ఆ పాపం కంపెనీదే!

ABN , First Publish Date - 2020-07-07T08:49:27+05:30 IST

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనలో సదరు కంపెనీ వైఫల్యాలు ..

ఆ పాపం  కంపెనీదే!

ఆ కంపెనీని అక్కడ నుంచి తరలించాలి

ఎల్జీ పాలిమర్స్‌ వైఫల్యాలు కోకొల్లలు

ట్యాంకు డిజైన్‌ నుంచి సైరన్‌ వ్యవస్థ వరకు..

రిఫ్రిజిరేషన్‌, కూలింగ్‌ సిస్టమ్‌లోనూ లోపాలు

ప్రమాదకర ట్యాంకుల నిర్వహణపై

సిబ్బందికే తగిన అవగాహన లేదు

ట్యాంకులో ఉష్ణోగ్రత పెరగడం వల్లే గ్యాస్‌ లీక్‌ 

ముఖ్యమంత్రికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక


అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనలో సదరు కంపెనీ వైఫల్యాలు తీవ్రంగా ఉన్నాయని ఉన్నత స్థాయి కమిటీ తేల్చిచెప్పింది. ఏప్రిల్‌ 24నే ఎం-6ట్యాంక్‌లో ఉష్ణోగ్రతలు పెరిగి వాయువుగా మారుతున్నట్లుగా తొలి సంకేతాలు వచ్చాయని.. కంపెనీ అప్పుడే స్పందించి సరైన చర్యలు తీసుకుని ఉంటే.. మే 7వ తే దీన ప్రమాదం జరిగగి ఉండేదే కాదని స్పష్టం చేసింది. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో 12 మంది మరణించడం, 500 మంది అనారోగ్యం పాలవడం తెలిసిందే. ఈ దుర్ఘటనకు కారణాలు, భవిష్యత్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.


ఇందులో సభ్యులుగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మీనా, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి వివేక్‌ యాదవ్‌లతో పాటు కేంద్రం సంస్థల నుంచి అంజన్‌రే, ఇలంగోవన్‌, భరత్‌కుమార్‌ శర్మ, డాక్టర్‌ ఎస్‌.కె.నాయక్‌ ఉన్నారు. కంపెనీ, ప్రజలు, పర్యావరణవేత్తలు, సాంకేతిక నిపుణులు తదితరులందరితో మాట్లాడిన ఈ క మిటీ 350పేజీల నివేదికను రూపొందించింది.


ప్రమాదానికి కారణాలు, వైఫల్యాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పొందుపరిచింది. దానిని సోమవారమిక్కడ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సమర్పించింది. అనంతరం నీరబ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. నివేదికలోని అంశాలను వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్‌ను అక్కడి నుంచి తరలించాలని.. వేరే చోట ఆ పరిశ్రమకు భూమి కేటాయించాలని సూచించారు. విశాఖలో ఇలాంటి ప్రమాదకర కంపెనీలు చాలా ఉన్నాయని, వాటిపైనా దృష్టి సారించాలన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..


లోపాలు.. వైఫల్యాలు

‘దుర్ఘటనకు కారణం.. ఎం-6ట్యాంకులో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి స్టైరిన్‌ ర సాయనం విషవాయువుగా మారి లీక్‌ కావడమే. ట్యాంకు డిజైన్‌లో లోపం, ట్యాంక్‌ రిఫ్రిజిరేషన్‌, కూలింగ్‌ సిస్టమ్‌లో లోపాలు, సేఫ్టీ ప్రోటోకాల్‌ సరిగా లేకపోవడం, ప్రమాదకర ట్యాంకుల నిర్వహణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఈ ట్యాంకు నిర్వహణపై కంపెనీ సిబ్బందికే తగిన అవగాహన లేకపోవడం, ఆ రసాయనాల గురించి పూర్తిగా తెలియకపోవడం. కంపెనీని మూసివేసినప్పుడు ట్యాంకు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించకపోవడం.. ఇవన్నీ వైఫల్యాలే. ఆ ట్యాంకును 50 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఎవరికీ సమాచారమివ్వకుండా నిరుడు డిసెంబరులో ఆ ట్యాంకులో పైపులైన్లు మార్చారు.


అప్పుడే సర్క్యులేషన్‌, మిక్సింగ్‌ వ్యవస్థ దెబ్బతింది. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన తర్వాత కూడా కంపెనీ పూర్తిగా విఫలమైంది. 36 మాన్యువల్‌ సైరన్‌లున్నా.. సిబ్బందిలో ఒక్కరు కూడా వాటిని ఆన్‌ చేయలేదు. అదే సమయంలో ఆ గ్యాస్‌ను అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన టీడీఎం, ఎన్‌డీఎం వంటి రసాయనాలను తగిన మోతాదులో నిల్వ ఉంచలేదు. అవే కనుక ఉండి ఉంటే గ్యాస్‌ లీక్‌ నిరంతరంగా సాగేది కాదు. ముఖ్యంగా అదే రోజు రాత్రి 10 గంటలకు రెండోసారి లీకేజీ జరగకుండా ఉండేది. అలా జరిగి ఉంటే పర్యావరణం పెద్దగా దెబ్బతినేది కాదు. ఆవిరిని ఆపేందుకు రసాయనాలను ఉపయోగించలేదు. గ్యాస్‌లీక్‌ ప్రభావం ఎంతమేర ఉందన్న అంశంపైనా అధ్యయనం చేశాం. కంపెనీ నుంచి 0.4 కిలోమీటరు వరకు రెడ్‌జోన్‌, ఒక కిలోమీటరు వరకు ఆరెంజ్‌ జోన్‌, 2.8 కిలోమీటర్ల వకు ఎల్లో జోన్‌గా గుర్తించాం.’ 


సేఫ్టీ బోర్డు ఏర్పాటుచేయాలి 

‘ప్రతి వ్యవస్థ నిర్లక్ష్యం, దానిని భవిష్యత్‌లో అరికట్టేందుకు చర్యలను నివేదికలో వివరించాం. మన నియంత్రణ వ్యవస్థల్లో లోపాలను ఎలా సరిచేసుకోవాలో సూచించాం. ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డులను ఏర్పాటుచేయాలన్నాం. కేంద్ర స్థాయిలో ఒక  బోర్డుతో పాటు అన్ని రాష్ట్రాల్లోను వీటిని ఏర్పాటుచేయాలి. తాజా ఘటనలో విషవాయువుబారిన పడి ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ఏడాది అధ్యయనం చేస్తున్నాం. ఐసీఎంఆర్‌తోనూ అధ్యయనం చేయించాలని సూచించాం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.’


‘ఎల్జీ’ నుంచి మళ్లీ ఘాటైన వాసన

గోపాలపట్నం(విశాఖపట్నం), జూలై 6: ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి మళ్లీ ఘాటైన వాసన రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ వాసన గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంకటాపురం వాసులు ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. విషవాయువు లీకైన ఘటన జరిగి రెండు నెలలు గడిచినా గ్రామస్థులను ఇప్పటికీ భయం వీడలేదు. ప్రమాదానికి కారణమైన స్టైరిన్‌ రసాయనాన్ని కంపెనీ నుంచి నెల క్రితమే తరలించినప్పటికీ కొన్ని రసాయనాలు ఇంకా ట్యాంకుల్లో నిల్వ ఉన్నాయి. ఆ రసాయనాల వల్ల హాని కలగకుండా ఇతర రసాయనాలు కలుపుతున్న సమయంలోనే తాజాగా ఘాటైన వాసన వస్తున్నట్టు తెలిసింది. 

Updated Date - 2020-07-07T08:49:27+05:30 IST