రక్షించేవాళ్ళను రక్షించుకుందాం!

ABN , First Publish Date - 2021-06-18T05:58:41+05:30 IST

దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకరోజు నిరసన దినం పాటిస్తున్నది...

రక్షించేవాళ్ళను రక్షించుకుందాం!

దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకరోజు నిరసన దినం పాటిస్తున్నది. ప్రజలు ఆరోగ్యపరంగా ఒక అత్యవసర స్థితిలో ఉన్న ఈ సమయంలో డాక్టర్లు ఇలా నిరసనలకు, సమ్మెలకు పూనుకోవటం భావ్యమా? అన్న ప్రశ్న ఉదయిస్తున్న నేపథ్యంలో, వైద్య రంగానికి చెందిన కొన్ని అంశాలు తప్పకుండా పరిశీలించాలి. 


గత ఏడాదిన్నరగా దేశమంతా కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడిపోతున్నది. లక్షలమంది సామాన్య రోగులతో పాటు 740 మందికి పైగా డాక్టర్లు, వందలమంది పారా మెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లమందిని కాపాడే విధ్యుక్తధర్మం నెరవేర్చుతూ వైద్య సిబ్బంది తమ ప్రాణాలు బలి పెట్టారు. ప్రతినిత్యం అనేకమంది రోగుల ప్రాణాలను కాపాడటానికి వైద్యులు, సిబ్బంది నిరంతరం తమ ప్రాణాలను ఫణంగా పెడుతునే ఉన్నారు. 38 కోట్ల మందికి కరోనా టెస్టులు నిర్వహించడం, 26 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం వైద్యసిబ్బంది ఏమాత్రం వెరవకుండా విధులు నిర్వహించటంవల్లనే సాధ్యమయ్యింది. ఇంత పెద్ద మహమ్మారి కబళిస్తుంటే డాక్టర్లు అందరి ప్రాణాలు కాపాడలేకపోవటం వాస్తవమే. సరి అయిన వసతులు, మందులు, ఆక్సిజన్ వంటివి పుష్కలంగా లభించి ఉన్నట్లయితే మానవ విషాదం కొంతయినా తగ్గేది. కారణం ఏదైనాగాని, తమ వారిని కోల్పోయిన వారు కొన్ని సందర్భాలలో సంయమనం కోల్పోయి, ప్రత్యక్షంగా వున్న డాక్టర్లపై భౌతిక దాడులు చేయటం జరుగుతోంది. కొందరు వైద్యులు ప్రాణాలు కోల్పోయారు కూడా. కనుకనే డాక్టర్ల సంఘాలు ఆందోళన వెలిబుచ్చుతూ, తమపై భౌతిక దాడులు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలనీ, దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నాయి. 


డాక్టరుకు, రోగికి మధ్య ఉండాల్సిన ఆత్మీయ బంధం, పరస్పర విశ్వాసం నేడు లోపించింది. డాక్టరు ఆరోగ్యప్రదాతగా కాక తమ జేబులు, బాంకు ఖాతాలు లూటీ చేసే దోపిడిదారుగా రోగికి కనిపిస్తున్నాడు. ఇక డాక్టర్లకేమో రోగి, అతని బంధువులు తమ మీద దాడి చేయటానికి వచ్చినవారిలాగా కనిపిస్తున్నారు. దీంతో అనేకమంది డాక్టర్లు కొద్దిపాటి క్లిష్టత, తీవ్రత గల రోగులను అంగీకరించక, పెద్ద హాస్పిటల్‌కు పంపించి వేయటం కూడా జరుగుతోంది. అందువల్ల చికిత్స ఖర్చులు భరించలేనివిగా మారి ప్రజలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు, ప్రాణనష్టం సంభవించగానే ఒక్కసారిగా విరుచుపడుతున్నారు. కరోనా విజృంభణతో మన ఆరోగ్య రంగం ఎంత బలహీనంగా వున్నదీ ప్రజలకు తెలిసొచ్చింది. జీడీపీలో ఒకటిన్నరశాతం కూడా ఆరోగ్య రంగం మీద ఖర్చు చేయకుండా, అవసరాలకు ఏ మాత్రం సరితూగని వసతులతో నెట్టుకువస్తున్న ఆరోగ్యరంగం వ్యాధిగ్రస్తులను అంతులేని యాతనలకు గురి చేస్తున్నది. కేవలం మెరమెచ్చు మాటలతో పాలకులు హడావుడి చేస్తుంటే, వైద్యులు మాత్రం ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. అరకొర సాధనాలతో, చాలీ చాలని సిబ్బందితో, అత్యధిక సంఖ్యలో వస్తున్న రోగులకు సంతృప్తికరంగా చికిత్సలను అందించలేక మధనపడుతున్నది డాక్టర్లే. ప్రైవేటు రంగంలో కొన్ని సంస్థల అక్రమ పద్ధతులకు, డబ్బుయావకూ, మరోపక్క ప్రజల కోపోద్రిక్తతలకు మధ్య నలిగిపోతున్నది వైద్యులే. చేయని తప్పుకు డాక్టర్లను శిక్షించటం భావ్యం కాదు. రోగిని కాపాడటానికి శాయశక్తులా కృషి చేస్తున్న వారిపై దాడులు చేయటం నాగరికం అనిపించుకోదు. అనాలోచిత దాడులను డాక్టర్లు మాత్రమే కాదు, సమాజంలోని అందరూ నిరసించాలి. డాక్టర్లు నిర్భయంగా తమ విధి నిర్వహణ చేసి బాధ్యతతో మరిన్ని ప్రాణాలు కాపాడే వాతావరణం నెలకొల్పాలి. డాక్టర్లు ప్రజలలో భాగమే. ప్రజారోగ్య సంరక్షణ వారి బాధ్యత. ప్రజలకు, డాక్టర్లకు మధ్య ఏర్పడుతున్న వివాదాలకు కారణం ఏమిటో ఇరువురూ గుర్తించాలి. ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచటానికి కలిసి ప్రయత్నించాలి. ప్రజారోగ్య రంగాన్ని గాలికి వదిలివేసి, మూడువంతుల భాగాన్ని కార్పొరేటు, ప్రయివేటు సంస్థల ఆధీనం చేసిన ప్రభుత్వ విధానాలను సంఘటితంగా ప్రశ్నించాలి. ఇంతటి అత్యవసర స్థితిలో కూడా ప్రైవేట్ రంగంలోని మౌలిక వసతులను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించుకోని ప్రభుత్వ నిరాసక్తతను నిలదీయాలి. సదరు సంస్థలను కట్టడి చేయలేని ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టాలి. గ్రామీణ స్థాయి నుండి నగరస్థాయి వరకు కునారిల్లుతున్న ప్రజారోగ్య వ్యవస్థకు తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేసేలా ప్రభుత్వాన్ని కలసికట్టుగా నిలదీయాలి. 

డాII యస్. జతిన్‌కుమార్

Updated Date - 2021-06-18T05:58:41+05:30 IST