జిల్లా సాధనకు కలిసికట్టుగా ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2022-01-28T04:31:08+05:30 IST

మార్కాపురం జిల్లా సాధనకు కలసికట్టుగా ఉద్యమిద్దామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వెనుకబడిన డివిజన్‌ మార్కాపురం అని చెప్పారు.

జిల్లా సాధనకు కలిసికట్టుగా ఉద్యమిద్దాం
గిద్దలూరులో ప్రదర్శన నిర్వహిస్తున్న పూర్వవిద్యార్థులు, ఎర్రగొండపాలెంలో ర్యాలీ చేస్తున్న వైసీపీ నాయకులు

‘మార్కాపురం’పై త్వరలో కార్యాచరణ

అఖిలపక్ష సంఘాల నాయకుల సమావేశం


మార్కాపురం(వన్‌టౌన్‌), జనవరి 27 : మార్కాపురం జిల్లా సాధనకు కలసికట్టుగా ఉద్యమిద్దామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వెనుకబడిన డివిజన్‌ మార్కాపురం అని చెప్పారు. ఈ ప్రాంతంలో వర్షపాతం ఉండదని, పరిశ్రమలు లేవని, అభివృద్ధి ఏమాత్రం లేదని వివరించారు. ఇటువంటి దుర్భర పరిస్థితులలో మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించకుండా వైసీపీ నేతలు ఎందుకు విస్మరించారో అర్థం కావడంలేదన్నారు. ఈ ప్రాంతం ఓట్లు, ప్రజల శ్రేయస్సు వైసీపీ నాయకులకు పట్టదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టినా వారికి ఏమాత్రం ప్రేమలేదన్నారు. మంత్రి ఉన్నా ఫలితం లేదని, ఆయన పదవిని కాపాడుకోవడానికే సమయం అంతా సరిపోతుందని చెప్పారు. నల్లమల్ల అటవీ ప్రాంతమైన చివరి గ్రామం నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలు వెళ్లాలంటే 250 కి.మీ. ప్రయాణం చేయాల్సి ఉందని, అదే మార్కాపురాన్ని జిల్లాగా చేస్తే సమస్యలు తీరుతాయని వివరించారు. పశ్చిమ ప్రాంతంలోని 5 నియోజకవర్గాల నుంచి ఉద్యమం జరగాలని, పోరాటాల ద్వారానే ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమానికి సహకరించాలని, సోమవారం నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలవుతుందని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థులు, సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం బాధపడకుండా ఉండాలంటే జిల్లా సాధనే ఏకైక లక్ష్యం కావాలని తెలిపారు. కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి షేక్‌ సైదా మాట్లాడుతూ జిల్లా సాధనకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని, పోరాటాలు చేస్తేనే తెలంగాణ మాదిరి మార్కాపురం జిల్లా సాధించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేఎం జిల్లా అధ్యక్షుడు పి.వి.కృష్ణారావు, సీపీఐ రాష్ట్ర సభ్యుడు అందె నాసరయ్య, ఆమ్‌ఆద్మీ జిల్లా నాయకులు సుదర్శన్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్‌, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, ఎంపీజే రాష్ట్ర కోశాధికారి ఎస్‌.ఎ.రజాక్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, జవ్వాజి రామానుజలరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


వైపాలెంలో అధికార వైసీపీ నేతల ర్యాలీ

ఎర్రగొండపాలెం, జనవరి 27 : మార్కాపురాన్ని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లాల విభజనకు సంఘీభావంగా వారు గురువారం ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. రాష్ట్రంలోనే వెనకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎర్రగొండపాలెం నుంచి ఒంగోలుకు 150  కిలోమీటర్ల దూరం ఉందని, ప్రజల ఇబ్బందులను గుర్తించి మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ కిరణ్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ మార్తా సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు నరెడ్ల వెంకటరెడ్డి, రెంటపల్లి సుబ్బారెడ్డి, చెన్నయ్య, ముసలారెడ్డి, సర్పంచి అరుణాబాయి పాల్గొన్నారు. 


నంద్యాల జిల్లాలో విలీనం చేయాలి

గిద్దలూరు, జనవరి 27 : గిద్దలూరు నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ స్థానిక వివేకానంద డిగ్రీ కళాశాలలో చదివిన 1983-88 పూర్వ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందచేశారు. జిల్లాల పునర్విభజన వలన గిద్దలూరు నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలుకు బదులు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గాన్ని విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని దశాబ్దాల తరబడి గిద్దలూరు నియోజకవర్గం నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోనే ఉన్నదని, అక్కడి ప్రజలతో, ప్రాంతాలతో, నాయకులతో సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వం, పాలకులు, అధికారులు చర్యలు తీసుకుని నంద్యాలలో విలీనం చేయాలని కోరారు. పూర్వవిద్యార్థుల సంఘం ప్రతినిధులు శివపురం మురళీక్రిష్ణ, తులసిబాబు, పి.హనుమంతరెడ్డి, దర్శి రామసుబ్బారావు, చీతిరాల ప్రభాకర్‌, సూరె సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T04:31:08+05:30 IST