డాక్యుమెంట్‌ రైటర్లకు మళ్లీ లైసెన్సులు...?

ABN , First Publish Date - 2020-09-20T08:04:00+05:30 IST

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద దస్తావేజులను తయారు చేసే డాక్యుమెంట్‌ రైటర్లకు ప్రభుత్వం మళ్లీ లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది...

డాక్యుమెంట్‌ రైటర్లకు మళ్లీ లైసెన్సులు...?

సబ్‌ రిజిస్ట్రార్‌లకు అందిన ఉత్తర్వులు 

దస్తావేజు లేఖరుల వివరాలు పంపాలని ఆదేశం

విద్యార్హతలు, ఇతర అంశాల సేకరణ పూర్తి

జిల్లా వ్యాప్తంగా 47 మందికి లబ్ధి


మంచిర్యాల, సెప్టెంబర్‌ 19: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద దస్తావేజులను తయారు చేసే డాక్యుమెంట్‌ రైటర్లకు ప్రభుత్వం మళ్లీ లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఎంత మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారో వివరాలు పంపాలంటూ సబ్‌ రిజిస్ట్రార్‌లకు ఈనెల 17న ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. డాక్యుమెంట్‌ రైటర్లు, ఇదివరకు లైసెన్సులు ఉండి రద్దయిన వారి వివరాలు ఇవ్వాలంటూ అత్యవసరంగా ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న భూములు, ఇతర రిజిస్ట్రేషన్లలో దస్తావేజు లేఖరుల పాత్ర ముఖ్యమైనది. దస్తావేజు లేఖరులు లేకుండా డాక్యుమెంట్లు తయారు చేయడం అంత సులువైన పనికాదు. అసలు వారు లేనిదే రిజిస్ట్రేషన్లు జరగవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థాపక రాక ముందు గ్రామాల్లో పోలీసు పటేళ్ళు, పట్వారీలు దస్తావేజులు తయారు చేయగా వాటి ఆధారంగానే రిజిస్ర్టేషన్లు జరిగేవి. 


తొలిసారిగా లైసెన్సులు జారీకి శ్రీకారం...

డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థ తొలిసారిగా 1972లో రూపుదిద్దుకొంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హయాంలో అర్హతగల డాక్యుమెం ట్‌ రైటర్లను ఎంపిక చేసి లైసెన్సులు జారీ చేశారు. అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న డాక్యుమెంట్‌ రైటర్‌ వ్యవస్థ విమర్శల నేపథ్యంలో 1992లో రద్దయింది. అయినప్పటికీ డాక్యుమెంట్‌ రైటర్లు కనుమరుగు కాలేదు. లైసెన్సులు లేకపోయినా ఆ రంగంలో ఆసక్తి ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లు స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.200 ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవడం ద్వారా డాక్యుమెంట్లను తయారు చేసేవారు. ఇలా కొంతకాలం కొనసాగగా 2002లో అప్పటి ప్రభుత్వం ఆ పద్ధతిని కూడా రద్దు చేసి డాక్యుమెంట్‌ తయారీలో ఉన్న నిబంధనలన్నీ తొలగించింది. దీంతో ఆసక్తిగల వారందరు ఆ రంగంలో స్థిరపడ్డారు. ఇప్పటికీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల తయారీలో వారంతా ముఖ్య భూమిక పోషిస్తున్నారు.


వివరాలు సేకరణ పూర్తి...

లైసెన్సులు జారీ చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్‌ రైటర్ల వివరాలు సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వివరాలు సేకరించాలని ఈనెల 17న సబ్‌ రిజిస్ట్రార్లను ఆదేశించారు. దీంతో వివ రాలు సేకరించిన సబ్‌ రిజిస్ట్రార్‌లు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఐజీకి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, లక్షెట్టిపేటలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా ప్రస్తుతం మంచిర్యాలలో 39, లక్షెట్టిపేటలో 8 మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారు. వారందరికీ లబ్ధి చేకూరనుంది. అయితే 1992లో వ్యవస్థ రద్దయ్యే సరికి మంచిర్యాలలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉండగా అప్పటి వరకు 8 మంది లైసెన్సుడ్‌ డాక్యుమెంట్‌ రైటర్లు ఉండేవారు. వారిలో ప్రస్తుతం ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లు అదే వృత్తిలో కొనసాగుతున్నారు. 


ఇవీ నిబంధనలు...

లైసెన్సు పొందిన డాక్యుమెంట్‌ రైటర్లు విధిగా సంబంధించిన రిజిష్టర్లు, రసీదు పుస్తకాలు, ఇతర రికార్డులు నిర్వహించాలి. వినియోగదారుల నుంచి నిర్ణయించిన రుసుముల కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయరాదు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయ సిబ్బందితో చట్ట విరుద్ద లావాదేవాలు, వ్యవహారాలు చేపట్టరాదు. ఏదైనా న్యాయస్థానంచే అడ్వకేటుగా ప్రాక్టీస్‌ చేసి బర్తరఫ్‌, సస్పెండ్‌ అయిన వారు లైసెన్సు పొందడానికి అనర్హులు. కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా స్టాంపు విక్రేతగా ఉన్నా లైసెన్సు పొందేందుకు అర్హత ఉండదు. 


అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలి...

- శ్రీనాథ్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు ఇవ్వడం శుభపరిణామం. అయితే అనుభవం ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్‌ రైటర్‌కు విధిగా లైసెన్సులు ఇవ్వాలి. నోటిఫికేషన్‌ ద్వారా లైసెన్సు ప్రక్రియ చేపడితే కొత్తవారు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. కనీసం 18 సంవత్సరాలుగా వృత్తిమీద ఆధారపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. 


లైసెన్సులతో బాధ్యత పెరుగుతుంది... 

- చారి, లైసెన్స్‌డ్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ 

డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు జారీ చేయడం వల్ల బాధ్యత పెరుగుతుంది. అప్పుడు స్థల పరిశీలన స్వయంగా జరిపిన తరువాతనే దస్తావేజులు తయారు చేస్తారు. గతంలో తప్పులు జరిగిన పక్షంలో నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం ఉండేవి. దీంతో జాగ్రత్తగా దస్తావేజులు తయారు చేసేవాళ్లం. ఈ పద్ధతి వల్ల వినియోగదారునికి నష్టం వాటిల్లకుండా ఉంటుంది.

Updated Date - 2020-09-20T08:04:00+05:30 IST