మహనీయుల స్ఫూర్తితో నడుద్దాం

ABN , First Publish Date - 2022-08-16T06:02:34+05:30 IST

మహనీయుల స్ఫూర్తితో మరింత అభివృద్ధి పథంలో పయనిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మహనీయుల స్ఫూర్తితో నడుద్దాం
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి బుగ్గన

  1. 75 ఏళ్లలో ఎంతో ప్రగతిని సాధించాం
  2. సమష్టి కృషితోనే అగ్రగామిగా జిల్లా 
  3. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో  ఇనచార్జి మంత్రి బుగ్గన  
  4.   సమరయోధుల కుటుంబాలకు సన్మానం
  5.   ఆకట్టుకున్న వివిధ శాఖ సంక్షేమ, అభివృద్ధి శకటాలు

కర్నూలు(కల్చరల్‌), కర్నూలు(కలెక్టరేట్‌) ఆగస్టు 15: మహనీయుల స్ఫూర్తితో మరింత అభివృద్ధి పథంలో పయనిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం 76వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలో వైభవంగా జరిగాయి. నగరంలోని పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 9.06 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి,   మైదానంలో ప్రత్యేక వాహనంపై తిరుగుతూ పోలీసు సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన 9.16 గంటలకు ఆయన ప్రసంగం ఆరంభించారు. ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల  స్వాంతత్య్ర దేశంలో ఎంతో ప్రగతిని సాధించామని అన్నారు.  అన్ని రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా రాణిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదామని అన్నారు.  స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతలకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువేనని అన్నారు.   దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటికి తలసరి ఆదాయం రూ.230 అని,   డాలర్లలో అయితే  2.84 డాలర్లని, నేడు 75 ఏళ్ల దేశ ప్రగతిలో మన తలసరి ఆదాయం 2.8 డాలర్ల నుంచి 2 వేల డాలర్లకు చేరుకోవడం గర్వంగా ఉందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి ఇతర దేశాల నుంచి  ఓడల ద్వారా ధాన్యం వస్తేనే భోజనం చేసే పరిస్థితి ఉండేదని, నేడు ధాన్యం, పాలు, పశుసంపద వంటి విషయాల్లో ప్రపంచంలోనే మన దేశం  అత్యున్నత స్థానంలో ఉన్నదని  అన్నారు.   బ్రిటీషు పాలనలో మన పరిశ్రమలు అభివృద్ధి కాలేదని,    నేడు హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం ద్వారా అన్ని రకాలుగా ప్రపంచంలోనే ముందంజలో ఉన్నామని చెప్పారు. 

 విద్య, వైజ్ఞానిక, ప్రజారోగ్యంలో ఎంతో ప్రగతి...

  1947లో దేశంలో సామాన్య మానవుని సగటు ఆయుర్దాయం 32 ఏళ్లు కాగా, నేడు 70 ఏళ్లు జీవించే పరిస్థితుల్లో ఉందన్నారు. 23 శాతం మంది మలేరియాతో,    ప్రతిరోజూ 500 మంది పిల్లలకు పక్షవాతం వచ్చేదని అన్నారు. నేడు   మలేరియా,    పోలియో సంపూర్ణంగా నిర్మూలించామని అన్నారు.   1947లో లక్షమంది మహిళల్లో ప్రసవ సందర్భంగా 2వేల మంది మరణించేవారని, నేడు అది వంద సంఖ్యలో ఉందని అన్నారు.   1947లో ప్రతి ఐదుగురిలో నలుగురు నిరక్షరాస్యులుకాగా నేడు  నిరక్ష్యరాస్యను చాలా వరకు అధిగమించామని అన్నారు.   1963లో కేరళలో కుంభ అనే ప్రాంతంలో మొట్టమొదటి శాటిలైట్‌ను పైకి పంపించేందుకు ప్రయత్నించగా,  ఈరోజు మనం వేరే దేశాలకు సంబంధించిన శాటిలైట్లను కూడా పైకి పంపించే స్థాయికి ఎదిగామని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన, కంగాటి శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి బుగ్గన కలిసి వారిని శాలువతో ఘనంగా సత్కరించారు. 

 ఆకట్టుకున్న శకటాలు:

అనంతరం 11.20 గంటలకు పరేడ్‌ మైదానంలో వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు. నిరాశ్రయులకు ఆశ్రయం గృనిర్మాణం అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ గృహనిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. మనబడి-నాడు నేడు పనులను వివరిస్తూ, పాఠశాలల నవనీకరణ తదితర కార్యక్రమాలను వివరిస్తూ సమగ్ర శిక్షా మరియు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన శకటంతో పాటు పిల్లల సంరక్షణలో తల్లిదండ్రులకు చేయూత నిద్దాం.. చిన్నారుల్లో పోషక పోషకలోపాన్ని నివారిద్దాం అన్న నినాదంతో ఏర్పాటు చేసిన జిల్లా స్త్రీ  శిశుసంక్షేమశాఖ శకటాలు సంయుక్తంగా  రెండో   స్థానంలో నిలిచాయి.  వైద్య ఆరోగ్యశాఖ శకటం, 108 వాహనం, 104 వాహన శకటం మూడో  స్థానంలో నిలిచాయి.  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వ్యవసాయశాఖ శకటాలు నాలుగో స్థానంలోను,  దిశా చట్టంపై అవగాహన కల్పిస్తూ మహిళా పోలీసులు ఏర్పాటు చేసిన శకటం ఐదో  స్థానంలో నిలిచాయి.  అత్యాధునిక నిఘాతో పాల్‌కాన వాహన శకటం, అగ్నిమాపక శకటాలు ప్రజలకు అందిస్తున్న సేవలను   వివరించాయి. పాడి పశుపోషణకు ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందంటూ పశుసంవర్ధకశాఖ శకటం, ఎండీయూ వాహనం ద్వారా ఇంటింటికి రేషన పంపిణీ చేస్తున్నామంటూ పౌరసరఫరాలశాఖ శకటాలను ప్రదర్శించారు. అమృత సరోవర్‌ మహోత్సవం కార్యక్రమాన్ని వివరిస్తూ జిల్లా నీటియాజమాన్య సంస్థ శకటంతో పాటు డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి జాతీయ జెండాతో ముందు నడిచారు.   మొత్తం 13 శాఖల శకటాలను ప్రదర్శించారు. 

333 మందికి ప్రసంసా పత్రాలు:

జిల్లాలో వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 333 మంది ఉద్యోగులను ప్రశంసా పత్రాలకు జిల్లా అధికారులు ఎంపిక చేశారు. అయితే ఈ వేడుకల్లో జిల్లా స్థాయి అధికారులకు 20 మందికి మాత్రమే మంత్రి బుగ్గన్న ప్రసంసాపత్రాలను అందజేశారు.   కొందరు హెచవోడీలు మైదానంలోనే ప్రసంసా పత్రాలను ఉద్యోగులకు అందజేశారు. మరికొందరు వారివారి కార్యాలయాల్లో అందజేశారు.  

 ఉత్తమ ఉపాధ్యాయురాలిగా  ఎం.కళ్యాణి కుమారి:

పత్తికొండ మండలం జె.ఎం. తండాలోని ఎంపీపీ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచిన ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారిని ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆమెకు అవార్డును అందజేసి సన్మానించారు.   

స్టాల్స్‌ పరిశీలన: 

18 శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందరరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవతేజ్‌, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన  సందర్శించారు.  సమాచార పౌరసంబంధాలశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, డీఆర్‌డీఏ, జిల్లా మహిళా  శిశు అభివృద్ధి సంస్థ, సమగ్ర శిక్షా   పాఠశాలల విద్యాశాఖ, పౌరసరఫరాలశాఖ, మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ, వ్యవసాయశాఖ, ఏపీ సూక్ష్మ నీటి సాగు పథకం, ఎస్సీ కార్పొరేషన, జిల్లా షెడ్యూల్డ్‌ కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్‌, జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్‌, గిరిజన సంక్షేమశాఖ, చేనేత శాఖ ఆధ్వర్యంలో వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు, ఇండియన రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, జగనన్న జీవక్రాంతి, పాలవెలువ పథకాలతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,  వయోవృద్దుల సంక్షేమ శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 








Updated Date - 2022-08-16T06:02:34+05:30 IST