మహానాడును జయప్రదం చేద్దాం

ABN , First Publish Date - 2022-05-26T07:56:20+05:30 IST

ఒంగోలులో శుక్రవారం ప్రారంభం కానున్న మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అందుకు ముఖ్య నేతలు, కార్యకర్తలు బయలుదేరాలని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సుగుణమ్మ పిలుపునిచ్చారు.

మహానాడును జయప్రదం చేద్దాం
ఎన్టీఆర్‌కు టీడీపీ నాయకుల నివాళులు

తిరుపతి టీడీపీ నేతల పిలుపు


తిరుపతి, మే 25 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో శుక్రవారం ప్రారంభం కానున్న మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అందుకు ముఖ్య నేతలు, కార్యకర్తలు బయలుదేరాలని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సుగుణమ్మ పిలుపునిచ్చారు. మహానాడు సన్నాహక కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో మినీ మహానాడు జరిగింది. కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన వలన రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ నేత చంద్రబాబును అవమానించిన తీరును ఇంకా ప్రజలు మరిచిపోలేదన్నారు. మళ్లీ ముఖ్యమంత్రి గానే అసెంబ్లీలోకి అడుగుపెడతానన్న ఆయన శపథాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. చంద్రబాబు సీఎం అయ్యేంతరవరకు మన పోరాటం ఆగకూడదన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. తిరుపతిలో బీసీ భవన్‌ నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అనంతరం అధికార పార్టీ తీరుతో తిరుపతిలో తలెత్తుతున్న పరిస్థితులపై తీర్మానాలు చేశారు. శాంతి భద్రతలు లోపించడం, మహిళలపై పెరిగిపోయిన అఘాయిత్యాలు, టీటీడీ, నగరపాలక సంస్థల్లో లోపాలు, సమస్యలపై మహానాడులో చర్చించేందుకు తీర్మానించారు.మాజీ మంత్రి పరసా రత్నం, టీడీపీ నేతలు డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, మబ్బు దేవనారాయణ రెడ్డి, పులిగోరు మురళీకృష్ణా రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, బుల్లెట్‌ రమణ, సూరా సుధాకర రెడ్డి, శ్రీధర్‌ వర్మ, జేబీ శ్రీనివాస్‌, ఊట్ల సురేంద్ర నాయుడు, వట్టిగుంట చిన్నబాబు, మహేష్‌ యాదవ్‌, రుద్రకోటి సదాశివం, డాక్టర్‌ కోడూరు బాలసుబ్రమణ్యం, పుష్పావతి, విజయలక్ష్మి, బ్యాంకు శాంతమ్మ, కుమారమ్మ, మధు, ఆర్పీ, ఆలీఖాన్‌ తదితరులతో పాటు 50 డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T07:56:20+05:30 IST