ఉపా చట్టం రద్దుకై పోరాడదాం

ABN , First Publish Date - 2022-05-26T05:54:06+05:30 IST

1967లో వచ్చిన ‘ఉపా’ చట్టానికి అనేక సవరణలు చేసి, బలోపేతం చేసిన కేంద్ర ప్రభుత్వం దానిని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులపై ప్రయోగిస్తోంది...

ఉపా చట్టం రద్దుకై పోరాడదాం

1967లో వచ్చిన ‘ఉపా’ చట్టానికి అనేక సవరణలు చేసి, బలోపేతం చేసిన కేంద్ర ప్రభుత్వం దానిని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులపై ప్రయోగిస్తోంది. ఈ చట్టం పౌరుల ప్రాథమిక హక్కులకు పూర్తిగా వ్యతిరేకం. ప్రధానంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21లను ఈ చట్టం ఉల్లంఘిస్తోంది. ప్రశ్నించిన ప్రతి వారిని ప్రభుత్వం ఉపా చట్టం పేరుతో హింసిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద కేసు అయినా బెయిల్ తప్పనిసరిగా రావాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ప్రతి ఉపా కేసులో జైలే తప్పనిసరి అయింది. ఏళ్లు గడిచినా బెయిల్ రాని పరిస్థితి ఉంది. ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం దేశంలోని హక్కుల సంఘాలపై ఉంది. ఈ సందర్భంలో పౌరహక్కుల సంఘం, తెలంగాణ గత నాలుగేళ్ల కార్యాచరణను సమీక్షించుకుని భవిష్యత్తు ఆచరణకు సంబంధించి నిర్దేశించుకునే క్రమంలో సంస్థ ద్వితీయ మహాసభలను మే 29, ఆదివారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించనున్నది. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్‌ హాల్‌లో బహిరంగసభ జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొ. లక్ష్మణ్‌ గడ్డం అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రొ. హరగోపాల్‌, పాశం యాదగిరి, వేదంగి చిట్టిబాబు, ప్రొ. ఫైజన్‌ ముస్తఫా, క్రాంతి చైతన్య, నారాయణరావు, చిలక చంద్రశేఖర్‌, ఆశిష్‌ గుప్తా, తపస్‌ చక్రవర్తి, ప్రీత్‌పాల్‌సింగ్‌, లిక్స్‌, గోపాల్‌ ప్రసంగిస్తారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజాకళా మండలి కార్యక్రమాలు కూడా ఉంటాయి.

నారాయణరావు

ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం–తెలంగాణ

(మే 29న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగసభ)

Updated Date - 2022-05-26T05:54:06+05:30 IST