కరోనా కట్టడికి మరింత కష్టపడదాం

ABN , First Publish Date - 2021-05-16T04:42:35+05:30 IST

కరోనా కట్టడికి అందరం మరింత కష్టపడి పని చేద్దామని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

కరోనా కట్టడికి మరింత కష్టపడదాం
హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల సహాయకులకు భోజనం పెట్టండి

పది మంది పాజిటివ్‌ బాధితులుంటే వైద్యులే వారి వద్దకు వెళ్లాలి

జనరల్‌ ఆస్పత్రిలో త్వరలో 500 బెడ్‌లతో పూర్తి స్థాయిలో కరోనా వార్డు సిద్ధం

మంగళవారం నాటికి షాద్‌నగర్‌లో 30 ఆక్సిజన్‌ బెడ్లు సిద్ధం

మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వీడియో కాన్ఫరెన్స్‌


మహబూబ్‌నగర్‌, మే 15: కరోనా కట్టడికి అందరం మరింత కష్టపడి పని చేద్దామని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. వచ్చే వారం, పది రోజులు అధికారులు, ప్రజాప్రతినిఽధులంతా ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా నిలబడాలన్నారు. గతేడాది తరహాలోనే జిల్లా కేంద్రంలో యాచకులకు భోజనం పెట్టాలని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స పొందే రోగుల సహాయకులకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధులు తాను ఇస్తానని చెప్పారు. మంత్రి హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌లు, కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వల్ల ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఫీవర్‌ సర్వేల ద్వారా అవసరమైన వారికి వైద్య సేవలు అందించాలని కోరారు. గ్రామాల్లో పది మంది కరోనా రోగులుంటే వైద్యులే వారివద్దకు వెళ్లాలని, లేని పక్షంలో ఆన్‌లైన్‌లో వారికి మనోధైర్యం కల్పించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో అవసరమైతేనే ఆక్సిజన్‌ను వినియోగించాలని పేర్కొన్నారు. పాలమూరు జనరల్‌ ఆస్పత్రిలో త్వరలోనే 500 బెడ్‌లతో కరోనా వార్డును పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామన్నారు. ఎస్‌వీఎస్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో 100 పడకలు ఉన్నాయన్నారు. మంగళవారం నాటికి షాద్‌నగర్‌లో 30 ఆక్సిజన్‌ బెడ్లు సిద్ధమవుతున్నాయని తెలిపారు. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మినహాయింపు సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించాలని అధికారులకు సూచించారు. 

జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీసీకుంట నుంచి ఎక్కువ కేసులు వస్తున్నందున అక్కడ డాక్టర్‌కు మరో సహాయకుడిని కేటాయించాలని కోరారు. 

ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా రోగులకు మనోధైర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌  ఆస్పత్రులలో ఆక్సీజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఆక్సీజన్‌ పెట్టే విషయాన్ని ఆలోచించాలన్నారు. ఫీవర్‌ సర్వే ఆధారంగా గ్రామాల్లో ఎంత మందికి జ్వరాలున్నాయి?, పాజిటివ్‌ ఎంత మందికి వచ్చింది వంటి వివరాలను వాట్సాప్‌ గ్రూప్‌లలో ఎమ్మెల్యేలకు తెలుపాలని కోరారు. 

కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కోస్గిలో ఆక్సీజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అవసరం ఉన్నాయన్నారు.

నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సింగారంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, మంత్రి చొరవతో సిలిండర్లు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో నారాయణపేట కలెక్టర్‌ హరిచందన, మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల ఎస్పీలు రావిరాల వెంకటేశ్వర్లు, చేతన, మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ సీతారామారావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణ, నారాయణపేట అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-16T04:42:35+05:30 IST