుల్‌ టాబ్లెట్లు మాత్రమే చేతికి ఇచ్చారు. ఖరీదైన రెండు రకాలు కెమిరాల్‌ ఫోర్ట్‌, లైనోజోలైడ్‌ 600 ఎంజీ మందులను బయటే కొనాల్సి వచ్చింది.


ఉప్పల్‌కు చెందిన మల్లయ్యకు కీళ్ల నొప్పులు, కీళ్ల వాతానికి చికిత్స కోసం గాంధీకి వచ్చారు. వైద్యులు ఇతనికి 9 రకాల మందులు రాశారు. అందులో రెండు రకాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.


షేక్‌ ఉస్మాన్‌ అనే రోగికి నిలోఫర్‌ ఆస్పత్రిలో పిడియాట్రిక్‌ విభాగం యూనిట్‌-1లో వైద్యులు ఓపీ చీటీపై రాసిన నాలుగు మందుల్లో ఒకటి మాత్రమే ఆస్పత్రి ఫార్మసీలో అందుబాటులో ఉంది.


 15 రోజుల క్రితం తన రెండు సంవత్సరాల బాబు కోసం నిలోఫర్‌కు నారాయణ పేట జిల్లా నుంచి వచ్చిన శివ అనే వచ్చారు. సోమవారం ఆ బాబును డిశ్చార్జ్‌ చేస్తున్నామని చెప్పి.. టాక్సిమ్‌ 2.5 ఎంజీ, కాంబిఫ్లిమ్‌ 2ఎంఎల్‌, జింకోవిట్‌ మందులతో కూడిన చీటిని ఇచ్చి.. బయట కొనుగోలు చేయాలని చెప్పారు. రూ. 500 ఖర్చు చేసి ప్రైవేట్‌ ఫార్మసీలో కొనుగోలు చేశారు. ఈ ఆస్పత్రిలో దాదాపుగా అన్ని రకాల మందులను ప్రైవేటు ఫార్మసీలకే సిఫారసు చేస్తున్నారు.


ఫార్మసిస్టులకు అర్థం కావడం లేదట?

ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరతపై వైద్య సేవలు, సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. ఔషధాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ‘‘వైద్యులు కొన్ని చోట్ల జనరిక్‌ మందులకు బ్రాండెడ్‌ పేర్లను రాస్తున్నారు. అది అర్థంకాక ఫార్మసిస్టులు మందులు లేవని చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు. అయితే.. అన్ని అర్హతలను పరిగణనలోకి తీసుకున్నాకే.. ఆస్పత్రుల్లో ఫార్మసిస్టులను నియమిస్తారు. వారికి ఆ మాత్రం తెలియదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు.. ఓ వైద్యుడు అజిత్రొమైసిన్‌ అని రాయడానికి బదులు.. ‘అజివాక్‌’ అనో.. ‘అజిత్రాల్‌’ అనో బ్రాండ్‌ పేర్లు రాస్తే.. అర్థం చేసుకోలేని దశలో ఫార్మసిస్టులు లేరనేది నిర్వివాదాంశం. ప్రభుత్వం ఆస్పత్రులకు మందుల స్టాక్‌ పంపకపోవడం వల్లే.. వారు రోగులను ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. 


 కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట వంటి సమస్యలకు చికిత్స కోసం తాను జహీరాబాద్‌ ఆస్పత్రికి వచ్చానని ఎల్గోయి గ్రామానికి చెందిన తుక్కమ్మ తెలిపారు. డాక్టరు రాసిచ్చిన మందులేవీ ఆస్పత్రిలో దొరకలేదు. దీంతో రూ. 500 వెచ్చించి ఆ మందులను కొనుగోలు చేసినట్లు తుక్కమ్మ వెల్లడించారు.


అమాక్సిలిన్‌ క్లావమ్‌ మాత్రలను మెడికల్‌ 

షాపులో కొనుగోలు చేసినట్లు చూపిస్తున్న దేవరకద్రకు చెందిన మహాలక్ష్మి


మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం రాకొండ గ్రామానికి చెందిన మహాలక్ష్మి 9 ఏళ్ల కూతురు రజిత కంటికి పుండులాగా వచ్చింది. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కంటి విభాగంలో చూపించింది. ఆమెకు వైద్యులు అమాక్సిలిన్‌ క్లావమ్‌, డైక్లోఫినాక్‌, కెమరాల్‌ ఫోర్ట్‌, మాక్సిఫ్లాక్సిన్‌ చుక్కల మందును రాశారు. ఫార్మసీలోకి  వెళితే అమాక్సిలిన్‌ క్లావమ్‌, మాక్సిఫ్లాక్సిన్‌ చుక్కల మందులు లేవని చెప్పి పంపించారు. దీంతో ఆమె రూ. 200 వెచ్చించి ఆ ఔషధాలను బయట మెడికల్‌ షాపులో కొనుగోలు చేశారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎర్రసత్యం చౌరస్తా ప్రాంతానికి చెందిన రాములు కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నారు. డాక్టర్లు ఆయనకు మెట్‌ఫార్మిన్‌-500, గ్లిమిప్రైడ్‌, ప్రెగాబా-500, పాన్‌టాబ్‌-40, బి-కాంప్లెక్స్‌, కాల్షియం మాత్రలు రాశారు. కానీ, ఫార్మసీలో ప్యాన్‌టాబ్‌, బి-కాంప్లెక్స్‌, కాల్షియం మాత్రలు తప్ప.. మిగతా మూడు రకాల మందులు లేవని చెప్పారు. దీంతో ఆయన డబ్బులు లేక.. బయట తీసుకోలేక.. వెనుతిరిగారు.

Updated Date - 2022-05-29T09:39:38+05:30 IST