స్వాతంత్య్ర స్ఫూర్తి ఉట్టిపడేలా..

ABN , First Publish Date - 2022-08-14T05:27:04+05:30 IST

స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయనగరంలో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు.

స్వాతంత్య్ర స్ఫూర్తి ఉట్టిపడేలా..
ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు


టీడీపీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌మహోత్సవ ర్యాలీ
విజయనగరం రూరల్‌, ఆగస్టు 13:
స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయనగరంలో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా త్రివర్ణ పతాకంతో చేపట్టిన ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రదర్శనను గురజాడ విగ్రహద్ద కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు ప్రారంభించారు. మూడులాంతర్లు, గంటస్తంభం మీదుగా కన్యకాపరమేశ్వరీ ఆలయం రోడ్డు వరకూ సాగింది.. తొలుత గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ దేశం కోసం స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజ్జపు ప్రసాద్‌, కనకల మురళీమోహన్‌, కర్రోతు నర్సింగరావు, బొద్దల నర్సింగరావు, ప్రసాదుల ప్రసాద్‌, గంటా పోలినాయుడు, ఎస్‌కెఎం భాష తదితరులు పాల్గొన్నారు.

అపూర్వ సం‘స్థానం’
బొబ్బిలి : చారిత్రాత్మకమైన బొబ్బిలి పట్టణంలో బ్రిటీషు పాలనా కాలంలో 1864లో మద్రాసు ఉమ్మడి రాష్ర్టాల ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆఖరి సంస్థానాధీశులు రాజా ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు బాలబాలికల కోసం పాఠశాల ఏర్పాటు  చేశారు. సంస్థానం మిడిల్‌ స్కూల్‌గా ఏర్పాటైన ఈ పాఠశాల ఉన్నత పాఠశాలగా 1882లో అప్‌గ్రేడ్‌ అయింది. ‘యు‘ ఆకారంలో భవనాలతో విశాలమైదానంతో పాఠశాలను తీర్చిదిద్దారు. 1908లో మరిన్ని హంగులను సమకూర్చారు. త్రివిధ దళాల అధిపతిగా పనిచేసిన జనరల్‌ కేవీ కృష్ణారావు ఇక్కడ విద్యార్థే. మరో పూర్వ విద్యార్థి ఎన్‌వీజీ కృష్ణస్వామి కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. పాఠశాల వ్యవస్థాపకులైన రాజా ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు స్వతహాగా పోలో క్రీడాకారుడు కావడంతో విశాలమైదానాన్ని సమకూర్చి అందరినీ ప్రోత్సహించారు.

ఉద్యమానికి ఊతం
చీపురుపల్లి : స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చీపురుపల్లికి స్థానం కల్పించారు మొదలవలస అబ్బాయినాయుడు. శ్రీకాకుళం జిల్లా షేర్‌ మహ్మద్‌పురంలో 1914లో జన్మించిన ఆయన అక్కడ్నించి చీపురుపల్లికి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పచుకున్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాటం సలిపిన ప్రముఖ నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం, వీవీ గిరి వంటి నేతలతో కలిసి ఉద్యమం కోసం పనిచేశారు. యుక్త వయసులోనే ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న చౌదరి సత్యన్నారాయణ, సర్దార్‌ గౌతు లచ్చన్నలను ఆదర్శంగా తీసుకొని పని చేశారు. బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకిస్తూ ఆ రోజుల్లో జి.సిగడాం, పొందూరు స్టేషన్ల మధ్య రైలు పట్టాలను ధ్వంసం చేశారు. టెలిఫోన్‌ తీగల్ని కట్‌ చేసి బ్రిటిష్‌ పాలకుల మధ్య కమ్యూనికేషన్లకు అంతరాయం కల్పించారు. ఇందుకు గాను కొద్దిరోజులు జైలు జీవితం అనుభవించారు.

ఆకట్టుకున్న తిరంగా ర్యాలీ
విజయనగరం/ కలెక్టరేట్‌, ఆగష్టు 13: జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తిరంగా ర్యాలీ దేశభక్తిని చాటింది. ఇంటింటికీ జాతీయ పతాకం పేరుతో ప్రదర్శన ప్రారంభించారు. కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ, మెప్మా, స్ర్తీ శిశు సంక్షేమం, వైద్యారోగ్య శాఖల సిబ్బంది చేపట్టిన ర్యాలీని స్థానిక చెన్నకేశవరెడ్డి భవనం వద్ద డీఆర్‌డీఏ  పీడీ ఎ.కళ్యాణచక్రవర్తి ప్రారంభించారు. మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వైపు నుంచి సాగారు. తిరిగి కలెక్టరేట్‌కు చేరుకున్నాక జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతాకానికి గౌరవవందనం నిర్వహించి మువ్వన్నెల బెలూన్లు ఎగురవేశారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌  బి.పద్మావతి, మెప్మా పీడీ సుధాకరరావు మాట్లాడుతూ అజాదీకా అమృత మహోత్సవాల ప్రాధాన్యతను, జాతీయజెండాను గౌరవించే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతకుమారి, జిల్లా యువజన సంక్షేమాధికారి విక్రమాదిత్య, డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T05:27:04+05:30 IST