అసలేం జరిగింది?

ABN , First Publish Date - 2020-06-07T15:33:14+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ వాయువు వెలువడడానికి దారితీసిన..

అసలేం జరిగింది?

పాలిమర్స్‌ ప్రమాదంపై హైపవర్‌ కమిటీ సుదీర్ఘ చర్చ

స్టైరిన్‌ ఆవిరికి కారణాలేంటి? 

భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా?

నియంత్రణ సంస్థల పాత్రపై ఆరా


విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ వాయువు వెలువడడానికి దారితీసిన రసాయనక చర్యలు, సాంకేతిక కారణాలపై హైపవర్‌ కమిటీ లోతుగా చర్చించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీ శనివారం నోవాటెల్‌ హోటల్‌లో సమావేశమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విభాగాల నిపుణులు, ఉన్నతాధికారులతో అనేక అంశాలపై  చర్చించింది. ప్రమాదానికి కారణమైన స్టైరిన్‌ ట్యాంకు డిజైన్‌, నిర్మాణం, ట్యాంకులో ఉష్ణోగ్రతల నియంత్రణకు రిఫ్రిజిరేషన్‌ వ్యవస్థ, రసాయనం పాలిమరైజేషన్‌ కాకుండా ఏయే రసాయనాలు (ఇన్‌హిబిటర్స్‌) వినియోగించారు?, నిర్వహణలో పాటించిన భద్రతా ప్రమాణాలపై చర్చించారు. కంపెనీ నిర్వహణకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి, భద్రతకు సంబంధించి ఫ్యాక్టరీస్‌, పరిశ్రమల విభాగాల తనిఖీలు, నిఘా, పర్యవేక్షణ వంటి అంశాలను కమిటీ చర్చించింది.


కంపెనీ దిగుమతి చేసుకునే స్టైరిన్‌ వాయువు నిల్వకు సంబంధించి తీసుకునే చర్యలు,  నిబంధనలపై కర్మాగారాల డైరెక్టర్‌, ఇతర అధికారులతో హైపవర్‌ కమిటీ భేటీ అయింది. కంపెనీలో ఉత్పత్తుల తయారీ, రసాయనాల నిల్వ, విషపూరిత రసాయనం దిగుమతికి సంబంధించి పెట్రోలియం సేఫ్టీ ఆర్గనైజేషన్‌ లైసెన్స్‌పై చర్చించింది. చివరగా గాలి, నీరు, భూమిపై వాయువు లీక్‌ ప్రభావంపై నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(నీరి) ఇచ్చిన నివేదికపై అభిప్రాయాలను తెలుసుకున్న కమిటీ, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నీటిశుద్ధి, వినియోగం గురించి ఆరాతీసింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్‌, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, సీపీ ఆర్కే మీనా, సాంకేతిక నిపుణులు ఆచార్య వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, ఎస్‌.బాలప్రసాద్‌, కేవీ రావు, ఎన్జీటీ నియమించిన కమిటీ సభ్యులు ఆచార్య రామచంద్రమూర్తి, కేజీ రావు పాల్గొన్నారు. ఇంకా కొవిడ్‌-19 ప్రభావంతో హాజరుకాలేకపోయిన దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నిపుణులు అంజన్‌ రే, ఆర్కే ఇలంగోవన్‌, భరత్‌ భూషన్‌ శర్మ, స్మితా మహంతిలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు విషయాలపై చర్చించారు.

Updated Date - 2020-06-07T15:33:14+05:30 IST