ప్రగతిని పరుగులు పెట్టిద్దాం

ABN , First Publish Date - 2022-01-27T04:42:55+05:30 IST

ప్రత్యేక ప్రణాళికల ద్వారా జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యాన్ని సాధించామని గుర్తుచేశారు.

ప్రగతిని పరుగులు పెట్టిద్దాం
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు సహకారం

 రూ.764 కోట్లతో ఆసుపత్రుల ఆధునికీకరణ

ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు 

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ సూర్యకుమారి

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ప్రత్యేక ప్రణాళికల ద్వారా జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యాన్ని సాధించామని గుర్తుచేశారు. అనేక మంది మేధావులు తమ మేధాశక్తితో అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించారని తెలిపారు. రాజ్యాంగం ద్వారా పౌరులకు అనేక హక్కులు, బాధ్యతలు వర్తించాయన్నారు. జిల్లా స్థాయిలో   అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కుల, మత, ప్రాంత తారతమ్యం లేకుండా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. జేఎన్‌టీయూ కళాశాలను గురజాడ విశ్వవిద్యాలయంగా మార్పు చేయడం.. వైద్య కళాశాలకు అడుగులు పడుతున్న తీరు విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు దోహదపడుతుందన్నారు. వైద్య, వ్యవసాయ రంగాలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జిల్లా ప్రజలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని, దీని బరిన పడకుండా 15సంవత్సరాలు , ఆపైన వయసు గల వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తున్నామన్నారు. 

అన్నదాతకు ఆసరా

వ్యవసాయ పరంగా రైతులకు ‘విత్తనం నుంచి విక్రయం వరకు’ అనే నినాదంతో సహకారం అందిస్తున్నామని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. 209 రైతు గ్రూపులకు రూ.9.22 కోట్ల విలువైన యంత్రాలను అందించామన్నారు. సున్నా వడ్డీ ద్వారా 33,831 మంది రైతులకు రూ.5.14 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఈ ఏడాది రూ.1990 కోట్లు పంట రుణాలుగా అందించినట్లు వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులంతా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం 44వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా పంటలు పండిస్తున్నారని చెప్పారు. శతశాతం ప్రకృతి వ్యవసాయం ద్వారా సేద్యం చేస్తున్న గ్రామంగా కురుపాం మండలం కొండబారిడి గుర్తింపు పొందిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఆమె వివరించారు.

ఆస్పత్రుల ఆధునికీకరణకు చర్యలు

వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. రూ.764 కోట్లతో ఆసుపత్రుల ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. పార్వతీపురంలో రూ.50 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, రూ.500 కోట్లతో విజయనగరంలో వైద్య కళాశాల పనులు ప్రారంభించామన్నారు. విజయనగరం పట్టణంలో రూ.17 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం బేసిక్‌ గ్రాంట్‌ నుంచి తాగునీటి సరఫరా పనులు చేపడుతున్నామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. 

‘ఉపాధి’ నిధులతో పనులు

ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులు రూ.400 కోట్లతో 664 గ్రామ సచివాలయాలు, 620 రైతు భరోసా కేంద్రాలు, 495 వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం, విశాఖ-రాయపూర్‌ జాతీయ రహదారి ద్వారా జిల్లా ప్రగతి మరింత వేగవంతం కానుందని వివరించారు. గొట్లాం-నెల్లిమర్ల రైల్వే లైన్లను కలుపుతూ గాజులరేగ మీదుగా బైపాస్‌ లైన్‌ నిర్మాణం జరుగుతోందన్నారు. 6.7 కిలోమీటర్ల పరిధిలో రూ.99 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టినట్టు వివరించారు. 

గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యం

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. కొఠియా గ్రామాల అభివృద్ధికీ చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడంలో జిల్లాకు అవార్డు వచ్చిందన్నారు. అలాగే పోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ, ప్రకృతి వ్యవసాయానికి స్కోచ్‌ అవార్డు వచ్చినట్లు తెలిపారు. 

విద్యార్థులకు అభినందనలు

జాతీయ స్థాయిలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు, క్రీడల్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరుతెస్తున్న విద్యార్థులను  కలెక్టర్‌ అభినందించారు. ప్రపంచ స్పేస్‌ వారోత్సవాల్లో (స్పేస్‌ టెక్నాలజీలో) నెల్లిమర్ల బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్ధులు రూపొందించిన 3డి రోవర్‌ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిక కావటం అభినందనీయమన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థిని అన్నా నేహాథామస్‌ న్యూ ఢిల్లీలో జరుగుతున్న జాతీయ రిపబ్లిక్‌ వేడుకల్లో ఎన్‌సీసీ కవాతులో పాల్గొనడం ప్రశంసనీయమన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు ప్రతి ఒక్కరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. అనంతరం సుమారు 350 మంది అధికారులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. గణతంత్ర వేడుకల్లో ఎస్పీ దీపికాపాటిల్‌, జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, మయూర్‌ అశోక్‌, జె.వెంకట్రావు, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ రఘువర్మ, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ అవనాపు భావన తదితరులు పాల్గొన్నారు.

 సర్వే శాఖకు మొదటి బహుమతి

గణతంత్ర వేడుకల్లో వివిధ శాఖలు తమ ప్రగతిని తెలియజేసే శకటాలను ప్రదర్శించాయి. వాటిని కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు వీక్షించారు. ఇందులో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖ ఏర్పాటుచేసిన శకటం అందరినీ ఆకట్టుకుంది. ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ శకటానికి రెండో బహుమతి లభించింది. మూడో బహుమతిని జిల్లా జల యాజమాన్య సంస్థ (డ్వామా) కైవసం చేసుకుంది.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయనగరం పూల్‌బాగ్‌లో ఉన్న ద్వారకామయి అంధుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. రెండో బహుమతిని గంట్యాడ మండలం కేజీబీవీ పాఠశాల విద్యార్థులు గెలుచుకున్నారు. ఇదిలా ఉండగా మార్చ్‌ఫాస్ట్‌లో మొదటి బహుమతిని దిశ పోలీస్‌ స్టేషన్‌, రెండో బహుమతిని స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, మూడో బహుమతిని ట్రాఫిక్‌ పోలీసులు గెలుచుకున్నారు. 


Updated Date - 2022-01-27T04:42:55+05:30 IST