కలిసి పనిచేద్దాం... విజయం సాధిద్దాం

ABN , First Publish Date - 2021-06-23T06:28:04+05:30 IST

నాయకులు, కార్యర్తలు కలిసి పని చేసి విజయం సాధిద్దామని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

కలిసి పనిచేద్దాం... విజయం సాధిద్దాం
ఈటలకు తిలకం దిద్దుతున్న మహిళలు

- వీణవంక మండలంలో 90శాతం ఓట్లు మాకే

- తోడేళ్ల దండ్లు వస్తున్నాయి.. జాగ్రత్త

- కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలే నా బలం

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

వీణవంక, జూన్‌ 22: నాయకులు, కార్యర్తలు కలిసి పని చేసి విజయం సాధిద్దామని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం వీణవంక మండలం చల్లూరులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్‌ మాట్లాడారు. వీణవంక మండలంలో 90శాతం ఓట్లు కమలం గుర్తుకే వస్తాయన్నారు. హుజూరాబాద్‌లో ఏం జరుగుతోందని అమెరికా, దేశవ్యాప్తంగా ఉన్న వారు ఎదురుచూస్తున్నారని, ఈటల రాజేందర్‌ను గెలిపించుకొని ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. వీణవంక మండల ప్రజలకు ఎవరు ఉద్యమకారులో ద్రోహులొ తెలుసన్నారు. మండలానికి ఒకరు చొప్పున ఐదుగురు మంత్రులు గ్రామానికి ఒక ఎమ్మెల్యే లెక్క గొర్ల మంద మీద తోడేళ్లు పడ్డట్లు పడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటున్నారని, అసలు చిల్లర రాజకీయాలు చేసేదెవరని ప్రశ్నించారు. సంపూర్ణ మెజార్టీ ఉన్నా కాంగ్రెస్‌ పార్టీ వారిని ఎందుకు చేర్చుకున్నారో చెప్పాలన్నారు. పార్టీలు మారిన నేతలు రాజీనామా చేయకుండా మంత్రులుగా వెలగబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు దిగుతారని, పెన్షన్లు, నిధులు ఇస్తారని, ఇది చిల్లర రాజకీయం కాదా అని ప్రశ్నించారు. 20 ఏళ్లుగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునేదన్నారు. మీకు దమ్ము ఉంటే మీ సిద్ధాంతం చెప్పుకోవాలని, ఘర్షణలకు పాల్పడుతామంటే మాత్రం సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో డబ్బులు, మద్యంతో ఎన్నికలు జరగలేదన్నారు. లక్షల రూపాయలు ఇచ్చి కుల సంఘాలు, నాయకులను కొనుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో జరిగే రాజకీయాలను చూసి పక్క నియోజకౄవర్గం వారు కూడా మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బాగుండు అని అనుకుంటున్నారన్నారు. ఇన్నాళ్లు రాజకీయ నాయకులే బానిసలుగా ఉంటారనుకున్నాం.. కానీ తెలంగాణలో అధికారులను కూడా బానిసలుగా మార్చరన్నారు. అనంతరం వీణవంక మండల ఇన్‌చార్జీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్‌లో ఈటల గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు పింగిలి రమేష్‌, రాయిశెట్టి లత శ్రీనివాస్‌, పెద్ది మల్లారెడ్డి, ఎనగంటి విజయ శ్రీనివాస్‌, మారముల్ల కొంరయ్య, గడ్డం కుమారస్వామి, పుప్పాల రఘు, చాడ రాజేందర్‌రెడ్డి, మడ్గూరి సమ్మిరెడ్డి, నర్సింహారాజు, గెల్లు శ్రీనివాస్‌, మహ్మద్‌ అఖిల్‌, గాలేటి జ్యోతి సురేందర్‌రెడ్డి, సంపత్‌రావు, రామిడి ఆదిరెడ్డి, దాసారపు శ్రీనివాస్‌, గాజుల శ్యాంసన్‌, రాపర్తి అఖిల్‌, మోటం వెంకటేష్‌, కుమార్‌, మాడ గౌతమ్‌రెడ్డి, పొన్నాల అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ బీజేపీలో పలువురి చేరిక

వీణవంక మండలంలోని గంగారం గ్రామానికి చెందిన ఆరుగురు వార్డు సభ్యులు ఈటల రాజేందర్‌ సమక్షంలో బీజేపీలో  చేరారు. ఈ సందర్భంగా ఈటల వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీణవంకలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు.

Updated Date - 2021-06-23T06:28:04+05:30 IST