ఆ జంటలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-05-16T05:32:57+05:30 IST

‘‘కులం వద్దు అనుకున్నా, ఏదో ఒక రకంగా కులం, మతం మన వెన్నంటే ఉంటాయి. అందరూ ఏదో ఒక కులంతో ముడిపడినవాళ్లమే.! చివరికి మనం తినే తిండికి కూడా కులమతాలున్నాయి.

ఆ జంటలకు అండగా ఉంటాం

కులరహిత సమాజ నిర్మాణమనే ఒక పెద్ద విప్లవాత్మకమైన ఆశయంతో యాబై ఏళ్ల కిందట అంకురించింది ‘కులనిర్మూలన సంఘం’. తెలుగునాట కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ కొన్నివందల ప్రేమజంటలకు అండగా నిలిచిన అపురూపమైన చరిత్ర దీని సొంతం. ఆ క్రమంలో 30 ఏళ్లుగా ఉద్యమంతో మమేకమయ్యారు కులనిర్మూలన సంఘం ఉపాధ్యక్షురాలు యదుళ్ళ జ్యోతి. ఆ మహత్తర ఉద్యమం స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కులనిర్మూలన సంఘం ప్రస్థానంలోని తన అనుభవాలను, అభిప్రాయాలను ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు. 


‘‘కులం వద్దు అనుకున్నా, ఏదో ఒక రకంగా కులం, మతం మన వెన్నంటే ఉంటాయి. అందరూ ఏదో ఒక కులంతో ముడిపడినవాళ్లమే.! చివరికి మనం తినే తిండికి కూడా కులమతాలున్నాయి. ఈ కుల,మత భేదాలు తొలగి ఆదర్శవంతమైన సమాజం మొగ్గతొడగాలంటే డా. బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించినట్లు ‘విభిన్న కులాలు, మతాల మధ్య రక్తసంబంధాలు ఏర్పడాలి’. అదే మా కులనిర్మూలన సంఘం లక్ష్యం కూడా. నాది మతాంతర వివాహం. ముఫ్ఫై ఏళ్ల కిందట ఒక ఘర్షణ వాతావరణంలో ప్రఖ్యాత కవి శివసాగర్‌, జ్వాలాముఖి, మల్లాది సుబ్బమ్మ వంటి పెద్దల సమక్షంలో వహీద్‌, నేనూ ఒక్కటయ్యాం. మా ఇద్దరిదీ నల్గొండ జిల్లాలోని పెరుకకొండారం గ్రామం. అయితే, కొన్నేళ్ల కిందట ఉద్యోగ రీత్యా మా రెండు కుటుంబాలు ఎల్బీనగర్‌లో స్థిరపడ్డాయి. పైగా మావి ఇక్కడా ఇరుగుపొరుగు ఇళ్ళే.! అలా ఇరు కుటుంబాల స్నేహం మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేందుకు కారణం అయింది. హేతువాద భావాలు మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. కేవలం ఆయన ముస్లిం కావడం వల్లే మా ఇంట్లో వాళ్లు పెళ్లికి అంగీకరించలేదు. పైగా మా బంధువులు ఆయన్ను చంపేస్తామని బెదిరించారు కూడా. అయినా, వాటన్నింటిని ఎదుర్కొని ఒక్కటయ్యాం. కష్టకాలంలో మమ్మల్ని అక్కున చేర్చుకున్న కులనిర్మూలన సంఘం పోరాటంలో ఆనాటి నుంచి మేమూ భాగమయ్యాం. మాకు మల్లే కులాలకు, మతాలకు అతీతంగా కలిసి బతకాలనుకున్న డెభ్భై జంటలకు దగ్గరుండి పెళ్ళి చేశాం. ఆ క్రమంలో వాళ్ల పెద్దల నుంచి కొన్ని దాడులనూ ఎదుర్కొన్నాం. 


పెద్దల బాఽధ్యత...

ఒకవైపు కులోన్మాద హత్యలు కలవరపెడుతున్న మాట నిజమే.! అయితే, మరోవైపు కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అగ్రకులాలుగా చలామణి అయ్యే కుటుంబాల్లోని అమ్మాయిల కన్నా, అబ్బాయిల కులాంతర వివాహాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. బహుశా.! వాళ్లకు చిన్నప్పటి నుంచి కులం తాలూకూ భావాలు నూరిపోయడం అందుకు ఒక కారణం కావచ్చు. ఆర్థికతారతమ్యాల వల్ల ఒకే కులంలోని ప్రేమ వివాహాలను అంగీకరించని పెద్దలూ ఉన్నారు. అణగారిన వర్గంలోనే సబ్‌క్యాస్ట్‌ అబ్బాయిని ప్రేమించి పెళ్లాడిన కారణంగా అమ్మాయిని కన్నవాళ్లే పొట్టనపెట్టుకున్న ఘటననూ అబ్దుల్లాపూర్‌మెట్‌లో చూశాం. ఇలా ఒకటా, రెండా... కులం, మతం, వర్గం... ఇవి ప్రేమికుల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయిలను కులోన్మాదంతో చంపడం చూస్తున్నాం. అదే ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉండే అబ్బాయిని కులాంతర వివాహమాడిన అమ్మాయిలు అత్తింటి నుంచి వేధింపులు ఎదుర్కోవడం మరొకటి. ఇక పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రేమజంటలూ తక్కువ లేవు. సమాజ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలవాల్సిన యువతరాన్ని కులం, మతం ఆంక్షల పేరుతో కట్టడి చేయడం భారతీయ సమాజంలోనే చూస్తున్నాం. జీవిత భాగస్వామిని ఎంచుకునే కనీస స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వడం పెద్దల బాధ్యత. దాన్ని గుర్తు చేయడమే మా పని.  


మానవవాదాన్ని ఆశ్రయించాం...

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ల పిల్లలకు పెళ్లికావడం కష్టమనేది ఒట్టి అపోహ. మాకు ఇద్దరు అమ్మాయిలు. మా పెద్దమ్మాయి రోష్నికి హేతువాద, నాస్తికవాద కుటుంబాల నుంచి బోలెడు సంబంధాలు వచ్చాయి. అయితే, అప్పటికే అమ్మాయి బెంగుళూరుకి చెందిన ఒక బ్రాహ్మల అబ్బాయిని ప్రేమించింది. అవతలి కుటుంబానికి మా కూతురు నచ్చింది. కానీ ‘తండ్రి హైదరాబాద్‌ ముస్లిం కదా.!’ అని మొదట్లో కాస్త తటపటాయించారు. మా ఇరు కుటుంబాలు ఒకటి, రెండు సార్లు కలిసి మాట్లాడుకున్న తర్వాత అబ్బాయి తల్లితండ్రులు సంతోషంగా పెళ్లికి అంగీకరించారు. అదీ ‘ప్రత్యేక వివాహ చట్టం’ ప్రకారం రిజిస్ట్రర్‌ పద్ధతిలోనే వివాహం జరగాలనే మా షరతుకు లోబడి.! అనుకున్నట్టుగానే దండలమార్చుకోవడంతో అమ్మాయి, అబ్బాయి ఒక్కటయ్యారు. నేను హిందూ సంప్రదాయం నుంచి వచ్చినా, నా భర్తది ముస్లిం నేపథ్యం అయినా, పెళ్లి అయ్యాక ఇద్దరం మతాలకు అతీతంగా మానవవాదాన్ని ఆశ్రయించాం. కనుకే మా దాంపత్యజీవితం ఆనందమయం అయింది. మేము ఏ దేవుడిని ఆరాధించము. మా ఇంట్లో ఎలాంటి మతాచారాలకు చోటుండదు. మా పిల్లల సర్టిఫికేట్లలోనూ కులం, మతం కాలమ్‌ను ఖాళీగా వదిలేశాం. వాటిని విశ్వసించని వ్యక్తులుగా గుర్తిస్తూ, ప్రత్యేక కాలమ్‌ కూడా పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. కులాంతర, మతాంతర వివాహాలతో ఒక్కటైన అణగారిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతున్నాం. 


అదే ఆదర్శవివాహం...

‘ఒక ముస్లింను పెళ్లిచేసుకున్న తర్వాత కూడా నీవు అలాగే బొట్టు పెట్టుకుంటున్నావు. మరి.! నీవు చనిపోయాక, కబరిస్తాన్‌లో ఖననం చేయాలా.! శ్మశానంలో దహనం చేయాలా.!’ అని మా దగ్గరి బంధువు ఒకరు నన్ను ప్రశ్నించారు. ‘ఆ రెండూ కాకుండా, నా భౌతిక కాయాన్ని వైద్యవిద్యార్థుల ప్రయోగాలకు తోడ్పడేలా మెడికల్‌ కాలేజీకి రాసిచ్చాను’ అన్నాను. కులాంతర, మతాంతర వివాహాల్లో ఆచారాలు, సంప్రదాయాల ఆచరణ విషయంలో ఎక్కువగా తేడాలొస్తుంటాయి. అవి ఒక్కోసారి దంపతుల మధ్య తీవ్ర ఘర్షణలనూ లేవనెత్తుతాయి. గొడవలు ఎందుకు అని, కొందరు ఎవరో ఒకరి మతంవైపో, కులంవైపో పూర్తిగా మొగ్గుచూపుతారు. అలా కాకుండా, కులాన్ని, మతాన్ని జీవిత భాగస్వాములిద్దరూ పూర్వపక్షం చేసినప్పుడే వాళ్లది ఆదర్శ వివాహాంగా నిలుస్తుంది. 


ఇప్పుడు ఒక్కరూ నోరుమెదపరే...

కులనిర్మూలన సంఘం ఆధ్వర్యంలోని పెళ్ళిళ్లకు ఆనాటి ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా హాజయ్యేవాళ్లు. అలా కోటేశ్వరరావు, సులోచన ల వివాహానికి అతిథిగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్‌ కులనిర్మూలనకు మద్దతుగా, తన పేరులోని రెడ్డిని తొలగిస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటి రాజకీయ నాయకుల్లో ఆ చిత్తశుద్ధి మచ్చుకైనా కనిపించదు. మొన్న ప్రణయ్‌, నిన్న హేమంత్‌, ఇవాళ నాగరాజు హత్యలతో సమాజమంతా ఉలికిపడినా మన ముఖ్యమంత్రులు, మంత్రులు కనీసం స్పందించకపోవడం అమానవీయం. పైగా స్థానిక నేతలు కూడా నిందితులకు పరోక్షంగావత్తాసు పలకడం కొన్ని ఘటనల్లో చూస్తున్నాం. స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్టు కింద పెళ్లికి దరఖాస్తు చేసుకున్న అమ్మాయి, అబ్బాయి ఫొటోలను రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించడాన్ని నిషేధించాలి. దంపతులకు రక్షణ కల్పించాలి. కులోన్మాద హత్యలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలి. అందుకు కులాంతర, మతాంతర వివాహ పరిరక్షణ చట్టం చేయాలని మేమంతా చాలారోజులుగా పోరాడుతున్నాం. ఆ క్రమంలో ఒక ముసాయిదాను కూడా రూపొందించాం. కులమనే అడ్డుగోడలను పెకలించేందుకు కొన్ని విధానాలను ప్రతి రాజకీయ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరచాలని కోరాం. అయితే, సీపీఐ(ఎం), తెలంగాణ జనసమితి మాత్రమే అందుకు అంగీకరించాయి. కులాన్ని ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ పార్టీలు, నాయకులు మౌనం వీడాలి. కులాంతర, మతాంతర వివాహాలకు అండగా నిలవాలి. తద్వారా ఒక్కటైన దంపతులను ఆదర్శ భారతీయులుగా గుర్తించాలి.

కె. వెంకటేశ్‌ 

ఫొటోలు: అనిల్‌కుమార్‌


ఇదీ చరిత్ర...

కులనిర్మూలన ధ్యేయంతో 1971, నవంబరులో గోపరాజు లవణం సమక్షంలో మానవవాది సురమౌళి కులనిర్మూలనా సంఘం నెలకొల్పారు. మరుసటి ఏడాది నుంచి జాగర్లమూడి వీరాస్వామి, డీజీ రామారావు, వెంకటేశ్వరి, నాగేశ్వర్‌, లక్ష్మి కార్యనిర్వహణలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తర్వాత కాలంలో ప్రఖ్యాత కవి జ్వాలాముఖి, విశ్రాంత ఐపీఎస్‌ మల్లెల బాబూరావు, దేవాదత్‌ వంటి పెద్దలు కులనిర్మూలనా ఉద్యమంలో భాగమయ్యారు. వెయ్యిమంది సభ్యులున్న ఈ సంఘం ప్రతి ఏటా జనవరి26, ఆగస్టు15న కులాంతర, మతాంతర వివాహితుల సమ్మేళనాలను నిర్వహిస్తారు. హోళి ముందురోజు కులమనే దిష్టిబొమ్మను దహనం చేయడం ఈ సంఘం ఆనవాయితీ. 


కులోన్మాద హత్యలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలి. అందుకు కులాంతర, మతాంతర వివాహ పరిరక్షణ చట్టం చేయాలని మేమంతా చాలారోజులుగా పోరాడుతున్నాం. ఆ క్రమంలో ఒక ముసాయిదాను కూడా రూపొందించాం.

Updated Date - 2022-05-16T05:32:57+05:30 IST