లైబ్రరీలు కిటకిట..పుస్తకాలకు కటకట!

ABN , First Publish Date - 2022-05-16T08:25:44+05:30 IST

రాష్ట్రంలోని గ్రంథాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

లైబ్రరీలు కిటకిట..పుస్తకాలకు కటకట!

సమస్యల నిలయాలుగా గ్రంథాలయాలు

పోటీ పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగేదెలా?

ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలవడంతో

గ్రంథాలయాల బాట పట్టిన నిరుద్యోగులు

చాలా చోట్ల లైబ్రరీల్లో కుర్చీలు, టేబుళ్ల కొరత

చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన  పరిస్థితి

అవసరమైన పుస్తకాల్లేక పాత పుస్తకాలే గతి

మరుగుదొడ్లు లేక మహిళల ఇబ్బందులు

సిద్దిపేట, సిరిసిల్ల లాంటి చోట్ల మంత్రుల

చొరవతో గ్రంథాలయాలకు సకల సౌకర్యాలు

అన్ని చోట్లా కల్పించాలన్న డిమాండ్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : రాష్ట్రంలోని గ్రంథాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామక ప్రక్రియను ప్రారంభించడంతో ఉద్యోగార్థులంతా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం కోచింగ్‌ కేంద్రాలకు, గ్రంథాలయాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం కూడా వీరికోసం ఆయా గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ శాఖను ఆదేశించింది. ప్రత్యేకించి కొన్ని గ్రంథాలయాలకు ఇందుకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసింది. అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు లేకపోతే.. తెప్పించి మరీ ఇవ్వాలని పేర్కొంది.


కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం చాలావరకు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల మినహా ఎక్కువ గ్రంథాలయాల్లో సరైన పుస్తకాలు అందుబాటులో లేవు. పాతపుస్తకాలతోనే  సరిపెడుతున్నారు. లైబ్రరీల పనివేళలను కూడా పెంచడంలేదు. ఇక సౌకర్యాల మాట సరేసరి. అత్యధిక గ్రంథాలయాల్లో కుర్చీలు, బల్లలు కూడా సరిగా లేవు. మరుగుదొడ్లు అసలే లేవు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల వంటి చోట్ల మినహా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉంది. చాలా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు తగిన పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగార్థులు ఇంటివద్ద నుంచి సొంత పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రధాన గ్రంథాలయంతోపాటు 12 శాఖా గ్రంథాలయాలున్నాయి. నిత్యం జిల్లా గ్రంథాలయాలకు 350 నుంచి 500 మంది చదువుకునేందుకు వస్తున్నారు.


ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయుతే ఆదిలాబాద్‌, ఇచ్చోడ, తాంసి, ఉట్నూర్‌లలో మినహా ఎక్కడా గ్రంథాలయాలకు పక్కా భవనాలు లేవు. దీంతో నిరుద్యోగులు చెట్ల కిందే చదువుకోవాల్సి వస్తోంది.  కాగా, నిర్మల్‌ జిల్లాలో పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ కోసం మూడు గ్రంథాలయాలను ఎంపిక చేశారు. అన్ని రకాల వసతులున్న నిర్మల్‌, దిలావర్‌పూర్‌, ఖానాపూర్‌ లైబ్రరీలను ఎంపిక చేసి.. అక్కడికి వచ్చేవారికి స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో మొత్తం 19 గ్రంథాలయాలు ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మూడేళ్ల క్రితం రూ.2 కోట్లతో ఆఽధునికీకరించారు. ఇక్కడ మాత్రమే అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. కానీ, మండల కేంద్రాల్లోని శాఖా గ్రంథాలయాలు మాత్రం సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాయి.  


ఒకే గదిలో గ్రంథాలయం..!

పెద్దపల్లి జిల్లాలో జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయం మునిసిపల్‌ కార్యాలయంలోని ఒకే గదిలో కొనసాగుతోంది. ఇక్కడికి రోజూ 50 మంది వరకు నిరుద్యోగులు ప్రిపరేషన్‌ కోసం వస్తున్నారు. కానీ, ఇక్కడ పది మందికి మించి కూర్చునే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం పది గ్రంథాలయాలుండగా.. అన్ని చోట్లా సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. ఇక ప్రధాన గ్రఽంథాలయాలకు స్టడీ మెటీరియల్‌ను ఒక్కో సెట్‌ మాత్రమే అందించారు. దీంతో గ్రంథాలయాల్లో సభ్యత్వం ఉన్నవారు వాటిని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. గ్రంథాలయాలకు వచ్చి చదువుకునేవారికి ఇది ఇబ్బందిగా మారుతోంది. కాగా, మంచిర్యాల జిల్లాలోని ప్రధాన గ్రంథాలయంతోపాటు బెల్లంపల్లి, చెన్నూరులోని శాఖా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 


మహబూబ్‌నగర్‌లో భోజన సౌకర్యం..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో పోటీ పరీక్షల పుస్తకాలు, ఫర్నీచర్‌ తదితర వసతులు ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ లోని కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులకు మధాహ్నం అక్షయ పాత్ర పౌండేషన్‌ ద్వారా రూ.5 భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని సెలవు దినాల్లోనూ గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతున్నారు.  కాగా, నారాయణపేటలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లేవు. 


సొంత కుర్చీలు తెచ్చుకొని..

భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారు గ్రంథాలయానికి రోజూ తమ వెంట సొంత కుర్చీలను తీసుకువచ్చి చదువుకుంటున్నారు. చిరుజల్లులు కురిస్తేనే గ్రంథాలయం పైకప్పు కురిసి పుస్తకాలు తడిసిపోయే పరిస్థితి ఉంది. ఇక ఖమ్మం జిల్లా కేంద్రంలో 4లక్షల మంది జనాభా ఉండగా.. మేజర్‌ గ్రంథాలయం ఒక్కటే ఉంది. ఇందులో ప్రతిరోజు 400మంది విద్యార్ధులు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. దీంతో స్థలం సమస్య తీవ్రంగా ఉంది. రూ.కోటి వరకు ఖమ్మం కార్పొరేషన్‌నుంచి సెస్‌ రావాల్సి ఉంది.  సత్తుపల్లిలోని లైబ్రరీకి పుస్తకాలు పూర్తిస్థాయిలో రావడంలేదు. పైగా గ్రంథాలయాన్ని ఆనుకుని వైన్స్‌ షాపు ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాగా, మెదక్‌ లోని గ్రంథాలయం అధ్వానంగా ఉంది. ఏకకాలంలో 20 మందికి మించి కూర్చేనే పరిస్థితి లేదు. ఫర్నీచర్‌ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపించినా ఫలితం లేదని గ్రంథాలయ సంస్థ వర్గాలు తెలిపాయి. 


గ్రేటర్‌ లైబ్రరీల పరిస్థితి అధ్వానం.. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అత్యధిక శాఖా గ్రంథాలయాల పరిస్థితి అధ్వానంగా ఉంది. పోటీ పరీక్షలకు అవసరమైన మెటిరియల్‌ పూర్తి స్థాయిలో లేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం, ఆస్తి పన్నులో లైబ్రరీ సెస్‌గా వసూలు చేస్త్తున్న మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ కేటాయించకపోవడంతో భవనాల నిర్మాణం, ఆధునికీకరణ జరగడం లేదు. నగర కేంద్ర గ్రంథాలయంలో ఇటీవలే రూ.55 లక్షల నిదులతో పోటీ పరీక్షలకు మెటీరియల్‌, ఇతర పుస్తకాలు కొనుగోలు చేశారు. నగరంలోని చాలా చోట్ల గ్రంథాలయాలకు సరైన భవనాలు లేవు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. షాద్‌నగర్‌లో ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. 


సెలవు దినాల్లో లైబ్రరీ తెరవాలని..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రంథాలయాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. సిబ్బంది, నిధుల కొరత గ్రంథాలయాలను వేధిస్తోంది. సాధారణంగా ఉదయం 9 గంటల నుంచి 11గంటల వరకు తిరిగి సాయంత్రం 5గంటల నుంచి 8గంటల వరకు గ్రంథాలయాలు పనిచేసేవి. అయితే పోటీ పరీక్షల నేపథ్యంలో రాత్రి 9గంటల వరకు పెంచారు. నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి.  సెలవుదినాల్లో నూ గ్రంథాలయాలను తెరచి ఉంచాలని కోరుతూ ఈ నెల 6న నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. 


ప్రత్యేక ఆకర్షణగా సిరిసిల్ల గ్రంథాలయం 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో జిల్లా గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. సినారె స్మారక గ్రంథాలయంగా నామకరణం చేశారు. ఇది రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రంథాలయంలో పాఠకులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సెంట్రల్‌ ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రంథాలయంలో 40 వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. డిజిటల్‌ లైబ్రరీతోపాటు నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక హాల్‌ ఉంది. గ్రంథాలయ బడ్జెట్‌ రూ.కోటి 20 లక్షలు ఉంది. దీనికి తోడుగా కలెక్టర్‌ పుస్తకాల కొనుగోలుకు నిధులు కేటాయిస్తున్నారు. 


సిద్దిపేట లైబ్రరీలో ఆధునిక సౌకర్యాలు 

సిద్దిపేట జిల్లా కేంద్రంలో అత్యాధునికంగా రెండు అంతస్తులలో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని నిర్మించారు. 3 రీడింగ్‌ హాల్స్‌, 6 ప్రత్యేక రూములు, వీటిలో రెండు చిన్న పిల్లలు చదువుకునేందుకు కేటాయించారు. మహిళల కోసం ప్రత్యేక రీడింగ్‌ హాల్‌ ఉంది. ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం అన్ని రకాల మెటీరియల్స్‌ అందుబాటులో ఉన్నాయి. గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగులకు మంత్రి హరీశ్‌రావు చొరవతో ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. కంప్యూటర్లకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కూడా ఉంది. అయితే... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఫర్నీచర్‌ లేదు. ఇరుకైన గది కావడంతో కూర్చొని చదవడానికి అనువైన పరిస్థితులు లేవు. కాగా, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో  పోటీపరిక్షల అభ్యర్థుల కోసం మహిళలు, పురుషులకు వేరువేరుగా ఐదు గదులతోపాటు చదువుకునేందుకు రైటింగ్‌ప్యాడ్‌లతో కూడిన కుర్చీలు, మినరల్‌ వాటర్‌, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా లేటెస్ట్‌ పుస్తకాలు కావాలని అడిగితే వాటిని సిబ్బంది తెప్పించి ఇస్తున్నారు. గ్రంథాలయంలోని 10 కంప్యూటర్లకు ఇంటర్నెట్‌  సౌకర్యం కల్పించారు.

Updated Date - 2022-05-16T08:25:44+05:30 IST