ఒకే పోస్టుకు ఇద్దరికి తండ్రీ తనయుల సిఫార్సు లేఖలు

ABN , First Publish Date - 2022-06-30T07:42:24+05:30 IST

సాధారణ బదిలీల నేపథ్యంలో ఓ పోస్టుకు జిల్లాలోని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఒకరికి.. ఆయన తనయుడైన మరో ప్రజాప్రతినిధి ఇంకొకరికి సిఫార్సు లేఖ ఇచ్చారు.

ఒకే పోస్టుకు ఇద్దరికి తండ్రీ తనయుల సిఫార్సు లేఖలు

ఏ లేఖకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక ఇరకాటంలో జిల్లా అధికారి

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 29: సాధారణ బదిలీల నేపథ్యంలో ఓ పోస్టుకు జిల్లాలోని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఒకరికి.. ఆయన తనయుడైన మరో ప్రజాప్రతినిధి ఇంకొకరికి సిఫార్సు లేఖ ఇచ్చారు. దాంతో ఎవరి లేఖకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక ఆ శాఖ జిల్లా అధికారి ఇరకాటంలో పడ్డారు. కాసుల గలగలతో పైసలు కుమ్మరించే, ఆదాయం భారీగా వచ్చే ఓ శాఖలోని ఓ పోస్టులో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఐదేళ్ళకు మించి పనిచేస్తున్నారు. అక్కడే కొనసాగేందుకోసం ఆయన జిల్లాలోని ముఖ్య ప్రజాప్రతినిధిని కలిసి ఆ ఉద్యోగి ప్రసన్నం చేసుకున్నాడు. 5 ఏళ్ళకు మించి పనిచేస్తున్న ఆ ఉద్యోగి ప్రభుత్వ నిబంధనల మేర మరో స్థానానికి బదిలీ కావాలి. కానీ వివరాలు తెలిసో, తెలియకో అక్కడే కొనసాగేందుకు ఆ ప్రజాప్రతినిధి సిఫార్సులేఖ ఇచ్చారు. మరోవైపు ఆ పోస్టుపై గురిపెట్టిన మరో ఉద్యోగి.. ఆ ప్రజాప్రతినిధి కుమారుడిని (ఈయనా ప్రజాప్రతినిధే) కలిశారు. తనకున్న అర్హత వివరాలు తెలియజేసి రెకమెండేషన్‌ లెటర్‌ పొంది, దాంతో పాటు తన దరఖాస్తును జిల్లా అధికారికి అందజేశాడు. ఒకే పోస్టుకు తండ్రీ తనయులైన ఇద్దరు ప్రముఖ ప్రజా ప్రతినిధులు వేర్వేరు ఉద్యోగులకు సిఫార్సు చేస్తూ ఇచ్చిన బదిలీ లెటర్లు చూసి ఆ అధికారి ఖంగుతిన్నారు. రెండ్రోజులుగా ఆ సిఫార్సులేఖలను పక్కనపెట్టిన ఆ అధికారి ఇతర అధికారుల సలహాతో ఆ ముఖ్య ప్రజాప్రతినిధి కుమారుడికి సమాచారమిచ్చారు. దీంతో ఆయన ఈ పోస్టు బదిలీ వ్యవహారం పక్కన పెట్టమన్నారట. బదిలీ గడువు 24 గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియక ఆ అధికారి ఆందోళనలో పడ్డారు. 

Updated Date - 2022-06-30T07:42:24+05:30 IST