క్రికెట్‌ టీమ్‌లా కలిసి పని చేద్దాం

ABN , First Publish Date - 2020-09-17T08:30:37+05:30 IST

క్రికెట్‌ టీమ్‌లా కలిసి పని చేద్దాం

క్రికెట్‌ టీమ్‌లా కలిసి పని చేద్దాం

  • ఒకరో, ఇద్దరో కష్టపడితే గెలవలేము
  • 2023 ఎన్నికలు.. మనకు ఓ చాలెంజ్‌
  • కాంగ్రెస్‌ నేతలకు ఠాగూర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘క్రికెట్‌ టీమ్‌లా అందరం కలిసి కట్టుగా పని చేద్దాం. జట్టులో ఒకరో, ఇద్దరో కష్టపడితే క్రికెట్‌ మ్యాచ్‌ గెలవలేం. అందరం కలిసి కట్టుగా కష్టపడితేనే గెలవగలుగుతాం’’ అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ సూచించారు. 2023 ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుని పనిచేద్దామని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీకి బహుమతిగా ఇద్దామని వ్యాఖ్యానించారు. జూమ్‌ యాప్‌ ద్వారా టీపీసీసీ కోర్‌ కమిటీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఠాగూర్‌ మాట్లాడుతూ రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ మొగ్గు చూపిందన్నారు. సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని అన్నారు. క్రికెట్‌లో సచిన్‌, ధోనీలా తెలంగాణ కాంగ్రెస్‌లోనూ బలమైన నాయకులు ఉన్నారని, అయుతే క్రికెట్‌లో ఒక్కరో, ఇద్దరో కష్టపడితే గెలవరని.


. టీమ్‌లా కష్టపడితేనే గెలుస్తామన్నారు. దుబ్బాక ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలో బూత్‌, బ్లాక్‌ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణ అవసరమని, సోషల్‌ మీడియాను ఇష్టానుసారంగా వాడొద్దని హితవు పలికారు. ప్రతి 15 రోజులకోసారి కోర్‌ కమిటీ సమావేశాలుంటాయని స్పష్టం చేశారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ ఠాగూర్‌ ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసుకుని, 2023 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత తాను హైదరాబాద్‌ వస్తానని, అన్ని అంశాలు కలిసి చర్చించుకోవచ్చని ఠాగూర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-17T08:30:37+05:30 IST