‘లక్ష్యం నీరు’ కారింది..!

ABN , First Publish Date - 2020-07-10T10:30:16+05:30 IST

కాంట్రాక్టర్ల అలసత్వం.. పర్యవేక్షణ ఇంజనీర్ల నిర్లక్ష్యం.. భూ సేకరణ.. ఫారెస్ట్‌ ల్యాండ్‌ క్లియరెన్స్‌లో జాప్యం వెరసి సాగునీటి కాలువలు

‘లక్ష్యం నీరు’ కారింది..!

నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వంపై రూ.550 కోట్ల అదనపు భారం

ఏళ్లు గడిచినా పూర్తికాని భూ సేకరణ

ఇప్పటికే రూ.కోట్లు వెచ్చించినా అందని సాగునీరు

పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్ల లేఖ

రూ.376.36 కోట్ల బ్యాలెన్స్‌ పనులు రద్దు చేసిన ప్రభుత్వం

రీ ఎస్టిమేట్‌ వేస్తే 150-200 శాతం పెరిగే అవకాశం


(కడప-ఆంధ్రజ్యోతి): 

కాంట్రాక్టర్ల అలసత్వం.. పర్యవేక్షణ ఇంజనీర్ల నిర్లక్ష్యం.. భూ సేకరణ.. ఫారెస్ట్‌ ల్యాండ్‌ క్లియరెన్స్‌లో జాప్యం వెరసి సాగునీటి కాలువలు, ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. ఏళ్లు గడిచినా పురోగతి లేదు. నిర్మాణ వ్యయం పెరగడంతో ఈ పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. రద్దు (ప్రీ-క్లోజర్‌) చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కాంట్రాక్టర్ల విన్నపానికి సర్కారు తలొగ్గింది. రూ.376.36 కోట్లకుపైగా విలువైన బ్యాలెన్స్‌ పనులు రద్దు చేసింది. తిరిగి ఆ పనులు చేయాలంటే తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం 150-200 శాతం పెరిగే అవకాశం ఉందని, ఖజానాపై రూ.550 కోట్లకుపైగా అదనపు భారం పడుతుందని ఇంజనీర్లే అంటున్నారు. గడువులోగా పనులు చేసింటే సకాలంలో సాగునీరు అందడంతో పాటు ఖజానాపై భారం ఉండేది కాదు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 5 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఆశయంతో గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టు చేపట్టారు. ఫేజ్‌-2 కింద రూ.2,189 కోట్లతో 14 ప్యాకేజీలను కడప, చిత్తూరు జిల్లాల్లో చేపడితే.. కడప జిల్లా ఎన్టీఆర్‌ తెలుగుగంగ సీఈ పర్యవేక్షణలో 1 నుంచి 7 ప్యాకేజీలు రూ.946.82 కోట్లతో చేపట్టారు. ఏళ్లు గడిచినా 20 శాతం పనులు కూడా జరగలేదు. సవరించిన అంచనాల మేరకు నిర్మాణ వ్యయం రూ.3,177.34 కోట్లకు చేరింది.


అలాగే.. బ్రహ్మంసాగర్‌ జలాశయం పరిధిలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా కుడి, ఎడమ కాలువల నిర్మాణం, సీసీ లైనింగ్‌కు శ్రీకారం చుట్టారు. 95 శాతానికిపైగా పనులు చేసి వంద కోట్లు ఖర్చు పెట్టినా 5 శాతం పనులు పూర్తి చేయకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు ఎండమావిగానే మారింది. 67 వేల ఎకరాలకు సాగునీరు అందించే పులివెందుల బ్రాంచి కాలువ ఆధునికీకరణ పనులు రూ.261 కోట్లతో చేపట్టినా, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.


రూ.550 కోట్లకు పైగా అదనపు భారం

గాలేరు-నగరి ప్రాజెక్టు, ఎన్టీఆర్‌ తెలుగుంగ ప్రాజెక్టు, బ్రహ్మంసాగర్‌ కుడి, ఎడమ కాలువల నిర్మాణం, సీసీ లైనింగ్‌, పులివెందుల బ్రాంచి కాలువ ఆధునికీకరణ, గండికోట-సీబీఆర్‌ లిఫ్ట్‌.. వంటి పనులు రూ.2,560.76 కోట్లతో చేపట్టారు. 2004-05 నుంచి 2007-09 మధ్యలో వివిధ ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆనాటి ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ధరలకే కాంట్రాక్ట్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. కాగా.. వివిధ కారణాల వల్ల కొన్ని పనులు 5.97 శాతం, మరికొన్ని 34.16 నుంచి 67 శాతం వరకు జరిగాయి. ఇంకొన్ని పనులు 95 శాతానికిపైగా పూర్తి చేశారు. కొన్ని అర్ధంతరంగా ఆపేశారు. 2012-14 మధ్యలోనే పనులు ఆగిపోయాయని ఇంజనీర్లు చెప్పారు. చివరలో చిన్న పనులు ఆగిపోవడంతో వందల కోట్లు ఖర్చు అయినా సాగునీరు అందని దైన్యంగా మారింది.


ఈ పనులు తాము చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేసి ప్రీ-క్లోజర్‌కు దరఖాస్తు చేశారు. రూ.376.36 కోట్ల బ్యాలెన్స్‌ పనులు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు తిరిగి ప్రతిపాదనలు (రీ-ఎస్టిమెట్‌) తయారు చేసి చేపట్టాలంటే తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం 150-200 శాతం పెరుగుతోందని ఇంజనీర్లే అంటున్నారు. ఈ లెక్కన రూ.550 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతోంది. సకాలంలో  పనులు చేసి ఉంటే ప్రభుత్వంపై అదనపు భారం పడేది కాదని, ఇప్పటికే ఆయకట్టుకు సాగునీరు అంది కరువునేల సస్యశామలం అయ్యేదని రైతులు అంటున్నారు.


భూ సేకరణ జాప్యం

సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడానికి ప్రధాన కారణం భూ సేకరణలో జాప్యమని ఇంజనీర్లు అంటున్నారు. ప్యాకేజీ-93 ఏ, బీ కింద రూ.98.96 కోట్లతో పులివెందుల బ్రాంచి కాలువ ఆధునికీకరణ చేపట్టారు. 107.58 ఎకరాల భూ సేకరణ జాప్యం కారణంగా రూ.25.59 కోట్ల పనులు ఆగిపోయాయి. తాజా రేట్ల ప్రకారం బ్యాలెన్స్‌ పనుల విలువ రూ.75 కోట్లకు చేరుతోందని అంచనా. 


బ్రహ్మంసాగర్‌ కుడి, ఎడమ కాలువ, డిస్ర్టిబ్యూటరీ నిర్మాణాలు రూ.210.42 కోట్లు, లైనింగ్‌ పనులు రూ.107కోట్లతో చేపట్టి 95 శాతం పనులు పూర్తి చేశారు. రూ.21.46కోట్ల పనులు చేయాల్సి ఉంది. కేవలం 15.72 ఎకరాల భూసేకరణ జాప్యం కారణంగా 2013 నుంచి పనులు ఆగిపోయాయి. ఈ నిర్లక్ష్యం వల్ల వందల కోట్లు ఖర్చు చేసినా 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. 


గాలేరు-నగరి ప్రాజెక్టు ప్యాకేజీ-6 కింద రూ.95.53 కోట్లతో ప్రధాన కాలువ పనులు 2007లో చేపట్టారు. ఫారెస్ట్‌ ల్యాండ్‌ క్లియరెన్స్‌ రాకపోవడం, ఆ దిశగా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి. భూ సేకరణ జాప్యం కూడా సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి శాపంగా మారిందనే విమర్శలు లేకపోలేదు.


ప్రతిపాదనలు తయారు చేస్తాం- శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సీఈ, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్సు, కడప

వివిధ దశల్లో ఆగిపోయిన ఆయా ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు (ప్రీ-క్లోజర్‌) చేసింది. కాంట్రాక్టర్ల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాలెన్స్‌ పనులకు సంబంధించి తిరిగి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. నిధులు ఇస్తే టెండర్లు పిలిచి అసంపూర్తి పనులు పూర్తి చేస్తాం. తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం బ్యాలెన్స్‌ పనుల విలువ పెరిగే అవకాశం ఉంది. 


జిల్లాలో ప్రాజెక్టుల పనుల వివరాలు

ప్రాజెక్టు/స్కీం అంచనా విలువ చేసిన పనుల  ఒప్పందం బ్యాలెన్స్‌

(రూ.కోట్లల్లో)   శాతం     తేది (రూ.కోట్లల్లో)

పీబీఆర్‌ ప్యాకేజీ-91 లెనింగ్‌ 73.57 66.65 18/5/2006 24.53

పీబీఆర్‌ ప్యాకేజీ 92 ఏ 55.77 61.75 3/12/2007 21.34

పీబీఆర్‌ ప్యాకేజీ-93 32.69 85.83 23/7/2005 4.63

పీబీఆర్‌ ప్యాకేజీ-93 ఏ 38.81 60.68 3/12/2007 15.25

పీబీఆర్‌ ప్యాకేజీ-93 బీ 60.17 85.45 21/11/2007 10.34

సీబీర్‌ రైట్‌ కెనాల్‌ బ్లాక్‌-1 8.46 53.00 11/2/2009 3.98

సీబీఆర్‌ రైట్‌ కెనాల్‌ బ్లాక్‌-2 8.45 65.34 11/2/2009 2.73

టీజీపీ-ఎస్‌పీవీఆర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ 210.42 92.17 22/10/2004 16.46

టీజీపీ-ఎస్‌పీవీఆర్‌ ప్యాకేజీ-2 107.00 95.33 7/4/2010 5.01

టీజీపీ-ఎస్‌పీవీఆర్‌ ప్యాకేజీ-3 201.31 94.48 22/10/2004 11.11

టీజీపీ-ఎస్‌పీవీఆర్‌ పీ-3, లైనింగ్‌ 122.34 94.01 7/4/2010 7.33

గండికోట-సీబీఆర్‌ ప్యాకేజీ-1 275 89.18 18/5/2007 0.01

గండికోట-సీబీఆర్‌ ప్యాకేజీ-2 276 85.62 8/7/2007 0.01

గండికోట-సీబీఆర్‌ ప్యాకేజీ-3 129 81.34 18/5/2007 0.01

జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2, ప్యాకేజ్‌-5 130.10 5.97 11/10/2007 126.04

జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2, ప్యాకేజ్‌-6 95.83 34.16 11/10/2007 74.07

జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-1, ప్యాకేజ్‌-2 294.45 99.51 11/10/2007 1.18

జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-1, ప్యాకేజ్‌-2ఏ 61.25 41.08 27/5/2015 52.17

జీఎన్‌ఎస్‌ఎస్‌ ఎఫ్‌ఎఫ్‌సీ పీ-31 376.14 99.57 -- 0.09

మొత్తం 2,560.76 -- -- 376.36

Updated Date - 2020-07-10T10:30:16+05:30 IST